చినబాబుకు షాక్!

చినబాబుకు షాక్! - Sakshi


( సాక్షి వెబ్ ప్రత్యేకం)


'అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకి చేయిచ్చారు...' ఎవరు చేయిచ్చారో చెప్పాకుండా ఇలా పాటలు పాడుకోవడం ఏం బాలేదురా అబ్బాయ్. 'సమయానికి తగుమాటలాడెనె...' అదిగో మళ్లీ అదేపాట. విషయం చెప్పకుండా పాటలతో చంపకురా. సందర్భ శుద్ధి లేకుండా ఈ పాటల గోలేంటి అసలు. కారణంగా లేకుండా ఈర్ణం మోగదు బాబాయ్. విషయం ఉంది కాబట్టే గొంతు సవరించుకున్నా. ఆ కారణం ఎంటో చెప్పి ఛస్తే మాక్కూడా అర్థమవుతుంది కదా.



బాబాయ్... నువ్వీ మధ్య బొత్తిగా పాలిటిక్స్ పట్టించుకోవడం మానేసినట్టు ఉన్నావ్. అందుకే వెనుకబడ్డావ్. సర్లేలేవోయ్ సొల్లు కబుర్లు ఆపి విషయానికి రా. అక్కడికే వస్తున్నా. ఎన్నికల్లో లెక్కకు మిక్కిలి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం మన నేతాశ్రీలకు ఎవరూ నేర్పని విద్య. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు, అమలు తీరు చూస్తే హస్తిమశకాంతరం. ఆ విషయాలు సరేరా అసలు సంగతి చెప్పారా. ఇంతదాకా విన్నవాడివి కాస్త ఓపిక పట్టలేవా. ఇప్పటివరకు ఓటర్లను బురిడీ కొట్టించిన నేతలు ఇప్పుడు సొంత పార్టీకే 'ఉత్తి' చేతులు చూపుతున్నారు. అదెలాగబ్బా. కాస్త వివరంగా చెప్పి ఏడు.



సైకిల్ పార్టీ చినబాబుకు సొంత పార్టీ నాయకులే షాక్ ఇచ్చారు. బాబు జవాబుదారీగా ఉన్న సంక్షేమ నిధికి దండిగా నిధులు ఇస్తామని ఘనంగా ప్రకటించి ఆనక ముఖం చాటేశారు. గత మహానాడులో పోటీ పడీ మరీ తమ్ముళ్లు విరాళాలు ప్రకటించారు. అధినేత దృష్టిలో పడేందుకు ఒకరిని మించి ఒకరు 'చందా' దారి పట్టారు. చివరికి చేయి ఇచ్చారు. ప్రకటించిన విరాళ్లాల్లో పావువంతు మాత్రమే పోగవడంతో అధినేత వారసుడు అవాక్కయ్యారు.  చేసేదీ లేక పోగైంది ఇంతే అంటూ మీడియా ముందు పెట్టారు.



ఇవ్వలేనప్పుడు విరాళాలు ప్రకటించడం ఎందుకు, పార్టీని నగుబాటు పాలు చేయడం ఎందుకు. వెర్రి బాబాయ్... ఎంత 'ఎక్కువ' చేస్తే అంతప్రచారం వస్తుంది. పైగా పార్టీ సమావేశంలో అధినేత దృష్టిని ఆకర్షించేందుకు 'విరాళ' మంత్రం జపించాల్సిందే. చినబాబును ప్రసన్నం చేసుకోవాలంటే సంక్షేమ నిధి బాట పట్టాల్సిందేనన్న దూరదృష్టితో తమ్ముళ్లు టెంప్ట్ అయ్యారన్న మాట. నలుగురితో పాటు డొనేషన్ అనౌన్స్ చేశామా, లేదా అన్నదే ముఖ్యం. విరాళం ఇచ్చామా, లేదన్నది ఎవడు చూసోచ్చాడు. అంతేనంటావా?



-పి. నాగశ్రీనివాసరావు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top