మాఫీలో మతలబు


సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిందొకటి....అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది మరొకటి. ఏ ఒక్క రైతు కూడా రుణాలు కట్టొద్దు....అన్ని రుణాలు మాఫీ చేస్తాం....అంటూ గోడలపై రాతలు, మైకుల ద్వారా కోతలు కోసినా నేడు మాత్రం రైతులను నట్టేట ముంచారు.

 

 ఎక్కడ చూసినా ఏదో ఒక సాకు చూపి రుణమాఫీ పేర్లను మాఫీ చేస్తున్నారు. జిల్లాలో 4.50 లక్షల నుంచి 5 లక్షల మేర ఉన్న వివిధ వ్యవసాయ రుణ  ఖాతాల్లో భారీగా కోత పెట్టుకుంటూ వచ్చారు. రూ. 50 వేలు లోపు ఉన్న రైతుకు ఒకేసారి పూర్తి చేస్తున్నట్లు చెప్పినా వాస్తవంలో ఎక్కడా కనిపించలేదు. పైగా లక్షకు పైబడిన రుణాలకు సంబంధించి మొదటి విడతగా రూ. 20 వేలు వేస్తున్నట్లు చెప్పినా.....పూర్తి మొత్తం వేయకపోవడంతో వచ్చిన మొత్తం కూడా వడ్డీకే సరిపోయే పరిస్థితి ఏర్పడింది.

 

 రైతులో కనిపించని సాధికారత

 పూర్తి స్థాయిలో మాఫీ కాకున్నా ప్రచార ఆర్బాటంతో సర్కార్ రైతు సాధికారత సదస్సుల పేరుతో సభలను నిర్వహించి రుణమాఫీ పత్రాలను అందజేశారు. అయితే సదస్సుల్లో రైతుల ముఖంలో ఆనందం కంటే ఆవేదనే ఎక్కువగా కనిపించింది. జాబితాలో పంట ఉన్నా లేనట్లు చూపించారని తామేం పాపం చేశామంటూ సదస్సులో అధికారులకు రైతులు ముచ్చెమటలు పట్టించారు.

 

  మరొకిన్నచోట్ల మాఫీ వర్తించకపోతే మీరు వచ్చి ఏం చేస్తారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో అధికారులు చిన్నగా జారుకుంటూ వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 61,502 మంది రైతులకు పత్రాలు పంపిణీ చేశారు. ఇంకా లక్షలాది సంఖ్యలో రైతులు మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. సభకు వచ్చిన అధికారులను ఎందుకు మా రుణాలు మాఫీ కాలేదని అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకోవడం తప్ప ఎలాంటి పూర్తి సమాచారం ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు.  

 

 ఎన్నిసార్లు ఇచ్చినా అంతే....

 రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం రోజుకో నిబంధన తెరమీదికి తెస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌కార్డుతోపాటు రేషన్‌కార్డు, పాస్ పుస్తకాలు ఎన్నిసార్లు ఇచ్చినా మాఫీ కాకపోవడంతో రైతులు ఎన్నిసార్లు ఇవ్వాలంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా మాఫీ జాబితాలో పేర్లు లేకపోగా తాజాగా మీ-సేవ కేంద్రాల్లో మరోమారు పత్రాలను సమర్పించాలని పేర్కొంటుండడంతో పలువురు రైతులు ఊస్సూరుమంటున్నారు.

 

 కౌలు రైతులను కనికకరించని ప్రభుత్వం

 ప్రస్తుత టీడీపీ సర్కార్ కౌలు రైతుల రుణాలను కూడా అంతంత మాత్రంగానే మాఫీ చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. జిల్లాలో వేలాది మంది కౌలు రైతులు ఉన్నా కేవలం కొంతమందికే రుణాలు అందాయి. చివరకు మాఫీలో కూడా ఇంకా కోతలు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఓవైపు బ్యాంకులో అప్పట్లో సక్రమంగా రుణాలు ఇవ్వకపోగా, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏవో కొద్దిమంది రుణాలను మాత్రమే మాఫీ చేసేలా వ్యవహారిస్తోందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారంపై రుణాలు తీసుకున్న చాలామంది రైతులకు కూడా రుణమాఫీలో పేర్లు గల్లంతయ్యాయి. దీంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top