తిర‘కాసు’..!


సాక్షి ప్రతినిధి, కడప: ఆ ఎస్‌ఈ తెలంగాణ ప్రాంతానికి బదిలీ అయ్యేందుకు సిద్ధపడ్డారు.. జిల్లాలో ఉన్నంత కాలం విధులు నిర్వర్తించాం.. తుది అవకాశం సద్వినియోగం చేసుకుందామనే దిశగా  పావులు చురుగ్గా కదిపారు.ముంపు బాధితుల కోటాలో అనర్హులకు అగ్రపీఠం వేశారు. ఉద్యోగాలో... మొర్రో అంటూ ఓవైపు అర్హులు వాపోతుంటే, మరోవైపు అనర్హులకు అందలమెక్కిస్తూ చేతివాటం ప్రదర్శించారు. ఇదివరకే లబ్ధిపొందిన కుటుంబాలకు చెందిన మరో ఇరువురికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నట్లు సమాచారం.

 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలుగుగంగ ముంపు బాధితులు ఇంకా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల కాలంలో సుమారు 200 మందికి వివిధ ఉద్యోగాలు దక్కాయి. మరో ఐదువేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దళారుల చేతివాటం కారణంగా అనర్హులకు అవకాశం దక్కుతోంది. తెలుగుగంగ ఎస్‌ఈ కార్యాలయం ఇందుకు వేదికైంది. టెక్నికల్ అసిస్టెంట్లుగా ఆరుగురిని నియమించేందుకు ఎస్‌ఈ యశశ్వని జిల్లా కమిటీ ద్వారా ఇటీవల  ఉత్తర్వులు సిద్ధం చేశారు. ఆ ఆరుగురిలో ముగ్గురు అనర్హులంటూ ఆధారాలతోసహా ముంపు వాసులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వారికి పోస్టింగ్ నిలిపినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా వారిలో ఇరువురికి పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రొసీడింగ్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

 

అందివచ్చిన తుది అవకాశం....

తెలుగుగంగ ఎస్‌ఈ యశశ్వని తెలంగాణ ప్రాంతవాసి. ఆ రాష్ట్రానికి ఇటీవల బదిలీ ఉత్తర్వులొచ్చాయి. ఆమేరకు గురువారం రిలీవ్ అయ్యారు. ఇరువురికి ఉద్యోగాలు అప్పగించేందుకు, మరో ఇరవై మందిని అర్హుల జాబితాలో చేర్చేందుకు ఆ కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. జీఓ నెంబర్ 98 ప్రకారం మునకలో అవార్డు పొందిన వారికి  ఉద్యోగం కల్పించాల్సి ఉంది. అయితే ఒకే అవార్డుపైన ఇరువురికి అవకాశం కల్పిస్తున్నారు.



ఇదివరకే కుటుంబంలో అవార్డు పొందిన పి.శ్రీనివాసులరెడ్డి, బి.శ్రీనివాసులరెడ్డిలకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు అన్ని రకాల లాంఛనాలు పూర్తి అయినట్లు సమాచారం. చాపాడు మండలం చీపాడులో ఒకరు, మైదుకూరు మండలం గుడ్డివీరయ్యసత్రంలో స్థిరపడిన మరొకరికి ప్రస్తుతం అవకాశం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఇది వరకే ఉద్యోగాలు దక్కాయి. అదే జరిగితే రెండ వ వ్యక్తికి ఒకే అవార్డు కింద ఉద్యోగాలు ఇవ్వరాదన్న నిబంధనలు ఉల్లంఘించినట్లే. అంతేకాకుండా మరో ఇరవై మంది అనర్హులను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఎస్‌ఈ బదిలీకి రెండు రోజుల ముందు ఈ ప్రక్రియ వేగవంతం చేశారనే గుసగుసలు వినిపిస్తున్నారు.

 

ఎస్‌ఈ యశశ్వని ఏమన్నారంటే....

ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అయితే ఆ ఇరువురిపై ఫిర్యాదులందాయి. ఆమేరకు ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశాం. తదుపరి వచ్చే అధికారి ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. నేను ఎవరికీ ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వలేదు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top