తెలుగు ప్రజావేదిక ఆవిర్భావం

తెలుగు ప్రజావేదిక ఆవిర్భావం


అధ్యక్షుడిగా రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి, కన్వీనర్‌గా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్

 

హైదరాబాద్, న్యూస్‌లైన్: సమైక్య రాష్టం కోసం పోరాడుతున్న ప్రజాసంఘాలు, జేఏసీలు ఏకతాటిపైకి వచ్చాయి. ‘తెలుగు ప్రజా వేదిక’ పేరుతో కొత్త సంఘంగా ఏర్పడ్డాయి. సంఘానికి అధ్యక్షుడిగా రిటైర్ట్ ఐపీఎస్ అధికారి చెన్నూరి ఆంజనేయరెడ్డి, కన్వీనర్‌గా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్ వ్యవహరించనున్నారు. మంగళవారం బేగంపేటలోని హరితాప్లాజాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశ ంలో గంగాధర్ మాట్లాడుతూ... రైతు, విద్యార్థి, పాఠశాలలు, విద్య, వైద్య, న్యాయ, విద్యుత్, గెజిటెడ్, పంచాయతీరాజ్ సహా సమైక్య రాష్ర్టం కోసం పోరాడుతున్న దాదాపు 100 జేఏసీలు, సంఘాలు కలిసి ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. త్వరలో సెంట్రల్ కమిటీ ఏర్పాటుచేస్తామని, అందులో డాక్టర్ మిత్రాతో పాటు పలు జేఏసీల సభ్యులు ఉంటారని తెలిపారు. తెలుగు ప్రజల వికాసం, అభివృద్ధి, సంక్షేమం కోసం తమ వేదిక పోరాడుతుందని వివరించారు. అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి ఐక్యత కోసం అన్ని వర్గాలు, ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి పోరాడుతామన్నారు. తెలంగాణలో దాదాపు 70 శాతం సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో చేసిన తీర్మానాలు వివరించారు.



 సమైక్య రాష్ర్టం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి.



 ప్రత్యేకంగా రూపొందించిన అఫిడవిట్‌లపై ప్రజాప్రతినిధులచే సంతకాలు చేయించి కోర్టుకు, రాష్టపతికి సమర్పించాలి.

 శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను పక్కన పెట్టి, 9 మంది ఎమ్యెల్యేలు ఉన్న పార్టీ డిమాండ్‌కు తలొగ్గి విభజనకు పూనుకోవడం రాజ్యాంగ విరుద్ధం  తమ సంఘంలో పనిచేసే సభ్యులంతా వారి వారి సంఘాలు, జేఏసీల కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చు.  సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి, డాక్టర్ మిత్రా సహ పలు సంఘాల, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top