మా సీట్లో మీరెలా కూర్చుంటారు?

మా సీట్లో మీరెలా కూర్చుంటారు? - Sakshi


హైదరాబాద్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరగనున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ వైద్యశాఖలోని కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో సీమాంధ్రులను నియమిస్తే సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ) అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి ప్రవీణ్ హెచ్చరించారు. ఇలాంటి పోస్టులకు అన్ని అర్హతలు, అనుభవం ఉన్నా.. తెలంగాణవారిని ప్రభుత్వం పక్కనపెడుతోందని మండిపడ్డారు. సోమవారం ఉస్మానియా ఆసుపత్రి, ఉస్మానియా దంత వైద్య కళాశాలకి వెళ్లి సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ స్థానాల్లో కూర్చున్న సీమాంధ్ర అధికారులతో వాగ్వాదానికి దిగారు.

 

 ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్‌దాస్ గతనెల 31న పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో డాక్టర్ శివరామ్‌రెడ్డిని సూపరింటెండెంట్‌గా నియమిస్తూ డీఎంఈ ఉత్వర్వులు జారీచేశారు. సోమవారం శివరామ్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, మెడికల్ జేఏసీల ప్రతినిధులు ఆయన చాంబర్‌ను ముట్టడించారు. లోపలికి వెళ్లి శివరామిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ‘మీకన్నా ఎక్కువ సీనియారిటీ ఉన్న నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సువర్ణకు దక్కాల్సిన పోస్టులో ఎలా కొనసాగుతారు’ అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ సువర్ణకు దక్కాల్సిన పదవిని పైరవీ చేసి పొందారని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులను కలిసి ఉస్మానియా సూపరింటెండెంట్‌గా కొనసాగలేనని చెప్పాలని సలహా ఇచ్చారు. లేకుంటే ఇప్పటికిప్పుడే వైద్య సేవలు నిలిపేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఆయనను సూపరింటెండెంట్ కుర్చీ నుంచి తప్పించి సువర్ణను కూర్చొబెట్టి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఉస్మానియా దంత వైద్య కళాశాలకు చేరుకున్నారు. గతనెల 31న దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ కమలాదేవి పదవీ విరమణ పొందగా ఆమె స్థానంలో సీమాంధ్రకు చెందిన అదే ఆసుపత్రిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అన్నపూర్ణను నియమించారు. సోమవారం ఆమె బాధ్యతలు చేపట్టారు.

 

 టీజీడీఏ, మెడికల్ జేఏసీ ప్రతినిధులు అన్నపూర్ణను కలిసి రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన మీరు ప్రిన్సిపల్‌గా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉత్వర్వుల మేరకే పదవీ బాధ్యతలు స్వీకరించానని అన్నపూర్ణ పేర్కొనగా, తెలంగాణకు చెందిన డాక్టర్ బాల్‌రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నా.. ఆయన్ను తప్పించి పదవి పొందారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమె వెళ్లిపోవడంతో ఆ స్థానంలో బాల్‌రెడ్డిని కూర్చోబెట్టి స్వీట్లు తినిపించారు. తర్వాత అక్కడ్నుంచి వెళ్లి కోఠిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వం 24 గంటల్లోగా సూపరింటెండెంట్‌గా సువర్ణను, దంత వైద్యశాల ప్రిన్సిపల్‌గా బాల్‌రెడ్డిలను నియమించకపోతే నగరంలో వైద్యసేవలు నిలిపేస్తామంటూ డీఎంఈ శాంతారావుకు సమ్మె నోటీసు ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top