సముద్రంలో పడవ బోల్తా


  • సొర్లగొంది సమీపంలో ప్రమాదం

  •  ఐదుగురు జాలర్లు సురక్షితం

  •  కొట్టుకుపోయిన వలలు, దెబ్బతిన్న పడవ ఇంజిన్

  • సొర్లగొంది (నాగాయలంక) : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ సొర్లగొంది గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న ఐదుగురు జాలర్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. గ్రామం నుంచి గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో మేడా వేంకటేశ్వరరావుకు చెందిన చేపల పడవలో అతనితోపాటు, మేడా నాగబాబు, కొల్లాటి ఆంజనేయులు, విశ్వనాథపల్లి వీరబాబు, పెదసింగు వెంకటేశ్వరరావు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లారు.



    భారీ వలను చేపలకోసం జారవిడిచారు. అయితే వాతావరణంలో కనిపించిన మార్పులను గుర్తించిన ఈ జాలర్లు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతో జారవిడిచిన వలను చేదుకుని పడవలో వేసుకుని తిరుగుముఖం పట్టారు. నదీ ముఖద్వారం సమీపంలోకి చేరుకునే సమయంలో ఒక్క ఉదుటున అలలు విరుచుకుపడటంతో పడవ తిరగబడింది. ఒడ్డునకు దగ్గరలో ఈ ఘటన జరగడంతో ఐదుగురు జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు.



    ఈ ఘటనలో రూ.60 వేల విలువైన వలలు కొట్టుకుపోయాయని, పడవ ఇంజిన్ దెబ్బతిందని మేడా వేంకటేశ్వరరావు తెలిపారు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి వేరే బోటు సాయంతో దెబ్బతిన్న పడవ, ప్రమాదంలో చిక్కుకుని బయటపడ్డ జాలర్లను సాయంత్రానికి సొర్లగొంది పడవల రేవుకు చేర్చారు. పడవ బోల్తాపడిన విషయాన్ని అవనిగడ్డ మత్యశాఖ అభివృద్ధి అధికారి చెన్ను నాగబాబు ధృవీకరిం చారు. జలర్లు సురక్షితమని జరిగిన సంఘటన, నష్టం వివరాలను మత్యశాఖ ఉన్నతాధికారులకు తెలియపర్చానని ఆయన తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top