ఈ వ్యవసాయం.. వినూత్నం..


కృషితో నాస్తి దుర్భిక్షం.. అన్నారు పెద్దలు. కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆలోచనతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఎటువంటి సమస్యనైనా సునాయూసంగా ఎదుర్కోవచ్చనేది దీని సారాంశం. ఇటీవల సంభవించిన వరుస తుపాన్లకు జిల్లాలోని కొందరు రైతన్నలు కోలుకోలేని దెబ్బతింటే.. మరికొందరు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని ఎదుర్కొనే దిశగా అడుగులు వేశారు. సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి లాభాల సిరులు పండించారు. నేడు (సోమవారం) జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన రైతులపై ‘న్యూస్‌లైన్’ సక్సెస్ స్టోరీ..

 

హనుమాన్ జంక్షన్ : మూసధోరణి, కాలం చెల్లిన పద్ధతులతో పంటలు సాగుచేస్తూ ఒడుదుడుకులు ఎదుర్కొనే రైతులు కొందరైతే.. వీటికి భిన్నంగా ఆలోచిస్తూ వినూత్న ప్రయోగాలతో అధిక దిగుబడులు సాధించి నలుగురికి ఆదర్శంగా నిలిచే వారు మరికొందరు. సరిగ్గా ఈ రెండో కోవకే చెందుతారు బాపులపాడు మండలంలోని బిళ్లనపల్లికి చెందిన యెదురువాడ నాగేశ్వరరావు. కొత్తరకం పద్ధతుల్లో వరి పంటను సాగుచేసి అధిక దిగుబడులు సాధించటమే కాక ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారు. ఒకే పంటలో, ఒకే సీజన్‌లో మూడు కొత్త పద్ధతులను అమలుచేశారు.

 

 పామాయిల్ తోటలో అంతర పంటగా వరి




 మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటలను పామాయిల్ తోటలో అంతర పంటలుగా సాగుచేయటం సాధారణమే. కానీ, తొలిసారిగా పామాయిల్ తోటలో ప్రయోగాత్మకంగా వరిసాగును అంతర పంటగా చేపట్టి విజయం సాధించారు నాగేశ్వరరావు. బిళ్లనపల్లిలో నాలుగు ఎకరాల పొలంలో ఏడాది కిందట పామాయిల్ మొక్కలు వేశారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో ఆయనకో ఆలోచన  వచ్చింది. పామాయిల్ తోటలో వరి సాగుచేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. అనుకుని వెంటనే  ఆచరణలో పెట్టారు.

 

 బిందు సేద్యంతో వరిసాగు

 

 సాగునీటి కొరతతో సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయరంగానికి నాగేశ్వరరావు కొత్తమార్గం చూపించారు. వరి పంటలో తొలిసారి బిందు సేద్యం విధానాన్ని అవలంబించి మంచి రాబడి సాధించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ భూమి సాగు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. నీటి వృథా తగ్గుతుంది. మొక్కకు నేరుగా సాగునీరు, ఎరువులు అందుతాయి.

 

 నేరుగా విత్తనాలు..

 

 సాధారణంగా వరిసాగు చేసేందుకు ముందుగా నారుమడి పోసి ఆ తర్వాత పొలం మొత్తం నాట్లు వేస్తారు. రెండుసార్లు పొలం దుక్కడం, నాలుగుసార్లు దమ్ము చేయించటం, వరినాట్లు చేసేందుకు కూలీలు దొరక్కపోవటంతో విసుగు చెందుతున్న రైతాంగానికి సరికొత్త పద్ధతిని పరిచయం చేశారు. నేరుగా పొలం మొత్తం విత్తనాలు చల్లి పంట సాగు చేశారు. ట్రాక్టర్‌తో ఒక్కసారి దుక్కి చేయించి, తరువాత యంత్రాల సాయంతో పొలంలో విత్తనాలు చల్లించారు. దీనివల్ల ఎకరాకు దాదాపు రూ.5వేల వరకు పెట్టుబడి మిగులుతుందని నాగేశ్వరరావు తెలిపారు.  

 

 ఇబ్బందులు ఎదుర్కొనేందుకే..

 మెట్ట ప్రాంతంలో వర్షాలు సరిగ్గా ఉండవు, విద్యుత్ మోటార్ల మీద ఆధారపడి సాగు చేయాలి. విద్యుత్ కొరత, మరోపక్క సాగునీటి కొరతను తట్టుకునేందుకు బిందు సేద్యం ద్వారా వరిసాగు చేపట్టాను. గతంలో కూలీలు పొలంలో ఎంత లోతు బురద ఉన్నా లెక్క చేయకుండా వరినాట్లు వేసేవారు. ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువైంది. దీంతో నేరుగా విత్తనాలు చల్లి పంటసాగు చేశాను. దీనివల్ల పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది.

 - యెదురువాడ నాగేశ్వరరావు

 

 రాబోయే కాలంలో బిందు సేద్యానికే పెద్దపీట

 రాబోయే రోజుల్లో బిందు సేద్యానికే రైతులు పెద్దపీట వేయనున్నారు. డెల్టాలో నాలుగు ఎకరాలకు వినియోగించే నీటిని డ్రిప్ ఇరిగేషన్‌లో వరిసాగుకు నాగేశ్వరరావు వాడారు. పొలం ఆరుతడిగా ఉండటంతో ఆక్సిజన్ మొక్కలకు చేరి ఆశించిన మేరకు దిగుబడులు వచ్చాయి. పొలానికి కావలసిన స్థాయిలో నీరు ఉండటంతో తుపాన్ల బారిన పడకుండా చేను నిలబడింది. నీటి యాజమాన్య సంస్థ వారు ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా బిందు సేద్యానికి భారీగానే సబ్సిడీలు ఇస్తున్నారు.

