ప్రాణాలు పోకముందే స్పందించండి

ప్రాణాలు పోకముందే స్పందించండి


గిద్దలూరులో టెన్షన్

1990లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న జీపు రాచర్ల మండలంలోని రామాపురం రైల్వే గేటు వద్ద గేటు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో జీపులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆతర్వాత కొన్నాళ్లకు గేటు ఏర్పాటు చేశారు.

రాచర్ల మండలంలోని గుడిమెట్ట వద్ద రైల్వే క్రాసింగ్ రోడ్డు ఉంది. కానీ ఇక్కడ గేట్ లేదు. గేట్‌మ్యాన్ కూడా లేడు. రద్దీగా ఉండే ఈ రహదారిలో నిత్యం వాహనాలతో పాటు ప్రజలు   తిరుగుతుంటారు. గేటు లేని కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అలాగే అచ్చంపల్లె, ఒద్దులవాగుపల్లె గ్రామాల మధ్య కూడా రైల్వే క్రాసింగ్ లేన్‌కు భద్రతా చర్యలు తీసుకోలేదు. గేటు లేని కారణంగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటారు. ఏ సమయంలో రైలు బండ్లు వస్తాయో ఎవరికీ తెలియదు. పట్టాలపై వాహనాలు ఆగిపోతే పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించక తప్పదు.

గిద్దలూరు మండలంలోని పెద్దచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డులో రైల్వే ట్రాక్‌పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. గేటు లేకపోవడమే దీనికి కారణం. కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.  

 -గిద్దలూరు

 

దర్శి నియోజకవర్గం ఘోరం

 

కురిచేడు మండలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గుంటూరు-డోన్ రైల్వే మార్గం ఉంది. అయితే మండల పరిధిలోని వెంగాయపాలెం వద్ద రైల్వే క్రాసింగ్ గేటు లేదు.. కాపలాగానూ ఎవరూ ఉండరు. గేటు దాటుకుంటూ పశువులతో పాటు వ్యవసాయ కూలీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వ్యవసాయ సీజన్‌లో అయితే రాత్రి వేళ కూడా గేటు క్రాస్ చేయాల్సిందే.

మండల కేంద్రం కురిచేడు వద్ద నాగార్జున సాగర్ కాలువ కట్టపై ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. ఇక్కడ కూడా గేటు లేదు. ఈ మార్గం నుంచి కాటంవారిపల్లె, పేరంబొట్లవారిపాలెం గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పొలాల ప్రాంతం కావడంతో పశువులు అరకలతో, ఎడ్లబండ్లతో పట్టాలు దాటుతుంటాయి. రైతులు, రైతు కూలీలు, సాగర్ కాలువ పరిశీలనకు వెళ్లే అధికారులు కూడా ప్రమాదభరితంగా ఆ మార్గంలో తిరుగుతుంటారు.

కాటంవారిపల్లెకు కూతవేటు దూరంలో మరో రైల్వే క్రాసింగ్ ఉంది. దీని ద్వారా కేవలం పంటపొలాలకు వెళ్లే ట్రాక్టర్లు, పశువులు, రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే పొట్లపాడు గ్రామంలో ఉన్న రైల్వే క్రాసింగ్ నుంచి పొట్లపాడు గ్రామస్తులు, మొండెద్దుల వారిపాలెం గ్రామస్తులు కూడా వెళుతుంటారు.

దొనకొండ మండలంలోని గుంటూరు- గుంతకల్ రైల్వే లైన్‌లో  ఐదు రైల్వే క్రాసింగ్ గేట్లున్నాయి. రెండు చోట్లు గేట్ మ్యాన్‌లుండగా...  రైల్వేశాఖ మరో రెండు గేట్లను మూసివేసింది. అయితే రాజమక్కపల్లి గేటు మాత్రం ప్రమాద భరితంగా ఉంది. ఇక్కడ కాపలాగా ఎవరూ లేరు. భూమనపల్లి, మంగినపూడి, మల్లమ్మ పేట, కొచ్చెర్ల కోట, ఇండ్లచెరువు, దొనకొండ, వెంకటాపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం ఈ గేటు నుంచి పనులపై వెళతారు.  

నియోజకవర్గ పరిధిలోని ఈ క్రాసింగులన్నీ రైల్వేలేన్ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు గేటు నిర్మించలేదు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ    చేసే సమయంలో కూడా క్రాసింగ్ గేట్ల గురించి మరచి పోయారు. ఫలితంగా ఇప్పటికే జరిగిన ఎన్నో ప్రమాదాల్లో వందలాది పశువులు చనిపోయాయి. ఎంతమంది మనుషులు ప్రాణాలు విడిచారు. కానీ రైల్వే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరం.      - తాళ్లూరు

 

మార్కాపురంలో మరణాలు

మార్కాపురం- తర్లుపాడు, మార్కాపురం -గజ్జలకొండ మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్‌లతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ మార్గంలో కాపలాలేని మూడు రైల్వేగేట్లున్నాయి. మార్కాపురం మండలంలోని నాయుడుపల్లె, భూపతిపల్లె, తర్లుపాడు మండలంలోని సూరేపల్లి దగ్గర గేట్‌మెన్ లేరు.. గేట్లూ లేవు. నాయుడుపల్లె వద్ద ఈ ఏడాది ఏప్రిల్‌లో గూడ్స్ రైలు ఆటోను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.



గత ఏడాది తర్లుపాడు మండలం సూరేపల్లి దగ్గర రైలు ఢీకొనటంతో 3 గేదెలు మృతి చెందాయి. గత ఏడాది భూపతిపల్లె రైల్వే గేటు వద్ద రైలు.. ఆటోను ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. సంపాదనే ధ్యేయంగా ఉండే రైల్వే శాఖకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు-గుంతకల్ మార్గంలో ప్రస్తుతం గూడ్స్ రైళ్ల రాకపోకలు ఎక్కువయ్యాయి. వీటికి తోడు గుంటూరు-కాచిగూడ, మచిలీపట్నం, ప్రశాంతి, తెనాలి ప్యాసింజర్ రైళ్లు తిరుగుతుంటాయి. ఏ సమయంలో ఏ బండి వస్తుందో వాహనదారులకు అర్థం కావడంలేదు.

 - మార్కాపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top