తెలంగాణ దారిపట్టిన ధాన్యం

తెలంగాణ దారిపట్టిన  ధాన్యం


రోజుకు 40 వేల నుంచి 50 వేల బస్తాల వరకు తరలింపు

ఏపీలో అనుకూలంగా లేని లెవీ సేకరణ విధానాలు

ధాన్యం విక్రేతలకు  చెక్కులు ఇవ్వాలని ఆదేశాలు

స్థానిక మిల్లర్లకు అమ్మేందుకు  రైతుల విముఖత


 

నరసరావుపేట వెస్ట్ : లెవీ సేకరణ విధానం అనుకూలంగా లేకపోవడంతో ఇక్కడి ధాన్యం తెలంగాణకు తరలిపోతోంది. నిత్యం 40 వేల నుంచి 50 వేల బస్తాల వరకు ధాన్యం తెలంగాణ లోని నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు మిర్యాలగూడకు చేరుతోంది. అంతేకాక అక్కడి నుంచి బియ్యం భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో  బియ్యం ధరలకు రెక్కలు వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవు తోంది. లెవీ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి నేరుగా డబ్బు చెల్లించకుండా చెక్‌ల రూపంలో ఇవ్వాలని జిల్లాలోని మిల్లర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో మిల్లర్లకు ధాన్యం విక్రయించేందుకు రైతులు వెనుకాడుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న బయ్యర్లవైపు మొగ్గు చూపుతున్నారు.లెవీ సేకరణకు సంబంధించి మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంలో 25 శాతం ప్రభుత్వానికి ఇచ్చి మిగిలిన సరుకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే 75 శాతం ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం మిల్లర్లకు లేకపోవటం, విక్రయిస్తే రెండు మూడు నెలలకు సొమ్ము చేతికొచ్చే పరిస్థితులు ఉండటం వంటి కారణాలతో మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు వెనుకంజవేస్తున్నారు.



అంతేగాక కొనుగోలు చేసిన ధాన్యానికి చెక్కులు ఇస్తామంటే రైతులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం రుణమాఫీని సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల చెక్కులను బ్యాంకుల్లో జమచేస్తే బాకీ కింద మినహాయించుకునే పరిస్థితులు ఉన్నాయని రైతులు మిల్లర్లకు ధాన్యం అమ్మేందుకు విముఖత చూపుతున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం లెవీసేకరణ విధానాలను సరళతరం చేసిందని ఇక్కడికి వస్తున్న బయ్యర్లు చెపుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ము చేతిలోపెడుతున్నారు. దీంతో జిల్లా నుంచి భారీ స్థాయిలో ధాన్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాలో ధాన్యం నిల్వలు తగ్గి బియ్యంపై ఇతర రాష్ట్రాలపై ఆధార పడాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీని వల్ల రానున్న రోజుల్లో  బియ్యం ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బీపీటీ బియ్యం బహిరంగ మార్కెట్‌లో రూ.40లు ఉండగా రానున్న రోజుల్లో రూ.50లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top