ఏజెన్సీలో టెన్షన్‌...టెన్షన్‌

ఏజెన్సీలో టెన్షన్‌...టెన్షన్‌ - Sakshi


విజయనగరం ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌ కలకలం

ఉలిక్కిపడిన మన్యంవాసులు

ప్రతీకారేచ్ఛ దాడులపై గిరిజనుల్లో గుబులు

అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

ఏజెన్సీ పోలీసు స్టేషన్లకు ఎస్పీ ప్రత్యేక ఆదేశాలు


 

సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని మన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో ఇక్కడి గిరిజనంలో కలకలం రేగింది. ఏ క్షణాన్నైనా మావోయిస్టులు ప్రతీకారేచ్ఛలకు తెగబడతారనే భయం ఒకవైపు... కూంబింగ్‌ పేరుతో పోలీసుల హడావుడి మరోవైపు వారిని కలవరపెడుతోంది. ఏ ​‍క్షణాన ఏం సంఘటనలు చోటు చేసుకుంటాయోనన్న గుబులు వారిలో ఎక్కువైంది. ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా... మన్యంలోనే దాని పర్యవసానం కనిపిస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు ఏజెన్సీ పోలీసు స్టేషన్లకు అప్రమత్తం కావాలంటూ ఎస్పీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.



ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పనసపుట్టు బ్లాక్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌ జిల్లా మన్యంలో కలకలం సృష్టించింది. దాదాపు 24మందిని కోల్పోయిన మావోయిస్టులు ఏ క్షణాన్నైనా ప్రతీకార చర్యలకు దిగుదాతారేమోనన్న భయంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మావోయిస్టు కార్యకలాపాలకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం సేఫ్‌జోన్‌గా మారింది. ముఖ్యంగా చిత్రకొండ, పనసపుట్టు, బందుగాం బ్లాక్‌ల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. పలు సామాజిక సమస్యలు, గిరిజనుల ఇబ్బందులు తదితర వాటిపై తమదైన శైలిలో వారు ఉద్యమ పంధా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలో ఇన్‌ఫార్మర్ల నెపంతో గిరిజనులు, చిరు వ్యాపారులపై మావోయిస్టులు దాడులు చేస్తున్న సంఘటనలూ చోటు చేసుకున్నాయి. ఆ మధ్య పోలీసు ఏజెంటుగా భావించి చినిక రోహిణిని మావోయిస్టులు  మట్టుపెట్టారు. బందుగాం బ్లాక్‌లో పోలీసు ఇన్‌ఫార్మర్‌ అనే అనుమానంతో మిడియక కృష్ణ అనే  గిరిజనుడ్ని హతమార్చారు. అలాగే, సాలూరు మండలం దొరలతాడివలస సమీపంలో గల జాకరవలస గ్రామ పొలిమేరలో కటూడి వెంకటరావు అనే చిల్లర వ్యాపారిని హత్యగావించారు. దీంతో కాస్త అప్పట్లో అలజడి చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల ఘటనలు పెద్దగా లేవు. ఏ ఒక్క వర్గానికి నష్టం జరగలేదు.



గిరిశిఖర గ్రామాల్లోనే కదలికలు 

దాడులకు తెగపడకపోయినప్పటికీ పార్వతీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం తదితర మండలాలకు చెందిన గిరిశిఖర గ్రామ ప్రాంతాలతో పాటు, వాటికి సమీపంలో ఉన్న ఒడిశా గ్రామాల్లో మాత్రం మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందిస్తున్న వారికి, గిరిజనులను మోసం చేస్తున్న వారికి, నాటుసారా వ్యాపారాలు చేస్తున్న వారికి గిరిజనుల భూములను బలవంతంగా లాక్కున్నవారికి హెచ్చరికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిథుల పాలన పరిస్థితులపై ఆరా తీస్తూ... అటువంటి వారికి హెచ్చరికలు జారీ చేస్తూ...ఉనికిని చాటు కుంటున్నారు. ఇటీవల బడేదేవరకొండ, బోడికొండ తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్నవారికి మావోయిస్టులు తమ మద్దతును ప్రకటించారు. 



హింసాత్మక ఘటనలు తక్కువే 

హింసాత్మక ఘటనలు గతం కన్న తగ్గాయి. ఇరువర్గాలు సంయమనంతోనే ఉన్నాయి. ఇన్‌ఫార్మర్లను మట్టు పెట్టడం తప్ప మరే ఘటనలు లేవు. పోలీసులపైన మావోయిస్టులు, మావోయిస్టులపైన పోలీసులు దాడులకు దిగిన ఘటనలు కూడా అరుదే. దీంతో ఆంధ్రా, ఒడిషా సరిహద్దు గ్రామాల్లో కాసింత ప్రశాంత వరణం నెలకుంది.గిరిజనులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పోలీసులు కూడా విధి నిర్వహణలో ఊపిరిపీల్చుకుని ఉంటున్నారు. తాజాగా విశాఖ జిల్లాకు సరిహద్దు(ఏఓబీ)లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పోలీసులు వ్యూహాత్మకంగా 24మంది మావోయిస్టులను హతమార్చడంతో కలకలం రేగింది. భారీగా నష్టపోయిన మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో టెన్షన్‌ మొదలయ్యింది. ఇరువర్గాల దాడుల మధ్య తాము బలి అయిపోతేమోననని భయపడుతున్నారు.

 

జిల్లా పోలీసులు అప్రమత్తం

విశాఖ జిల్లా సరిహద్దులో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌ ప్రభావం  జిల్లాపై ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎల్‌కేవీ రంగారావు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. కూంబింగ్, తనిఖీలు విస్తృతం చేయడమే కాకుండా ఏజెన్సీ పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేసారు. అదనపు బలగాలను కూడా పంపించినట్టు తెలిసింది. వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top