దేవుడికీ రాజకీయ సెగ

దేవుడికీ  రాజకీయ సెగ - Sakshi


ప్రభుత్వం వరమిచ్చింది. అర్చకులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ పరపతిని పెట్టుబడిగా పెట్టి అసలుకే ఎసరు పెడుతున్నారు. దైవారాధనే నిత్యకృత్యమైన అర్చకులకు జీవన భృతి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారికిస్తున్న దేవాలయ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమవుతున్నాయి. లక్షలకు లక్షలు ఆర్జించి పెడుతున్నాయి. అరసవల్లి ఆదిత్యునికి చెందిన భూములూ దీనికి మినహాయింపు కాదు. అధికారులు సైతం చూసీచూడనట్లు పోతుండటం.. రాజకీయ ఒత్తిళ్లు తోడుకావడంతో దేవస్థానానికి చెందిన విలువైన స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు.

 

 అరసవల్లి:దేవుడి భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి రోడ్డులో సర్వే నెంబర్  503/2లో ఉన్న 16 సెంట్ల అరసవల్లి దేవస్థానం భూమిని బయటి వ్యక్తులు ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారు. మెయిన్ రోడ్డును ఆనుకొనే ఈ భూమి ఉంది. ఆలయ ఈవో, సిబ్బంది, దేవాదాయశాఖ అధికారులు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నా.తమకు సంబంధం లేనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు వెంటనే సిబ్బందిపై విరుచుకుపడి మెమోలు, సస్పెన్షన్లు వంటి చర్యలు చేపడుతున్న అధికారులు దేవుడి భూమిలో ప్రైవేట్ వ్యాపారం విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు.

 

 వాస్తవానికి ఈ భూమిని జీవన భృతి కోసం దేవస్థానం అర్చకులకు ఇచ్చారు. వారు దీన్ని అన్యాక్రాంతం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.80 లక్షల విలువైన ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేసిన విషయం దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఆర్.పుష్పనాథానికి గతంలో తెలిసింది. అయితే ఆయన పెద్దగా పట్టించుకోకుండా ప్రధాన అర్చకుడికి మెమో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మిగిలిన సిబ్బంది దీన్ని తప్పు పడుతున్నారు. అదే ఇతరులెవరైనా దేవుడి మాన్యాన్ని ఆక్రమించి సొంత వ్యాపారాలు పెట్టుకుంటే కఠిన చర్యలకు దిగుతారని..

 

 ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు.

 చట్టం చట్టుబండలే..అర్చకులకు ఇచ్చే మాన్యాల్లో పండించే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప భూములను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లీజుకు ఇవ్వరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. లీజుకు ఇచ్చినా, భూములను ఎవరైనా ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా కల్పించాయి. అయితే ఈ 16 సెంట్ల భూమి విషయంలో రాజకీయ ఒత్తిళ్లు బాగా పనిచేస్తున్నట్లు తెలిసింది. అందువల్లే ఈవో సహా ఇతర అధికారులు దాని జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కేశవరెడ్డి స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో మావాడే ఉంటున్నాడు.. చూసి చూడనట్లు వదిలేయండి’ అంటూ దేవస్థానం ఇన్‌చార్జి ఈవోకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులే ఇలా ఆక్రమణదారులను వెనకేసుకొస్తూ.. ఆక్రమణలను ప్రోత్సహిస్తుంటే ఇక దేవుడి మాన్యాలకు దిక్కెవరన్న ప్రశ్న తలెత్తుతోంది.

 

 చేతులు మారిన లక్షలు

 మొయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ స్థలంలో అక్రమ లీజు విషయంలో లక్షలాది రుపాయలు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారులకు కూడా ముడుపులు అందడం వల్లే వారు నోరు మెదపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొట్ట కూటికి రోడ్డు పక్కన చిన్న బడ్డీ పెట్టుకుంటేనే నానా యాగీ చేసే అధికారులు రూ.లక్షల విలువైన దేవస్థానం భూమిలో పాగా వేసి యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నా తమకు సంబంధం లేనట్లు మిన్నకుండటం విడ్డూరమే.

 

 ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం

 శ్రీసూర్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన సర్వే నెంబరు 503/2లోని 16 సెంట్ల భూమిలో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఈ ఏడాది జూన్ 19న ఆర్‌సీ నెంబర్42/4 మెమో జారీ చేశాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటాం.

 - ఆర్.పుష్ఫనాథం, ఇన్‌చార్జి ఈవో

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top