శోభమ్మను ఎప్పటికీ మరువలేం

శోభమ్మను ఎప్పటికీ మరువలేం - Sakshi


 ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు

 శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభలో వైఎస్ జగన్

 

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ శోభా నాగిరెడ్డి ముందుండేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని శోభాఘాట్ వద్ద శుక్రవారం నిర్వహించిన దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం.. ప్రత్యేకంగా తయారు చేయించిన శోభా నాగిరెడ్డి విగ్రహాలు రెండింటిని వైఎస్ జగన్, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు ఆవిష్కరించారు. అలాగే శోభానాగిరెడ్డిపై రచించిన పాటల సీడీని కూడా జగన్ ఆవిష్కరించారు. వర్ధంతి సభలో జగన్ మాట్లాడుతూ ఎండలను సైతం లెక్కచేయకుండా ఎంతోమంది ఇక్కడకు వచ్చారని.. అభిమానం ఉంటే దేనినీ ఖాతరు చేయరని, సమస్యలను లెక్కపెట్టరని ఇక్కడికొచ్చిన అభిమానుల్ని చూస్తే అర్థమవుతోందన్నారు. భూమా కుటుంబానికి మేమందరం తోడుగా ఉన్నామని ఇక్కడికొచ్చిన ప్రతి స్వరం చెబుతోందన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు 65 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలం మేనమామలుగా తోడుగా ఉంటామన్నారు.శోభమ్మను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆమెపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. ‘ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉంటారు.

 

 అందులో మంచి ఎమ్మెల్యేలు కొందరే ఉంటారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఉన్నవాళ్లు మంచి ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారు. శోభానాగిరెడ్డి అలాంటి నేత’ అని జగన్ కొనియాడారు. జగన్ మీద ఈగ వాలనీయకుండా శోభమ్మ చూసిందన్న సాయన్న(ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి) మాటల్లో నిజముందన్నారు. ‘నాకు షర్మిల అనే ఒక చెల్లెలు ఉంది.. శోభమ్మ అనే అక్క కూడా ఉంది’ అని గద్గద స్వరంతో అన్నారు. ‘అన్యాయంగా నన్ను జైల్లో పెట్టి’... నాలుగైదు నెలల తర్వాత విచారణకోసం కోర్టుకు తీసుకువచ్చినప్పుడు సొంత అక్క తమ్ముడికోసం బాధపడినట్టు శోభమ్మ నా చేయి పట్టుకుని ‘నీకు ఎందుకు ఇన్ని బాధలు అని ఎంతో బాధపడింది’ అని జగన్ గుర్తుచేసుకున్నారు. శోభమ్మను పోగొట్టుకుని కుటుంబం ఎంత బాధపడిందో.. తనకూ అంతే బాధ ఉందన్నారు. ఆమెను ఏ ఒక్కరూ మర్చిపోలేరన్నారు.

 

 మాట్లాడలేకపోతున్నా...

 రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నాలుగేళ్లపాటు శోభమ్మ తనకు ఎంతో చేదోడువాదోడుగా నిలిచిందని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. ప్రతీ నిమిషం, ప్రతీ సెకను ప్రజాసమస్యల గురించి ఆలోచించేదని... ఆమె చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఆమె గురించి మాట్లాడలేకపోతున్నానని దుఃఖస్వరంతో విజయమ్మ విలపించారు. ఆమె లేని లోటు తీరనిదన్నారు. ఆమె సహాయం చేసే గుణం, సమయస్ఫూర్తి మనందరికీ ఆదర్శనీయమన్నారు.  ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు.

 

 పిల్లల కోసమే బతుకుతున్నా...

 శోభమ్మ లేని జీవితం నరకప్రాయంగా ఉందని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గద్గద స్వరంతో చెప్పారు. కేవలం పిల్లలకోసమే బతికి ఉన్నానంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఆమె ఆశయాలను కొనసాగించేందుకు శోభమ్మ ట్రస్టు పేరుతో ఏటా జయంతి, వర్ధంతుల రోజున సహాయ కార్యక్రమాలు చేపడతానని ప్రకటించారు. శోభమ్మది అనుకున్నది సాధించేతత్వమని ఆమె తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి అన్నారు. కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అంజద్ బాషా, విశ్వేశ్వరరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, చాంద్ బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కుటుంబ సభ్యులు.. నాగమౌనిక(చిన్నకుమార్తె), జగత్ విఖ్యాత్‌రెడ్డి(కుమారుడు), భూమా నారాయణరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top