ప్రత్యేక రైలు.. ప్రయోజనమెంత?

ప్రత్యేక రైలు..  ప్రయోజనమెంత?


ప్రస్తుతానికి ఆదరణ అంతంతమాత్రమే

నాలుగు గంటల్లో హైదరాబాద్ చేరడం

కష్టమేనంటున్న రైల్వే వర్గాలు

బస్సులపై కొందరు అధికారుల ఆసక్తి


 

సాక్షి, విజయవాడ: రాజధాని వాసుల కోసం విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12795)కు ప్రయాణికుల నుంచి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. మూడు రోజులుగా ఈ రైలు నడుపుతున్నారు. ప్రయాణికులు ఏసీ బోగీలపైనే ఆసక్తి చూపుతున్నారు.

 

జనరల్‌లో రెండు మూడు వందల మందే..

ఈ రైలును 14 బోగీలతో నడుపుతున్నారు. ఇందులో రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు. మిగిలిన 12 బోగీల్లో రెండు ఏసీ చైర్ కార్లు, ఐదు సీటింగ్ రిజర్వుడ్ బోగీలు, ఐదు సీటింగ్ అన్ రిజర్వుడు బోగీలు, రెండు ఏసీ బోగీల్లోనూ కలిసి 156 సీట్లు ఉంటాయి. ఇందులో 60 వరకు నిండుతున్నాయి. సాధారణ రిజర్వుడు బోగీల్లో కేవలం 100 నుంచి 120 మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్ బోగీలు కూడా అంతకు మించి ఉండటం లేదు. కాగా విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో 6.30 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు గంట ముందుగా కొత్త రైలులో గుంటూరు నుంచి వచ్చే ఉద్యోగస్తులు తిరిగి వెళ్లుతున్నారని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇదే రైలులో గుంటూరు వెళ్లే ప్రయాణికులు సైతం ఉండడంతో కొంత మేర జనాలతో కనిపిస్తోంది.  

 

ఆదరణ ఉంటుందా..?

విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడిపే ఈ రైలుకు ప్రయాణికుల నుంచి ఎంత మేర ఆదరణ ఉంటుందనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతం జాతీయ రహదారి అభివృద్ధి చేయడంతో నాలుగు గంటల్లో విజయవాడ నుంచి ైెహ దరాబాద్ వెళుతున్నారు. రైలులో ఐదున్నర గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. నిర్ణీత సమయానికి కొద్దిగా ఆలస్యమైనా రైలు వెళ్లిపోతుంది. బస్సులతో ఈ ఇబ్బంది ఉండదంటున్నారు ప్రయాణికులు. 27 నుంచి ఉద్యోగస్తులు తరలివస్తే... వారు వెలగపూడి నుంచి విజయవాడగానీ, గుంటూరుగానీ వెళ్లి ఈ రైలు ఎక్కాలంటే కనీసం గంట ముందు బయలుదేరాలి.



విజయవాడలో 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరితే 4.30 గంటలకు ఆఫీసుల నుంచి రావాలి. అలాంటప్పుడు తెల్లవారుజామున లేచి అక్కడ రైలు ఎక్కాలి. అందువల్ల ప్రయాణికులు రైలు కంటే బస్సులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని సమాచారం. హైదరాబాద్‌లో ఎల్‌బీనగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, హయ్యత్‌నగర్ ప్రాంతాల వాసులు బస్సుల్లోనే వస్తారని, బాలానగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఈ రైలుపై ఆసక్తి చూపుతారని రైల్వే వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతానికి రైలుకు ఆదరణ అంతంతమాత్రంగా ఉన్నా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని, వారాంతంలో డిమాండ్ బాగా ఉంటుందని చెబుతున్నారు.

 

 నాలుగు గంటల్లో రావడం కష్టమే...

ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి 5.30 గంటల్లో కాకుండా కనీసం 4 గంటల్లో రాజధానికి వచ్చే విధంగా రైలు నడపాలని రైల్వే అధికారులకు సూచించారు. అది ఇప్పట్లో సాధ్యపడదని రైల్వే అధికారులు అంటున్నారు. దీని కోసం  రైల్వే ట్రాక్ మార్చాలని, వేగం పెంచితే సిగ్నలింగ్, క్రాసింగ్ రైళ్లను చూసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో డిమాండ్ ఉన్నా లేకున్నా సమయం మాత్రం కుదించడం కష్టమేనంటున్నారు. అయితే రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వారు ఈ సర్వీసును వినియోగించుకుంటారని అంచనా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top