రాజధాని అంటే చాలా కావాలి

రాజధాని అంటే చాలా కావాలి - Sakshi


ఏపీ కేపిటల్ ఎంపిక అంత సులభం కాదు : శివరామకృష్ణన్ కమిటీ

అన్ని ప్రధాన కార్యాలయాలూ రాజధానిలోనే ఉండాల్సిన పనిలేదు

వచ్చే నెల్లో నివేదిక ఇస్తాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిని ఎంపిక చేస్తాయి

 


హైదరాబాద్: ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండటం ఒక్కటే రాజధాని ఎంపికకు ప్రధాన అర్హత కాదు. చౌకగా భూమి లభించడం, అనువైన నేల, అనుకూలమైన వాతావరణం, నీటి లభ్యత వంటి చాలా అంశాలు చూడాలి’’ అని ఏపీ రాజధాని ఎంపికపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. శనివారం సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్’ డెరైక్టర్ అరోమర్ రెవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుందనే విషయంలో తాము సిఫార్సులు మాత్రమే చేస్తామని, ఒక ప్రాంతాన్ని నిర్ధారించి చెప్పబోమని చెప్పారు.  విలేకరుల సమావేశంలో శివరామకృష్ణన్, రెవి వెల్లడించిన ముఖ్యాంశాలు..



► దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇట్లాంటి విభజన జరగలేదు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.  రాజధాని ఎంపిక క్లిష్టమైన వ్యవహారం.

►రాష్ట్రంలో 3, 4 ప్రధాన అభివృద్ధి కేంద్రాలు ఉండాలని సీఎం భావిస్తున్నారు. వైజాగ్, తిరుపతి, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈ కేంద్రాలుండాలనే యోచనలో ఉన్నారు.

► రాజధానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించడానికి సీఎం కార్యాలయం కూడా ప్రయత్నిస్తోంది.  రాష్ట్రానికి మధ్యలో ఉండటం కూడా రాజధానికి ముఖ్యమే. కానీ అదొక్కటేప్రధానంకాదు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘లాండ్ పూలింగ్’ గురించి ముఖ్యమంత్రి చెబుతున్నారు. అది కొత్త విధానం. విజయవంతమైతే మంచిదే. కొత్త విధానం అమల్లో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వమే చెప్పాలి.

►ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే కోరిక ప్రభుత్వానికి ఉండొచ్చు. అదొక్కటే భూమిని తయారు చేయలేదు. చౌకగా భూమి లభించాలి. దీనికే భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి కొత్త రాజధాని నిర్మాణంలో ఉండకూడదు. భూమితో పాటు అవసరమైన నీటి సౌకర్యం కూడా ఉండాలి.

►అసెంబ్లీ భవనం, ఎమ్మెల్యేల క్వార్టర్లు, అసెంబ్లీ ఉద్యోగులకు నివాసాల నిర్మాణానికి ఒకే ప్రాంతంలో 60 నుంచి 70 ఎకరాలు కావాలి. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయానికి 15 నుంచి 20 ఎకరాలు సరిపోతుంది. కానీ మంత్రులు, సెక్రటేరియట్ ఉద్యోగుల నివాసాలు, ఇతర అవసరాల కోసం కనీసం మరో 120 ఎకరాల భూమి అవసరమవుతుంది.

► అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే యోచన మంచిది కాదు. సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యే, మంత్రుల నివాసాలు, ఉద్యోగులకు గృహాలు ఒక చోట ఉండాలి. మిగతా కార్యాలయూలను వేర్వేరు చోట్ల వాటికి అనుకూలమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయొచ్చు. హైదరాబాద్‌లో 192 ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఏపీలో వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అవసరమా?

►ఏపీలో అభివృద్ధికి అవకాశం ఉన్న 13, 14 ప్రాంతాలను కమిటీ గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. కనీసం మూడు, నాలుగు పట్టణాల విస్తరణకు అవకాశం వస్తుంది.

► బాబు ఉద్యోగాలను సృష్టించలేడు. ఏటా 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. ఇన్ని ఉద్యోగాలను ప్రభుత్వం ఇవ్వలేదు. పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి చెందితేనే ఉద్యోగాలు వస్తాయి.

►  ఏదో ఒక ప్రధాన నగరాన్ని ఆసరా చేసుకొని రాజధాని నిర్మాణం జరగాలి. ప్రపంచంలో ప్రఖ్యాత రాజధానుల నిర్మాణం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. నా దృష్టిలో భువనేశ్వర్ ఉత్తమ రాజధాని. రాజధాని అంటే భారీ భవంతులనే భావన వదిలేయాలి.     

 

భూమి ఎలా బాబూ..! చంద్రబాబును ప్రశ్నించిన కమిటీ




హైదరాబాద్: విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆలోచనను శివరామకృష్ణన్ కమిటీ వ్యతిరేకించినట్లు సమాచారం. సీఎంతో కమిటీ రెండు గంటలకుపైగా సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో సీఎం తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. కొత్త రాజధాని నిర్మాణానికి విజయవాడ - గుంటూరు మధ్య భూసేకరణ పెద్ద సమస్య అవుతుందనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. ‘డెవలెప్‌మెంట్’ పేరిట పట్టణాల్లో స్థలాలు తీసుకొని అపార్ట్‌మెంట్లలో వాటా ఇస్తున్న తరహాలో రైతుల నుంచి భూములు తీసుకొని అభివృద్ధి చేసిన తర్వాత 40 శాతం వాటా ఇచ్చే ‘ల్యాండ్ పూలింగ్’ విధానాన్ని తాము అనుసరిస్తామని, కమిటీకి సీఎం వివరించారు. దీని  సాధ్యాసాధ్యాలపై కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది.  విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ప్రయోజనాలుంటాయంటూ చంద్రబాబు ఎంతగా ఏకరువు పెట్టినా కమిటీ సానుకూలంగా స్పందించలేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top