మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే

మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే - Sakshi


 సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామినాయుడికి మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేసినా ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు తప్పకుండా చోటు దక్కుతుందని భావిం చినా... అధినేత కరుణించడం లేదు. మంత్రి పదవి రేసులో లేకుండా వ్యూహాత్మంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెగ్గొడుతున్నారు. టీటీడీ బోర్డు డెరైక్టర్ పదవితో సరిపుచ్చేసి చేతులు దులుపేసుకోవాలని చూస్తున్నారు. టీటీడీ పాలక మండలి కసరత్తులో ఓ డెరైక్టర్‌గా పతివాడ పేరును ప్రస్తావించినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతివాడ నారాయణస్వామినాయుడికి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని పార్టీ వర్గాలు భావించాయి. సీనియర్ నేతగా తనకే దక్కుతుందని ఆయన కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు అందరి అంచనాలను తలకిందలు చేశారు.

 

 సీనియార్టీని పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిమిడి మృణాళినిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో పతివాడ కంగుతిన్నారు. ఎందుకిలా జరిగిందని పార్టీ వర్గాలు ఆరా తీసేసరికి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సిక్కోలులో సీనియర్ నేతగా ఉన్న కిమిడి కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇస్తే తనను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడికి అన్యాయం చేసినట్టు అవుతుందని, ఇద్దరికీ ఇద్దామనుకుంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వారి మధ్య మరింత వైరం, గ్రూపులు పెంచి పోషినట్టు అవుతుందని వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. కళా వెంకటరావుకు అన్యాయం జరగకుండా ఆయన మరదలు మృణాళినికి విజయనగరం జిల్లా నుంచి, ఆద్యంతం తన వెంట ఉన్న అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం జిల్లా కోటాలో మంత్రిగా ఇస్తే ఏ ఇబ్బందులుండవని పక్కా పథకం ప్రకారం మంత్రి పదవులు కేటాయించారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయ ఎత్తుగడకు పతివాడ నారాయణస్వామినాయుడు కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు.

 

 పక్క జిల్లా నుంచి వచ్చిన నేతకు మంత్రి పదవి ఎలా ఇస్తారని, జిల్లాలో సీనియర్‌ను వదిలేసి ఎన్నికల ముందు జిల్లాకొచ్చిన నేతకు మంత్రి పదవి కట్టబెట్టడమేంటని పతివాడ వర్గీయులు  ఎంత గొంతు చించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈసారి రాకపోయినా కేబినెట్ విస్తరణలోనైనా వస్తుందని, అధైర్యపడొద్దని ఒకరికొకరు సముదాయించుకున్నారు. తన వర్గ నేతలతో కలిసి చంద్రబాబును కలిసి మొర పెట్టుకున్నారు. అవకాశం చిక్కినప్పుడుల్లా అధినేతను  కలిసి తమ గోడు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలతో ఓ వర్గంగా కొనసాగుతున్నారు. జిల్లాలో తమకున్న పట్టును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ పావులు కదుపుతున్నారు.

 

 కానీ, చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు. మంత్రి పదవి ఇస్తే గ్రూపులెక్కువవుతాయనో, కాంగ్రెస్ నేతలతో ఉన్న సత్సంబంధాల కారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చోటు చేసుకుంటాయనో  భయమో తెలియదు గాని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించి సరిపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పాలక మండలి కసరత్తులో పతివాడ పేరును చేర్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  వయస్సు పైబడుతుండటం, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి వెరసీ సీనియర్ నేతకు మరోసారి అమాత్య యోగం లేనట్టే కనబడుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top