ప్రచారార్భాటమే!


  • ‘ఉచితం’ మూడింటికే పరిమితం

  •  బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మిగిలినవి హుళక్కి

  •  సరఫరా లేదని చేతులెత్తేస్తున్న డీలర్లు

  • పాడేరు: ఉచితంగా నిత్యావసర సరకుల పంపిణీపై ప్రభుత్వం ప్రచారార్భాటమే తప్ప వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. తుఫాన్ బాధితులందరికీ 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, కిలో పంచదార, లీటరు పామాయిల్, రెండు కిలోల కందిపప్పు, అరకిలో కారంపొడి, కిలో ఉప్పు, రెండు కిలోల బంగాళా దుంపలు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై  టీడీపీ ప్రజాప్రతినిధులు,  నాయకులు ఊదరగొట్టేస్తున్నారు. అయితే వాస్తవంగా బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మరే వస్తువూ ఏజెన్సీలో పంపిణీ చేయడం లేదు. డిపోలకు మిగిలిన వస్తువులు చేరక పోవడంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు.  



    పౌరసఫరాల శాఖ నుంచి వస్తువులు సరఫరా చేయడంలోనే తీవ్రజాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ. బియ్యం, పంచదార, కిరోసిన్ పొందేందుకే మూడు రోజుల నుంచీ డిపోల చుట్టూ తిరుగుతున్న గిరిజనులు మిగిలిన వాటి కోసం ఇంకా ఎన్నాళ్లు తిరగాలో అని వాపోతున్నారు. అసలు ఇస్తారో, ఇవ్వారో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్డు దారులతోపాటు లేని వారికి కూడా వస్తువులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అన్నీ ఒకేసారి ఇస్తేనే మేలు జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు.

     

    పంపిణీ వేగవంతం చేయాలి



    బియ్యం, కిరోసిన్, పంచదారకే పరిమితం చేయకూడదు. అన్ని వస్తువు  లు సత్వరం పంపిణీ చేయాలి. ఒక్కో వస్తువు కోసం ఒక్కో రోజు తిరగడం గిరిజనులకు అసాధ్యంగా ఉంది. పనులు మానుకుని ఎన్నిరోజులు తిరగగలరు. ఇప్పటికైనా డీఆర్ డిపోలో ఒకే రోజు అన్ని వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో జీసీసీ అధికారులు చొరవ చూపాలి. పౌరసరఫరాల విభాగం కూడా ఉచిత నిత్యావసర వస్తువులను ఏజెన్సీకి త్వరితగతిన తరలించే ఏర్పాట్లు చేయాలి.

     - గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే

     

    మూడు వస్తువులే ఇచ్చారు



    ప్రభుత్వం పప్పు, బియ్యం, ఉప్పు, నూనె తదితర వస్తువులను ఇస్తామన్నా మాకు మూడే ఇచ్చారు. బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మిగిలినవి రాలేదంటున్నారు. ఈ వస్తువుల కోసం పనులు మానుకుని ఎన్నిరోజులు తిరగగలం.

      - కె.చిన్నమ్మి, రాయిగెడ్డ, ఇరడాపల్లి పంచాయతీ

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top