ముదురుతున్న వివాదం

ముదురుతున్న వివాదం - Sakshi


సాక్షి, హైదరాబాద్: మొన్న కరెంటు.. నిన్న నీళ్లు.. నేడు నిధులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కార్మిక సంక్షేమ నిధిలోని నిధులు ఆంధ్రాకు బదిలీ అయిన వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర సర్కారుకు తెలియకుండా నిధులను విజయవాడ అకౌంట్‌కు బదిలీ చేయడంపై తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం విదితమే. పోలీసులు కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో అనుసరించిన తీరు, కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం ఉదయం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మను పిలిచి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రంలోని బ్యాంకు శాఖలకు నిధులు తరలిస్తోందని ఈ సందర్భంగా సీఎస్ గవర్నర్‌కు చెప్పారు.

 

 గతంలోనూ ఇలాగే జరిగినట్లు వివరించారు. ఇది రాష్ట్ర విభజన చట్టం స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని, సెక్షన్ 52ను ఉల్లంఘించడమేనని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జాబితాలో ఉన్న పలు సంస్థల్లో డబ్బులు డ్రా చేసే అధికారం ఆ రాష్ట్ర అధికారులకు ఉండడంతో.. నిధులను తరలించుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు బ్యాంకుల్లో ఉన్న నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాల్సి ఉన్నా.. అలా చేయడం లేదని రాజీవ్‌శర్మ గవర్నర్‌కు నివేదించారు. నిధుల బదిలీ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వివరించారు. గవర్నర్ ఇరు రాష్ట్రాల వాదనలు వినడం మినహా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని విశ్వసనీయ సమాచారం.

 

 ఆ నిధుల వివరాలివ్వండి: సీఎస్

 

 రాష్ట్ర విభజన చట్టంలోని 8,9,10 షెడ్యూళ్లలో ఉన్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, శిక్షణ సంస్థల నిధులను తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా బదిలీ చేస్తున్నారని సీఎస్ అన్నారు. బ్యాంకులకు ఇదివరకే దీనిపై సమాచారమిచ్చినా.. కొన్ని బ్యాంకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇలా అయితే చట్టపరమైన చర్యలతోపాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. షెడ్యూల్ 8లోని 69 పబ్లిక్ ఫండ్స్‌లో పీఎఫ్, పెన్షన్, బీమా నిధులు, గ్యారంటీ రిడంప్షన్ ఫండ్, రిజర్వ్ ఫండ్, సింకింగ్ ఫండ్, ఇతర నిధులు, అలాగే తొమ్మిదో షెడ్యూల్‌లో 89 ప్రభుత్వ రంగ సంస్థలు, పదో షెడ్యూలోని 107 సంస్థలతోపాటు విభజన చట్టంలో లేని సంస్థల నిధుల డ్రా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాటిని డ్రా చేయడానికి వచ్చినప్పుడు ఆ సంస్థల విభజన పూర్తయిందా లేదా తెలుసుకోవడంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకున్నాకే.. విడుదల చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.

 

 ఈ మూడు షెడ్యూళ్లలోని సంస్థల అకౌంట్లు, నిధుల వివరాలను మూడు రోజుల్లోగా ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నిధులు 58:42 నిష్పత్తిలో పంపిణీ జరగాలన్నారు. అర్హతలేని వ్యక్తులు చెక్కులు ఇచ్చినా ఆమోదించడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం.. ఉమ్మడి సంస్థల మేనేజింగ్ డెరైక్టర్‌లను తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయకుండానే మారుస్తోందని, ఇది అనైతికమని తప్పుబట్టారు.  బ్యాంకులు విభజన చట్టాన్ని గౌరవించాల్సిందేనన్నారు. గతంలో ఏపీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి ఏకపక్షంగా రూ.22 కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించారని, ఈ అంశంలో కూడా క్రిమినల్ కేసు నమోదైందని భేటీలో పాల్గొన్న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.


 


 

 

 ఇక్కడ సంసారం.. అక్కడ సోకులా: నాయిని

 

 ఉమ్మడి రాష్ట్రంలోని నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులను.. విజయవాడ బ్యాంకుకు తరలించడంపై రాష్ట్ర కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఏపీ రాష్ట్రానికి సచివాలయం, అసెంబ్లీ హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడి నుంచే సర్కార్ నడుస్తోంది. ముఖ్యమంత్రి,  మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడనే ఉన్నరు. మరి ఆగమేఘాల మీద రూ.442 కోట్లను విజయవాడకు ఎందుకు బదలాయించినట్టు? ఇది అధికారులు చేసింది కాదు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు విజయవాడకు పంపారు. ఈడ సంసారం చేస్తూ ఆడ సోకులు పడతారా?..’’ అని శుక్రవారం ప్రశ్నించారు. తెలంగాణ వాటా కింద రూ. 610 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని నయాపైసలతో సహా వసూలు చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా కుట్రలు చేసి తెలంగాణకు అన్యాయం చేసిన బాబు.. తెలంగాణ వచ్చిన తరువాత కూడా వాటిని ఆపడం లేదని, కరెంటు మొదలుకొని ఆఖరికి కార్మికుల సొమ్ము వరకు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఆంధ్రలో టీడీపీ కాళ్ల కింద భూమి కదులుతోంది. రుణాలు మాఫీ చేయలేదు. డ్వాక్రా మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఏ ఒక్క హామీ తీర్చేటందుకు కూడా చంద్రబాబు దగ్గర డబ్బులు లేవు. నీకు డబ్బులు కావాలంటే తెలంగాణ కార్మికుల సొమ్ము గూడ తీస్కపోతవా?’’ అని నాయిని ధ్వజమెత్తారు.

 

 

 ఉమ్మడి ఖాతాల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఫ్రీజ్...!

 

 ఉమ్మడిసంస్థల్లో ఉన్న దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్తంభింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. రెండు రాష్ట్రాల మధ్య వాటాల వ్యవహారం తేలే వరకు ఆ నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బ్యాంకర్లను కోరారు. రోజువారి వ్యవహారాల కోసం అవసరమైతే కొత్త అకౌంట్లు తెరుచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 8,9,10లతోపాటు ఏ షెడ్యూల్‌లోనూ లేని సంస్థలకు సంబంధించిన నిధులను కూడా కొంత కాలం ఫ్రీజ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top