2 వేలు..3 వేలు..5 వేలు

2 వేలు..3 వేలు..5 వేలు - Sakshi


ఓటమి భయంతో ఓటుకు వెల కట్టి పంచిన అధికార పార్టీ

►ఒక్కో చోట ఒక్కో రేటేంటని జనం నిలదీత

►కొన్ని చోట్ల మహిళలకు ముక్కు పుడకలు, చీరల పంపిణీ

►జగన్‌కు వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి బెంబేలు

►ఓటమి తప్పదని తెలిసి ఏకంగా ఈసీపైనే విమర్శలు

►జిల్లాలోనే ఉండి ఓటింగ్‌ సరళి పర్యవేక్షించనున్న అధికార పార్టీ నేతలు




సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక ప్రచార హోరు నిన్నటితో ముగిసింది. అసలు పోరు ఈ నెల 23న ఓటింగ్‌ రూపంలో జరగనుంది. పోలింగ్‌కు గడువు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో అలజడి రేగుతోంది. ఎంతగా అభివృద్ధి పేరుతో మాయమాటలు చెప్పినా, ఎంతగా నోట్ల కట్టలు గుమ్మరించి ప్రలోభాలకు గురి చేసినా, పోలీసులతో సోదాలు, నేతలపై దాడులు చేయించినా ప్రతిపక్ష పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతుండటంతో అధికార పార్టీ ఆందోళనకు గురవుతోంది.


అయితే చివరి ప్రయత్నంగా ఓటర్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని అమాంతం పెంచేసింది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు ఒక్కోచోట ఒక్కో రేటు కట్టి పంచడం ప్రారంభించారు. ఒక చోట ఓటుకు రూ.2 వేలు, మరో చోట రూ.3, రూ.5 వేలు ఇచ్చారు. కొన్ని చోట్లయితే ఏకంగా రూ.10 వేల వరకూ పంచుతున్నారు.



మంత్రులు కొందరు జిల్లాలోనే ఉండి ఓటింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు గోస్పాడు మండలంలోని ఒక గ్రామంలో బస చేసినట్లు సమాచారం. జిల్లాను వదిలి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడేందుకే సిద్ధమయ్యారు. ప్రధానంగా ఓటింగ్‌పై భయం ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఓటమి తప్పదని తెలిసే ఏకంగా ఎన్నికల సంఘంపైనే విమర్శలకు దిగడంతో పాటు పక్కనే ఉండి అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలంగా పని చేయించుకునేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు సమాచారం.



ఒక్కో ఓటుకు ఒక్కో రేటు..

ఉదయం పూట ఒక రేటు, రాత్రి సమయాల్లో మాట్లాడితే మరో రేటు అనే మొబైల్‌ కంపెనీల ఆఫర్ల తరహాలో అధికార పార్టీ కూడా ఓటర్లకు ఆఫర్లు ప్రకటిస్తోంది. కొన్ని వార్డుల్లో రూ.2, 3, 5 వేలు పంచుతున్న తెలుగుదేశం నేతలు మరికొన్ని చోట్ల ఓటర్ల మనస్థత్వాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. ఉడుమాల్పురం లాంటి గ్రామాల్లో ఏకంగా రూ.10 వేల వరకూ ఓటుకు పంచడం గమనార్హం. ఇక్కడితో ఆగకుండా కొన్ని ప్రాంతాల్లో మహిళలకు చీరలు, ముక్కెరలను కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే, అధికార పార్టీ బరితెగించి డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం కన్నెత్తి చూడకపోగా, ఎవరూ అడ్డుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తీరు విమర్శల పాలవుతోంది. తెలుగుదేశం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఓటుకు రూ.10 వేల మేరకు పంచుతున్న తీరు విస్తుగొలుపుతోంది.



అంటే.. టీడీపీకి అనుకూలంగా ఉండటమే తాము చేసుకున్న పాపమా అని పలువురు ఆ పార్టీ కార్యకర్తలు.. స్థానిక నేతలను నిలదీస్తున్నారు. మీరే తింటున్నారంటూ శాపనార్థాలు పెడుతున్నారు. దీనిని గమనించిన స్థానిక నేతలు వారి వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒక వార్డులో ఓటుకు రూ.2 వేలు ఇవ్వగా, పక్కనే ఉన్న మరో వార్డులో రూ.3 వేలు, రూ.5 వేలు ఇచ్చారని తెలియడంతో రూ.2 వేలు తీసుకున్న ఓటర్లు ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు.


15వ వార్డులో ఏకంగా ఆ పార్టీ స్థానిక నేత ఇంటి ముందు కొద్ది మంది మహిళలు ఆందోళనకు కూడా దిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఏకంగా రూ.10 వేలు ఇచ్చారని తెలియడంతో ఇతరులు రగిలిపోతున్నారు. తమ ఓటుకైనా.. ఇంకొకరి ఓటుకైనా విలువ ఒకటేనని, అలాంటపుడు ఎందుకు వ్యత్యాసం చూపుతున్నారని నిలదీస్తుండటంతో ఎలా సర్ది చెప్పాలో తెలియక టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారు.



►చాపిరేవుల, అయ్యలూరు, చాబోలు, పెద్దకొట్టాలలో ఓటుకు రూ.3 వేలు, మహిళలకు చీరలు, ముక్కు పుడకలు పంపిణీ చేశారు. పొన్నాపురంలో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేసిన అనంతరం రెండు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లకు మాత్రం అదనంగా గుంపగుత్తగా రూ.5 లక్షలు ఇచ్చారు.



►యాళ్లూరు, దీబగుంట్ల గ్రామాల్లో వర్గ వైషమ్యాలు లేపేందుకు భారీగా ప్రలోభాలకు గురిచేశారు.



►నంద్యాల మున్సిపాలిటీలోని వార్డులకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మెజార్టీ చూపించుకోవాలనే లక్ష్యంతో ఎవరికి తోచిన విధంగా వారు డబ్బులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.5 వేలు ఇచ్చారు. ఆ మొత్తం తీసుకున్న వారు ఆ విషయాన్ని పక్క వార్డుల్లోని బంధువులు, సన్నిహితులకు తెలిపారు. దీంతో ఒక్కో ఏరియాలో ఒకలాగా పంచుతారా అంటూ పలు చోట్ల ఓటర్లు వాదనకు దిగారు.  



►ఒకటవ వార్డు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన టీడీపీ పెద్దలు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై 22వ వార్డులో టీడీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి కొందరు ఓటర్లు నిలదీశారు.



►తాము టీడీపీ సానుభూతిపరులుగా ముద్ర ఉన్నప్పటికీ తమకు డబ్బులు ఎందుకు తక్కువగా ఇచ్చారని పలు ప్రాంతాల నుంచి ఆ పార్టీ నేతలపై ఒత్తిడి పెరిగింది. మంగళవారం మిగతా మొత్తాన్ని ఇవ్వకపోతే తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top