ఇంటర్ విద్యార్థులతో ఆటలు!

ఇంటర్ విద్యార్థులతో ఆటలు!


వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలంటున్న తెలంగాణ... ఉమ్మడిగా నిర్వహిస్తామంటున్న ఏపీ  మార్చిలో పరీక్షలు అనుమానమే

 



► ఈసారి వేర్వేరుగానే ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అంటుంటే.. ఉమ్మడి గానే ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తాం అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.



►  వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయూలని అధికారులకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే..

 ఉమ్మడిగానే పరీక్షల నిర్వహణకు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు.


►ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ సమస్యతోపాటు జాతీయ పోటీ పరీక్షల్లో నష్టం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంటే..



 ► జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తీసుకున్నట్లుగా ఇంటర్ మార్కులకు వెయిటేజీ స్థానంలో పర్సంటైల్ అమలు చేయూలని, రాష్ట్రాలు వేరు కాబట్టి జాతీయ స్థాయి పరీక్షల్లో సమస్యలేమీ రావని తెలంగాణ చెబుతోంది.



► వెయిటేజీ తదితర సమస్యలపై ఏపీ మంత్రితో మాట్లాడతామని జగదీశ్‌రెడ్డి పేర్కొంటే.. ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహిస్తామని చెబుతూ తెలంగాణకు లేఖ రాయమని గంటా శ్రీనివాసరావు అంటున్నారు.



 ...ఇవీ ఇంటర్మీడియెట్ పరీక్షలపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయేతప్ప రెండు రాష్ట్రాల మంత్రులు మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావడం లేదు. విద్యార్థులకు వెతలు తప్పేలా లేవు. రెండు రాష్ట్రాల విద్యా మంత్రులు కలిస్తే పరిష్కారం అయ్యే సమస్యలను వారిద్దరూ కలుసుకోక మరింత జటిలం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. పరీక్షల ఏర్పాట్లపై జూలై నుంచే  బోర్డు అధికారులు రెండు రాష్ట్రాలను సంప్రదిస్తున్నా.. ముఖ్య కార్యదర్శులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒకరు ఎస్ అంటే.. ఒకరు నో అంటారు. దీంతో ఆగస్టులోనే ప్రారంభం కావాల్సిన పరీక్షలకు సంబంధించిన పనులు ఇంతవరకు మొదలు కాలేదు. దీంతో వచ్చే మార్చిలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ఆలస్యం అయ్యే ప్రమాదం నెలకొంది. అదే జరిగితే విద్యార్థులు న ష్టపోయే అవకాశం ఉంది. ఈ పరీక్షలు ఆలస్యమైతే జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సమయం సరిపోదు.



మార్చిలో కష్టమే!



వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు. వాటి నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు ఏ ఒక్కటీ ఇంతవరకు ప్రారంభమే కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 19 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పరీక్షలకు ప్రశ్నపత్రాల రూపకల్పన సెప్టెంబర్‌లోనే ప్రారంభం కావాలి. ఇంతవరకు అందుకు ఏర్పాట్లే జరుగలేదు. ఒక్కో సబ్జెక్టుకు 12 పేపర్లు తయారు చేయాలి. ఈ లెక్కన మొత్తంగా 1,248 ప్రశ్నపత్రాలను తయారు చేయించాల్సి ఉంది. బోర్డులోని కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఈ ప్రక్రియను చేపట్టి పూర్తి చేసేందుకు కనీసంగా నెల రోజుల సమయం పడుతుంది. ఇదంతా ఆగస్టులోనే ప్రారంభం కావాల్సి ఉన్నా ఇంతవరకు మొదలు కాలేదు. ఒక్కో సబ్జెక్టులో 12 రకాల ప్రశ్నపత్రాలు రూపొందించాక 6 రకాల ప్రశ్న పత్రాలను ముద్రించాలి. అందులో 3 రకాల ప్రశ్నపత్రాలను జిల్లాలకు పంపాలి. ఈ దశల్లో అవసరమైన రవాణా టెండర్లను పిలవలేదు. ఇదేకాక పరీక్షల ఏర్పాట్లకు సంబంధించిన పనులకు ఏడు రకాల టెండర్లు పిలవాల్సి ఉంది.  కాని ఇప్పటికీ ఆ పనికాలేదు. ఫీజు చెల్లించే విద్యార్థుల సమాచారం ప్రాసెసింగ్‌కు టెండర్లు పిలవలేదు. కీలకమైన ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్ల ప్రింటింగ్, జవాబు పత్రాలకు అవసరమైన తెల్ల పేపరు కొనుగోలు, ఆ పేపరుపై నిబంధనలు.. ఇతరత్రా వివరాల ముద్రణ, ప్రశ్న పత్రాల ముద్రణకు టెండర్లే పిలువలేదు.



జగదీశ్‌రెడ్డి సమీక్షించినా....



ఇటీవల పరీక్షల ఏర్పాట్లపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటర్‌బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాని ఆ సమావేశానికి ఇంటర్ బోర్డు ఇన్‌చార్జి కార్యదర్శి హాజరు కాలేదు. కిందిస్థాయి అధికారులకు వుంత్రి ఆదేశాలు జారీ చేశారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కాని బోర్డు కార్యదర్శి ఆమోదం లేకుండా కిందిస్థాయి అధికారులు ఎలా చర్యలు చేపడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ బోర్డులో ఉన్న తెలంగాణ అధికారులు చర్యలు చేపట్టినా ఏపీ ప్రభుత్వ నేతృత్వంలో రెండు రాష్ట్రాలకు సేవలు అందిస్తున్న ఏపీ ఇంటర్ బోర్డు ఆమోదిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బోర్డు విభజన ఇంకా జరుగలేదు. పాలకమండలిలో తెలంగాణ ప్రభుత్వ అధికారులకు స్థానమే కల్పించలేదు. ఇక కాంపిటెంట్ అథారిటీ తామే అంటూ ఆంధ్రప్రదేశ్ తీసుకునే నిర్ణయాలను తెలంగాణ ఆమోదించే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మంత్రులు స్పందిస్తేనే పరీక్షలపై అడుగు ముందుకు పడనుంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top