దిగువ ఎడారే!


రాజంపేట: ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నీటి కొరత తీరుతుంది. పచ్చనిపొలాలు రైతన్న ఇంట సిరులు కురిపిస్తాయి... ఇదంతా నాణేనికి ఒకవైపే. ప్రాజెక్టు నిర్మాణంతో పంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని.. మట్లిరాజుల కాలం నాటి ఊటకాల్వలు ఒట్టిపోయాయని రైతన్నల ఆవేదన మరో కోణం. ఇది చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని నందలూరు, పెనగలూరు మండలాలకు చెంది వేలాది మంది రైతుల పరిస్ధితి. అన్నమయ్య జలాశయం నిర్మితం సమయంలో ఎగువ, దిగువ ప్రాంతాలకు సమానంగా నీటి పంపిణీలో న్యాయం జరిగాలి. అయితే కేవలం ఎగువ ప్రాంత అవసరాలకే అన్నట్లు ఉంది. దిగువ ప్రాంతాల్లో నందలూరు, పెనగలూరు మండలాలున్నాయి. యేటిలో నీటి ప్రవాహంతో ఒకప్పుడు ఈ ప్రాంతంలో చక్కగా పంటలు పండేవి. ఇప్పుడు డ్యాం పుణ్యమా అని నిర్వీర్యమయ్యాయి.

 

 డ్యాం ఫుల్ అయితేనే..

 జలాశయం నిండి విడుదల అరుుతే తప్ప దిగువ ప్రాంతానికి నీటి చుక్క రాదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అయితే వేసవిలో దిగువకు నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా దిగువ ప్రాంతానికి నందలూరు కెనాల్‌ను నిర్మిస్తేనే ప్రయోజనమని రైతులు కోరుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తమ కడుపు కొడుతోంద ని దిగువ రెతులు ఆవేదన చెందుతున్నారు.

 

 డ్యాం నిర్మాణం ఇలా..

 మొదట తొగురుపేట వద్ద డ్యాంకు శంకుస్ధాపన శిలాఫలకం వేశారు. పలు రకాల కారణాలు చూపి ఆ తర్వాత బాదనగడ్డ వద్ద చెయ్యేరు ప్రాజెక్టు నిర్మాణానికి 1976లో అప్పటి సీఎం జలగంవెంగళరావు శంకుస్ధాపన చేశారు. నిర్మాణం ఆరంభమైన 27సంవత్సరాలకు పూర్తి అరుుంది.  2003లో అప్పటి భారీ నీటీపారుదలశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రాజెక్టు వల్ల రాజంపేట, పుల్లంపేట మండలాలు సస్యశ్యామలమయ్యాయి. భూగర్భజలాలు బాగా పెరిగి కరువును పారదోలింది. డ్యాం నిండి నీటి విడుదల అవకాశాలు లేకపోవడంతో దిగువ ప్రాంతం పరిస్థితి మాత్రం దయనీయంగా తయూరైంది.

 

 ఎడారిగా దిగువప్రాంతం..

 దిగువ ప్రాంతాలైన నందలూరు, పెనగలూరు మండలాల్లోని రైతుల కష్టాలు చెప్పనలివికాదు. చెయ్యేరు నది ఎండిపోయి ఎడారిలా ఉంది. భూగర్భజలాల అడుగంటిపోయాయి. చరిత్ర కాలంలో ఈ రెండు మండలాల్లో రైతుల కోసం మట్టిరాజుల నిర్మించిన 23 ఊటకాల్వలు ఒట్టిపోయి వాటి ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. 18వేల ఎకరాల భూములు సాగుకు నోచుకోవడంలేదు. నందలూరు మండలంలోని పాటూరు, నాగిరెడ్డిపల్లె, నందలూరు, లేబాక తదితర ప్రాంతాల్లో చుక్కనీరు లేదు.

 

 చెయ్యేటిలో చేతితో ఇసుక తీసినా నీరొచ్చేది

 చెయ్యేటిలో చేతితో ఇసుక తీసినా నీరొచ్చేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. అన్నమయ్య డ్యామే కారణం. పెనగలూరు, నందలూరు మండలాలకు డ్యాం నిర్మాణం శాపంగా మారింది. కనీసం దిగువ ప్రాంతాల గురించి నిర్మాణ రోజుల్లో ప్రభుత్వం ఆలోచించలేదు.

 

 తోటంశెట్టి సురేష్,

 నారాయణనెల్లూరు, పెనగలూరు

 చెయ్యేరులో ఎప్పుడూ జలకళ ఉండేది

 చెయ్యేరులో ఒకప్పుడు జలకళతో ఉట్టిపడేది. ఇప్పుడు యేటిలో నీటి ప్రవాహం లేదు. ఇందుకు ఒక రకంగా అన్నమయ్య డ్యాం అనే చెప్పవచ్చు. డ్యాం నిర్మాణంలో దిగువ ప్రాంతాల గురించి ఆలోంచించి ఉంటే ఇప్పుడు యేరు కరువు పరిస్ధితులను అధిగమించేది..

 భూమన శివశంకరరెడ్డి,

 మాజీ సర్పంచ్, నందలూరు

 చెయ్యేరు దిగువ ప్రాంతాన్ని

 కాపాడుకోవాలి

 చెయ్యేరు దిగువ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. డ్యాం నిర్మాణ సమయంలో దిగువ ప్రాంతానికి కెనాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే డ్యాం నిర్మాణం వల్ల నందలూరు, పెనగలూరు మండలాలకు కరువు ఛాయలు అలుముకుంటన్నాయి. ఇప్పుడన్నా ప్రజాప్రతినిధులు రైతుల కష్టం గురించి ఆలోచించాలి.

  సీవీరవీంద్రరాజు,

 అధ్యక్షుడు, ధర్మప్రచారపరిషత్,

 నందలూరు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top