రిటైరైనా ఓటర్లే..


 సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల  ఓట్ల జాబితా తప్పులతడకగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాబితాలో లోపాలు చక్కదిద్దకుండా ఎన్నికలకు వెళితే బోగస్ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయన్న ఆందోళన ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రచారం, వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన అభ్యర్థులు కూడా ఓట్ల తకరారుపై తర్జనభర్జనపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు   పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుంది. ఆ స్థానానికి ఈలోగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలు చైతన్యరాజు, పరుచూరి కృష్ణారావులతో పాటు రాము సూర్యారావు (యూటీఎఫ్) తదితరులు పోటీలో ఉన్నారు.  ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుంది.

 

 కాగా చనిపోయిన, రిటైరైన, అర్హత లేని వారిని ఓటర్లుగా నమోదు చేశారంటూ జిల్లా యంత్రాంగానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నాయి. ఈనెల 16న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను బట్టి 116 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 21,899 మంది ఉపాధ్యాయ ఓటర్లు (తూర్పుగోదావరిలో 12,654, పశ్చిమగోదావరిలో 9,245) ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈనెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదు చేపట్టారు. అంతకు ముందు నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం రెండు జిల్లాల్లో 13,658 మంది ఓటర్లు ఉన్నారు. మునుపెన్నడూ లే నట్టు ఈ దఫా ప్రైవేటు ఉపాధ్యాయులూ ఓటు హక్కు పొందేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలతో అవకాశమిచ్చింది. కొత్తగా ఓటు హక్కు కోసం 9,458 మంది దరఖాస్తు చేసుకుంటే 9,231 మంది అర్హులని తేల్చి జాబితాలో చేర్చారు. ఇతరప్రాంతాలకు వలసపోయిన, మృతి చెందిన వారిని గుర్తించి 990 ఓట్లు తొలగించామని అధికారులు చెబుతున్నారు.  

 

 మూడు వేల వరకు రిటైరైన వారివే..

 మూడేళ్ల క్రితమే రిటైరైన ఉపాధ్యాయులనూ జాబితా నుంచి తొలగించ లేదని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. 21 వేల ఓట్లలో రిటైరైన వారివి మూడు వేల వరకు ఉన్నాయంటున్నారు. అంబాజీపేట మండలం తొండవరం ఉన్నత పాఠశాలలో రిటైరైన ఎ.రాధాకృష్ణమూర్తి, ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రభుత్వ పాఠశాలలో రిటైరైన కె.పురందరరావు, అమలాపురం రూరల్ మండలం బండార్లంక ఉన్నత పాఠశాలలో రిటైరైన ఎ.చంద్రరావుల పేర్లు జాబితాలో ఉన్నాయి. సీరియల్ నం.283లో కె.శివరావు, నం.237లో కె.నారాయణమ్మ, నం.92లో పి.సుబ్బలక్ష్మి, నం.74లో జి.సోమేశ్వరరావు, నం.72లో సీహెచ్ సూర్యనారాయణ రిటైరైన వారే. అమలాపురం డీవైఈఓగా రిటైరైన ఆకొండి శారదా దేవి(నం. 26) రెండేళ్ల క్రితం, నం.65లో నమోదైన జి.ఎస్.వి.రవికృష్ణ, నం.185లో నమోదైన వై.ఎల్.ఎన్.శాస్త్రిలు ఏడాది క్రితం మృతిచెందినా జాబితాలో పేర్లున్నాయి.

 

 2011లో హైస్కూల్ నుంచి ప్రాథమిక పాఠశాలలకు బదిలీ అయిన జి.శోభ (నం.19),  డి.రామకృష్ణ (నం.278)లకు ఓట్లు ఉన్నాయి. సీరియల్ నం.732లోని గోపాలకృష్ణ, 281లోని వై.ఎస్.వి.రమణలకు రెండేసి ఓట్లు ఉన్నాయి. చాలా పాఠశాలల్లో నవంబరు 2011కు ముందే రిటైరైన వారి పేర్లు సవరించిన జాబితాలో ఉన్నాయి. ఈ విషయంపై ఉపాధ్యా య సంఘాలు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశాయి.   ఒక ప్రాంతంలో ప నిచేసి 2011 నవంబరు తరువాత  వేరొక ప్రాంతానికి బదిలీ అయిన ఉపాధ్యాయులు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నారు. గతంలో తహశీల్దార్లకు ఫిర్యాదు చేసినా ఓట్లు తొలగించే అధికారం లేదని విడిచి పెట్టేశారంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీ ఎన్నికల సెల్‌ను సంప్రదించగా  ఫారమ్-8లో సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

 

 రిటైరైన ఉపాధ్యాయులకూ ఓట్లు..

 రిటైరైన ఉపాధ్యాయులు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఇలాంటి వారు మూడువేల మంది ఉండొచ్చని అంచనా. వారంతా నవంబరు 2011కు ముందు రిటైరైన వారే. జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాను సవరించి బోగస్ ఓట్లు తొలగించాలి.

 - టి.కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్

 

 ఓటర్ల జాబితా తప్పుల తడక..

 ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. జాబితాను సరిచేశాకే ఎన్నికలు నిర్వహించాలి. గత  ఎన్నికల్లో చాలా మంది ఉపాధ్యాయులు ఓట్లు లేక  నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో అర్హుల ఓట్లు గల్లంతయ్యాయి. అటువంటివి చక్కదిద్దాలి.

 -పి.ఎన్.వి.వి.సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top