ఎక్కడైనా.. మేమే!

ఎక్కడైనా.. మేమే! - Sakshi


సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాదేదీ దందాకు అనర్హం అనే రీతిలో అధికారపార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ఇటు ఇసుక, అటు మైనింగ్‌తో పాటు అధికారుల పోస్టింగుల్లోనూ తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఇదేదో ప్రతిపక్షాలు చేసిన విమర్శలు కాదు. జిల్లాలో అన్ని అక్రమాల్లో అధికారపార్టీ నేతల హస్తం ఉందని స్వయంగా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) అధికారులు నిగ్గుతేల్చిన నిజాలు. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) అధికారులు కొద్దిరోజుల క్రితం అధికారికంగా ఒక నివేదికను సమర్పించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.



అధికారపార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుతో అటు అధికారుల్లో... ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని కూడా ఈ నివేదికలో ఎస్‌బీ అధికారులు స్పష్టం చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొత్తం అక్రమాల వెనుక ఉన్న అధికార పార్టీ ‘పెద్ద’లు, వారి అన్నదమ్ముళ్ల గురించి కూడా నివేదికలో పేర్కొన్నట్టు ఈ వర్గాలు వివరించాయి. అయితే, ఇంత స్పష్టంగా నివేదికలు ఉన్నప్పటికీ జిల్లాలోని నేతలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు జంకుతుండటం గమనార్హం.

 

మైనింగ్‌లో మజా చేస్తున్నారు...!

జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో కింది నుంచి పైస్థాయి వరకూ అధికారపార్టీ నేతలే ఉన్నారు. ప్రధానంగా డోన్, బనగానపల్లె, వెల్దుర్తి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ భారీగా జరుగుతోందని ఎస్‌బీ తన నివేదికలో పేర్కొంది. ఈ అక్రమ మైనింగ్ వెనుకా, ముందు కూడా టీడీపీ నేతలే ఉన్నారని.. సక్రమంగా మైనింగ్ జరుగుతున్న కంపెనీల నుంచి కూడా భారీగా వసూలు చేస్తున్నారని ఈ నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారని.. సర్వే నెంబరు వివరాలతో సహా ఈ నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.



వాస్తవానికి అన్ని అనుమతులు ఉన్న కంపెనీల నుంచి టన్నుకు రూ.250 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లేనిపక్షంగా మైనింగ్ జరపకుండా అడ్డుకున్నారన్న విమర్శలున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందని తాజాగా ఎస్‌బీ నివేదిక తేటతెల్లం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అక్రమ మైనింగ్‌లో పోలీసుల పాత్ర ఉందని కూడా ఎస్‌బీ నివేదికలో పేర్కొనడం ఆ వర్గాల్లో గుబులు రేపుతోంది. నెలవారీ మామూళ్లు తీసుకుని అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని...మామూళ్లు ఇవ్వకపోతేనే వాహనాలను సీజ్ చేస్తున్నారని వివరించింది.

 

ఇసుక దందాలోనూ వీరిదే పైచేయి...!

‘జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇసుక దందాలోనూ తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. అనుమతులు లేకుండానే ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. కర్నూలు నుంచి ప్రతీ రోజూ హైదరాబాద్‌కు ఇసుక తరలిపోతోంది. ఈ మొత్తం దందాలో ప్రభుత్వంలో ఉన్న పెద్దల హస్తం కూడా ఉంది. అక్రమంగా తవ్విన ఇసుకను గుట్టలుగుట్టలుగా పోసి నిల్వ ఉంచుకున్నారు’ అని ఎస్‌బీ తన నివేదికలో పేర్కొంది. చివరకు ఇసుక తవ్వకాలు ప్రభుత్వమే మహిళా సంఘాల ద్వారా చేపట్టే సరికి ఇసుకే లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి పంపిన నివేదికలో విజిలెన్స్‌శాఖ కూడా స్పష్టం చేయడం గమనార్హం.

 

పోస్టింగుల్లోనూ వసూల్ రాజాలు!

అటు ఇసుక, ఇటు మైనింగ్ అక్రమాలతో ఆగకుండా అధికారుల పోస్టింగులపైనా అధికారపార్టీ నేతల కన్ను పడింది. అధికారుల పోస్టింగులోనూ భారీగా డబ్బు చేతులు మారుతోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా జిల్లావ్యాప్తంగా జరిగిన అధికారుల బదిలీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న విమర్శలున్నాయి. ఆర్డీవో పోస్టులకు రూ. 35 లక్షల మేరకు వసూలు చేశారని తెలుస్తోంది. ఎమ్మార్వో పోస్టులకు రూ.10 లక్షల మేరకు వసూలు చేశారని, డీఎస్పీ పోస్టులకు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.



ఈ ఆరోపణలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)తో పాటు స్వయంగా సీఎంకు చేరాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా అక్రమంగా చెలరేగుతున్న జిల్లాలోని అధికారపార్టీ నేతలకు కనీసం హెచ్చరించిన దాఖలాలు కూడా లేమ. ఇదే అదనుగా భావించి తెలుగు తమ్ముళ్లు మరింత చెలరేగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top