 - ఎన్‌సీహెచ్ బాలూనాయక్,

 జిల్లా వ్యవసాయ జాయింట్ డెరైక్టర్


 

 రైతుబంధు చరణ్‌సింగ్

 ఉత్తరప్రదేశ్‌లో జమిందారీ వ్యవస్థ, భూస్వాములపై తిరుగుబాటు చేసి రైతుల పక్షాన పొరాడి రైతుబంధుగా పేరొందిన భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతినే జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకొంటారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నూర్‌పూర్ గ్రామంలో 1902 డిసెంబరు 23న జన్మించారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన అనేక భూపోరాటాలు చేశారు. జైకిసాన్ నినాదంతో రైతులను ఏకంచేసి ఉద్యమాలు నడిపారు. రైతుల దుస్థితి, సమస్యలు, పరిష్కార మార్గాలు, సంస్కరణలపై పలు రచనలు చేవారు. 1960లో ఉత్తరప్రదేశ్ సీఎంగా చరణ్‌సింగ్ దేశంలోనే తొలిసారిగా భూసంస్కరణలు, లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1979లో మొరార్జీ దేశాయ్ తర్వాత దేశ ప్రధానమంత్రిగా ఆరు నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. రైతు శ్రేయస్సు కోసం ఆయన చేసిన ఉద్యమాలు, చట్టాలు, రచనలను స్మరించుకుంటూ ఆయన మరణించిన తర్వాత ఏటా రైతుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

 

 115 రోజుల్లోనే పంట

 వరుస తుపాన్ల వల్ల తన పంటకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుకున్నారు కౌతవరానికి చెందిన రైతు చాపరాల జగన్మోహనరావు. వెదజల్లే పద్ధతిని అనుసరించి కేవలం 115 రోజులకే పంట సాధించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. జగిత్యాల (20171, 18047) రకాల వరి వంగడాలు నా పొలంలో వేశాను. జులై ఐదో తేదీన వెదజల్లే పద్ధతి ద్వారా విత్తనాలు వేశాను. దీంతో 130 రోజులకు చేతికి రావలసిన పంట 115 రోజులకే వచ్చింది. అక్టోబరు 25వ తేదీన వరి కోతలు పూర్తయ్యాయి. ప్రయోగ పద్ధతిలో 20171, 18047 రకాల్ని కొద్ది పొలంలోనే సాగుచేశా. ఈసారి కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తా. బీపీటీని పోలిన ఈ రకం వంగడాల ద్వారా వర్షాల్లో కంకులపై చినుకుపడితే మొలక వచ్చే ప్రమాదం ఉంది. వరుసగా వచ్చిన తుపాన్లకు ముందుగానే పంటను కోసేయటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడినట్లే... అని చెప్పారు.

 

 వైపరీత్యాలకు ఒరిగిపోలేదు..

 తన పొలంలో వేసిన ఎంటీయూ 1112 రకం వరి వంగడం తుపాన్లకు తట్టుకుని దృఢంగా నిలబడిందని గుడ్లవల్లేరుకు చెందిన వల్లభనేని నరసింహారావు చెప్పారు. ఆయన తన పంట గురించి చెబుతూ... 1112 వరి వంగడాన్ని నా ఐదెకరాల్లో సాగు చేశాను. దోమపోటు, ఎండు తెగులును తట్టుకోవడమే కాకుండా వరుస తుపాన్లకు చేను పడకుండా నిలబడింది. ఈ విత్తనం 35 బస్తాల దిగుబడి ఇచ్చింది. ఇది 150 రోజుల పంట. ఈ ధాన్యం సన్నాలుగా తెలుపు రంగులో ఉంటుంది. ధాన్యానికి మూడు వారాల నిద్రావస్థ ఉండటంతో వర్షాల్లో మొలక రాలేదు. పల్లపు ప్రాంతంలో ముంపు బారిన పడినా 7-10 రోజుల వరకు నష్టం వాటిల్లలేదు. ఈ రకాన్ని కనుగొన్న మారుటేరు ఏపీ వరి పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యనారాయణరావు నా పొలాన్ని సందర్శించి దిగుబడులు చూసి మెచ్చుకున్నారు.. అని పేర్కొన్నారు.

 

 తక్కువ కాలపరిమితికే పంట

 వరుస తుపాన్ల బారిన పడకుండా తక్కువ కాలపరిమితితో కూడిన పంటను వేసి విజయం సాధించారు అంగలూరుకు  చెందిన రైతు, మాజీ ఏడీఏ త్రిపురనేని రత్నకుమార్ చౌదరి. తన అనుభవంతో తుపాన్లకు సవాల్ విసిరారు. ఈ విశేషాలు చెబుతూ.. పీఎన్‌ఆర్ 2458 వరి రకాన్ని నా పొలంలో వాడాను. తుపాన్ల ముందే.. అంటే నవంబరు మొదటి వారంలో వరికోతలు పూర్తయ్యాయి. ఇది 135 రోజుల పంట. ఈ రకాన్ని హైదరాబాద్ రాజేంద్రనగర్ నుంచి తెచ్చా. రెండున్నర ఎకరాల్లో ఈరకం సాగుచేశా. ఇది ముతకలు కాదు, సన్నాలు కాదు. ఎకరానికి 34 బస్తాల పంటనిచ్చింది. తక్కువ కాలపరిమితితో దిగుబడులు సాధించడంతో అందరూ మెచ్చుకున్నారు.. అని వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top