ఇక కటకటే..!


గుంటూరు సిటీ :  జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. భూమి అడుగు పొరల్లో నీటి మట్టం ఇప్పటికే ప్రమాదకర స్థాయికి పడిపోయింది. గ త ఏడాదితో పోలిస్తే 2.18 మీటర్ల లోతుకు జలధారలు దిగిపోయాయని స్వయంగా జిల్లా భూగర్భజల వనరుల శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. నీటి వాడకం సాధారణ స్థాయిలో ఉండగానే, ఎండలు మరింత ముదరకుండానే ఇంత దారుణంగా భూగర్భ జలం ఇంకిపోతే, ఇక మే నాటికి పరిస్థితి మరింత దుర్భరంగా మారనుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకుంటే వేసవిలో నీటికి కటకట తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలం ప్రకృతి ప్రసాదించిన వరం. ‘ఆకాశ గంగకై ఎదురు చూడ నేల...భూగర్భ జలంతో తడుపుకో నీ నేల’అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఇటు పాలకుల అనాలోచిత చర్యలు, ప్రజలు సైతం నీటి సంరక్షణ  పద్ధతులపై దృష్టి సారించకపోవడం తదితరాల నేపథ్యంలో నేడు వర్షాధారామే కీలకమైపోయింది.  

 

 గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 30 శాతం మేర తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లా భూగర్భజల వనరులు తగ్గడానికి ఇదో ప్రధాన కారణం. అయితే విచ్చలవిడిగా నీటి వాడకం, నీటి సంరక్షణ  పద్ధతులు పాటించకపోవడం ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. జిల్లాలో 16,932 బావులు, 16, 603 బోర్లు, 19,750 ఫిల్టర్ పాయింట్లు ఉన్నాయి. భూగర్భజలాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా బోర్లు, బావులు, ఫిల్టర్ పాయింట్ల కింద సాగు చేస్తున్న పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది.  కరెంట్ కోతల కారణంగా సేద్యం అసాధ్యంగా మారుతుండగా, పొంచి ఉన్న ఈ జల గండం రైతుల పాలిట మూలిగే నక్కపై తాటి పండులాంటిదే.

 

 అప్పుడే నీటి ఎద్దడి ...

 గుంటూరు నగరంలో భూగర్భ జలాల పరిస్థితి మరీ ఘోరం. పెరిగిన అపార్ట్‌మెంట్ కల్చర్, వృథా నీరు తిరిగి భూమిలోకి ఇంకిపోయేందుకు లేని అవకాశాలు తదితరాల నేపథ్యంలో నగరంలో నీటి ఎద్దడి అప్పుడే మొదలైంది. వాస్తవ పరిస్థితి చెప్పుకోవాలంటే ప్రస్తుతం గుంటూరు నగరం లో సుమారు 100 అడుగుల మేర తవ్వితే కానీ నీటి జాడ కనిపిస్తున్న దాఖలాలు లేవు.

 

  ఇక పలువురు బిల్డర్లయితే ఏకంగా మళ్ళీ రీచార్జ్ చేసే పద్ధతు లేవీ పాటించకుండానే 600 నుంచి 700 అడుగుల లోతు వరకు బోర్లు అడ్డదిడ్డంగా తవ్వేసినట్లు అధికారుల సర్వేలోనే వెల్లడైంది. ప్లాన్ అప్రూవల్ కోసం తూతూ మంత్రంగా నీటి పరిరక్షణ  చర్యలు తీసుకుంటున్నట్లుగా దరఖాస్తులో నమోదు చేస్తున్నారు తప్ప, నిజానికి నగరంలోని ఏ ఒక్క అపార్ట్‌మెంట్‌లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయలేదు. ఏతా వాతా ఏ లెక్కన చూసుకున్నా భూగర్భ జలాలు ఇంకిపోయాయన్నది నిజం. రానున్న వేసవిలో నీటి ఎద్దడి ఖాయం.

 

 ముందస్తు చర్యలు చేపట్టాలి...

 వర్షాలు తక్కువగా పడడం, నీటి సంరక్షణ  పద్ధతులు పాటించకపోవడం తదితరాల నేపథ్యంలో భూగర్భంలో జలశాతం నానాటికి తగ్గుతోంది. విరివిగా ఇంకుడు గుంతలు తవ్వించడం, వర్షపునీటిని, వృథా నీటిని భూమిలోకి తిరిగి ఇంకిపోయేలా చర్యలు తీసుకోవడం ద్వారానే దీన్ని కొంతలో కొంతైనా మనం ఎదుర్కోగలుగుతాం.

 - దావులూరి వందనం, భూగర్భ జలవనరుల శాఖ సహాయ సంచాలకులు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top