కటకటాల్లోకట్నపిశాచాలు


 ఆదోని టౌన్/రూరల్: భార్యను కడతేర్చిన కేసులో కుటుంబమంతా  కటకటాల పాలైంది.  వివాహిత హత్య కేసులో  భర్త, అత్త, మరిది, ఆడపడుచుకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదోనిలోని జిల్లా రెండవ అదనపు కోర్టు జడ్జి సుబ్రమణ్యం గురువారం తీర్పునిచ్చారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నీలకంఠప్ప, రంగమ్మ దంపతుల కూతురు జయశ్రీ ఆలియాస్ మల్లేశ్వరికి ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నవీన్‌కూమార్‌తో 2009 వసంవత్సరంలో ఘనంగా పెళ్లి జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలకు ఆమె తల్లి దండ్రులు లోటు లేకుండా చూశారు. కొంత కాలం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు.

 

 అయితే కొంత కాలానికే అత్తింటి వారికి అదనపు కట్నంపై ఆశ పెరిగింది. ఏదో వంక పెడుతూ జయశ్రీని మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. అదనపు కట్నం తెస్తే తప్ప కాపురం చేయనంటూ భర్త, అత్త సరోజమ్మ, మరిది రామకృష్ణ, అడపడుచు రాధమ్మ ప్రతి రోజు ఆమెకు నరకం చూపారు.



అయితే జయశ్రీ మాత్రం తాను ఎలాంటి పరిస్థితిలోను అదనపు కట్నం తీసుకు వచ్చేది లేదని మొండికేశారు. దీంతో ఆమెను వదిలించుకోవాలనే కుట్ర పన్ని 2010, ఏప్రిల్ 16న జయశ్రీ ఒంటరిగా ఇంట్లో ఉండగా ఒంటిపై కి రోసిన్ పోసి నిప్పంటించారు. ఆమె మంట ల్లో చిక్కుకుని విల విల కొట్టుకుంటుండగా ఇక పీడ వదిలి పోతుందిలే అని భావించి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటి స్థానిక తహశీల్దారు కొనఊపిరితో ఉన్న జయశ్రీతో ఇంట్లోనే మరణ వాంగ్మూలం నమోదు చేశారు.



 పరిస్థితి విషమంగా మారడంతో కోలుకోలేక ఆమె మృతి చెందింది. మృతురాలి మరణ వాంగ్మూలం, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదోని  కోర్టులో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు విచారణ కొనసాగింది. విచారణలో ఈ నలుగురిపై నేరం రుజువైంది. దీంతో జిల్లా రెండవ అదనపు సెషన్స్ జడ్జి సుబ్రమణ్యం నిందితులకు పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు.  నిందితులను పోలీసులు సబ్ జైలుకు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top