గొడిగెనూరులో టెన్షన్..టెన్షన్

గొడిగెనూరులో   టెన్షన్..టెన్షన్ - Sakshi


ప్రభుత్వ స్థలంలోని దిబ్బలను  దగ్గరుండి తొలగించిన ఎమ్మెల్యే

విషయం తెలుసుకుని గ్రామానికి  చేరుకున్న గంగుల బిజేంద్రారెడ్డి

పని ప్రదేశంలో మోహరించిన ఇరువర్గాలు..పరిస్థితి ఉద్రిక్తం

సర్వే చేశాకే పనులు చేపడతామని నచ్చజెప్పిన డీఎస్పీ

►  ముందు జాగ్రత్తగా గ్రామంలో పికెట్


 

 

చాగలమర్రి: గొడిగెనూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.  గ్రామంలో రోడ్డు నిర్మాణం సందర్భంగా  నీళ్ల ట్యాంక్ నుంచి సచివాలయం వరకు  దిబ్బల తొలగింపు పనులు ఇందుకు కారణమయ్యాయి. ఈనెల 12న గ్రామంలోని రస్తాకు ఇరువైపులా ఆక్రమణలు తొలగింపు విషయంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడి చల్లారక ముందే బుధవారం ఉదయం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ రెవెన్యూ, పోలీసు అధికారులతో గ్రామానికి చేరుకుని ప్రొకైన్, ట్రాక్టర్‌ల సహాయంతో రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డుకు కుడి వైపు ఉన్న  దిబ్బలు తొలగించి అందులో మట్టి వే యిస్తున్నారు. విషయం తెలుసుకున్న గంగుల బిజేంద్రారెడ్డి గ్రామానికి హుటాహుటిన చే రుకున్నాడు.  ఒకవైపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా తన వర్గం వారితో,  మరోవైపు గంగుల బిజేంద్రారెడ్డి తన అనుచరులతో పనుల వద్ద మోహరించారు. దీంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తుల్లో టెన్షన్ మొదలైంది.

 

ఎమ్మెల్యే తీరు పై మహానాడులో ఫిర్యాదు  - గంగుల ప్రభాకర్‌రెడ్డి

గొడిగెనూరు గ్రామం విషయంపై మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం చాగలమర్రి లోని  ఆపార్టీ నాయకుడు కుమార్‌రెడ్డి ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో ఘర్షణలు జగిరి పదిరోజులు కూడా కాక  ముందే ఎమ్మెల్యే ఒక వర్గం వారికి వత్తాసు పలికి దగ్గరుండి దిబ్బలు పూడ్చడం తగదన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని తహసీల్దార్‌కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించు కోలేదన్నారు.  ఎమ్మెల్యే  టీడీపీలో చేరిన తరువాత దాడులు మొదలయ్యాయని ఆరోపించారు. నియోజక వర్గంలోని ప్రజలంతా కలిసి  భూమా అఖిలప్రియను ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆమె అందరికి సమానంగా చూడాలని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు బిజేంద్రారెడ్డి, గంధంరాఘవరెడ్డి, బాబులాల్, కుమార్‌రెడ్డి, పత్తినారాయణ తదితరులు పాల్గొన్నారు.  

 

 

 

పట్టువిడవని ఇరువర్గాలు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సీఐలు ఓబులేసు, కేశవరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నాగేంద్రప్రసాద్, సూర్యమౌలి, మోహన్‌రావు తదితరులు గొడిగెనూరుకు చేరుకుని ఇరువర్గాల వారిని సర్ది చెప్పే యత్నం చేశారు. నిబంధనల ప్రకారం రోడ్డు పనులు చేపట్టామని, నిలిపే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అఖిలప్రియ అధికారులకు తెగేసి చెప్పారు. ముందుగా  భూమా వర్గానికి సంబంధించిన రేకుల షెడ్డు తొలగించిన తర్వాతే పనులు చేపట్టాలని మరోవైపు గంగుల బిజేంద్రా రెడ్డి పట్టుబట్టారు.  పోలీసు అధికారులు నాలుగు గంటల పాటు ఇరువర్గాల వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలు పట్టువిడవలేదు. చివరకు సర్వేయర్ ద్వారా ప్రభుత్వ స్థలాన్ని  కొలిచి అందరి ఆక్రమణలు తొలగించి రోడ్డు పనులు మొదలు పెడతామని నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి పేర్కొనడంతో వారు శాంతించి వెనుతిరిగారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top