హోదా రాయితీలు పదేళ్ల పొడిగింపు

హోదా రాయితీలు పదేళ్ల పొడిగింపు - Sakshi

- కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, ఈశాన్య రాష్ట్రాలకు ప్రయోజనం 

రూ. 27,413 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఆరు వారాల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న జైట్లీ

 

సాక్షి, అమరావతి: ‘ప్రత్యేక హోదా’ కాలం చెల్లిన అంశమని, జీఎస్‌టీ వస్తే హోదా కలిగిన రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఉండవన్న వాదన ఉత్త బూటకమని తేలిపోయింది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లకు ప్రత్యేక హోదా కింద లభించే పన్ను రాయితీలను కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో పదేళ్ల పాటు పొడిగించింది. ఈమేరకు 4 రోజుల క్రితం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీఎంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న టీడీపీ మంత్రులు పచ్చి అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని దీంతో తేలిపోయింది. 

 

2027 మార్చి 31 వరకు అమల్లో రాయితీలు 

జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన జూలై 1వ తేదీ నుంచి 2027 మార్చి 31వ తేదీ వరకు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ రాయితీలు అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం గమనార్హం. ఇందుకోసం 27,413 కోట్లను కేటాయించడానికి కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.  దీనివల్ల 4,284 కంపెనీలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని, మార్గదర్శకాలను ఆరు వారాల్లో విడుదల చేస్తామని జైట్లీ తెలిపారు.  

 

రిఫండ్‌ రూపంలో చెల్లింపులు 

నార్త్‌ ఈస్ట్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ 2007 కింద ఏర్పాటైన సంస్థలతో పాటు ప్రత్యేక హోదా కలిగిన కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏర్పాటైన కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత మొదటి పదేళ్ల పాటు ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ ఇప్పుడు సెంట్రల్‌ ఎక్సైజ్‌ చట్టం రద్దు కావడంతో ఈ నిబంధనల కింద ఇచ్చే రాయితీలు జీఎస్‌టీ రాకతో రద్దయిపోయాయి. దీంతో పన్ను రాయితీలను పదేళ్ల పాటు రిఫండ్‌ రూపంలో చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జీఎస్‌టీలో కేంద్రం వాటాగా వచ్చే సీజీఎస్‌టీ, ఐసీఎస్‌టీ పన్నులను తిరిగి చెల్లించనుంది. దీనికి రూ. 27,413 కోట్లు అవసరమని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ ప్రమోషన్‌ (డీఐపీపీ) అంచనా వేసింది.  

 

హోదా కోసం ప్రధాన ప్రతిపక్షం ఒంటరి పోరాటం.. 

ప్రత్యేక హోదా కాలం చెల్లిన అంశమని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు  అధికార పార్టీకి చెందిన నేతలు సాకులు చెబుతున్నా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ సీపీ ఒక్కటే దీనిపై గట్టిగా పోరాడుతూ వస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీదాకా  పోరాటాలు చేయడమే కాకుండా పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావనకు తెచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. లౌక్యం, దౌత్యం, పోరాడటం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాను సాధించడం సాధ్యమేనని ఆయన పదేపదే ఉద్ఘాటించారు. ఇప్పుడు కేంద్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పదేళ్ల పాటు పొడిగించడంతో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ వాదనకు మరింత బలం చేకూరింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడితే మన రాష్ట్రానికి కూడా ఈ ప్రయోజనాలు దక్కే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.    
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top