టెన్షన్.. టెన్షన్


టెన్షన్.. టెన్షన్.. కార్పొరేషన్‌లో ఏ ఉద్యోగిని కదిలించినా ఇదే మాట. తీవ్రమైన పని ఒత్తిడి, గంటలకొద్దీ విధుల నిర్వహణతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. దీంతో కొందరు వేరే ప్రాంతాలకు బదిలీ చేయించుకుంటుండగా, మరికొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పక్కకు తప్పుకొంటున్నారు. కొత్తవారేమో విజయవాడ కార్పొరేషన్ అంటేనే భయపడిపోతున్నారు.

 

విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఉద్యోగం అధికారులకు కత్తిమీద సాములా మారింది. ‘ఇక్కడ పనిచేయలేం బాబోయ్..’ అంటూ కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతుండగా, మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ‘విజయవాడ కార్పొరేషన్‌లో ఉద్యోగం అంటే ఎంతో గొప్పగా ఉంటుందనుకుని వచ్చాం. ఇక్కడకు వచ్చాక తెలిసింది. పనిచేయడం ఎంతకష్టమో..’ అంటూ పలు విభాగాల అధికారులు వాపోతున్నారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పీవో శకుంతల పనితీరు నచ్చక నెలరోజుల కిందట కమిషనర్ జి.వీరపాండియన్ ఆమెను సరెండర్ చేశారు. సీన్‌కట్ చేస్తే.. ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకే ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిసింది.

 

వరుసగా బయటకు..

ప్రాజెక్ట్స్ డివిజన్-3 ఈఈగా పనిచేసే రామ్మోహన్ ఉద్యానవన శాఖాధికారిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. పనిభారం పెరగడంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. గోదావరి పుష్కరాల డ్యూటీ పేరుతో ఈఈ-1 ఓంప్రకాష్ కార్పొరేషన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. సెక్రటరీ సెల్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ పోస్టుల్లో రెండు నెలలుగా ఇన్‌చార్జిలే పాలన సాగిస్తున్నారు. డెప్యూటి కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మిని బదిలీ చేస్తూ మూడు నెలల కిందటే మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆదేశాలు ఇచ్చింది.



ఆ పోస్టులో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కమిషనర్ ఆమెను రిలీవ్ చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వెయ్యి కోట్ల బడ్జెట్ ఉన్న నగరపాలక సంస్థలో చీఫ్ ఇంజినీర్ పోస్ట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. రెండేళ్ల నుంచి ఆ పోస్టు ఇన్‌చార్జిల చేతిలోనే మగ్గిపోతోంది. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే యూసీడీ విభాగంలో పీవోగా పనిచేసేందుకు అధికారులు ముందుకు రాని పరిస్థితుల్లో ఇన్‌చార్జితో సరిపెట్టారు. ప్రస్తుతం కార్పొరేషన్‌లోని కీలక విభాగాల్లో పనిచేసే ముగ్గురు అధికారులు బదిలీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

 

ఈ టెన్షన్ మావల్ల కాదు బాబోయ్..

సమీక్షల సందర్భంగా మేయర్, కమిషనర్  పలుమార్లు ‘ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోండి..’ అంటూ గద్దించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ‘మేం ఇక్కడ పనిచేయలేం. మమ్మల్ని పంపించేయండి సార్..’ అంటూ అధికారులే వేడుకోలు మొదలుపెట్టారు. ఉదయం 5.30 గంటలకు డివిజన్ పర్యటనలతో మొదలయ్యే వర్క్ షెడ్యూల్ అర్ధరాత్రి అవుతున్నా పూర్తికావట్లేదని అధికారుల ఆవేదన. ముఖ్య విభాగంలో ఇటీవల రాత్రి 12.45 గంటల వరకు వర్క్ చేసినట్లు సమాచారం. రోబోల్లా పనిచేస్తున్నా కమిషనర్‌ను మెప్పించలేకపోతున్నామని ఓ అధికారి ‘సాక్షి’ వద్ద వాపోయారు. భార్యాపిల్లలకు దూరమవుతున్నామని, ఫిఫ్టీ ప్లస్‌లో ఇంత టెన్షన్ తమ వల్ల కాదని చెబుతున్నారు.

 

కిందిస్థాయి ఉద్యోగులదే హవా

ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బంది కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ హంగు, ఆర్భాటం ఉన్న వీరితో పనిచేయించడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగుల వాదన. ప్రజారోగ్య, ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కమిషనర్ కోరిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా అధికారులు అడిగినప్పటికీ కిందిస్థాయి సిబ్బంది కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో కమిషనర్ విభాగాధిపతులపై ఫైర్ అయ్యారు. ‘పని చేయించడం రాకపోతే చెప్పండి. నేనే కిందిస్థాయి ఉద్యోగులతో పనిచేయిస్తానంటూ..’ రుసరుసలాడినట్లు తెలిసింది. గ్రూపు రాజకీయాలు నెరుపుతున్న ఉద్యోగులతో పనిచేయించడం ఆషామాషీ వ్యవహారం కాదన్నది అధికారుల వాదన.  హైస్పీడ్ పాలన నేపథ్యంలో కార్పొరేషన్‌లోని ప్రధాన విభాగాల్లో కుర్చీలు ఖాళీ అవుతున్నాయనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top