అతి కష్టమ్మీద గెలిచిన అధికారపక్షం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు - Sakshi


కడప,కర్నూలు, నెల్లూరు : అధికార టీడీపీ ప్రలోభాల పర్వం ఫలించింది. బెదిరింపులు, అక్రమ కేసులు, ఒత్తిళ్లతో ఎట్టకేలకు అధికార పక్షం అనుకున్నది సాధించింది. ప్రజామోదం లేకున్నా....పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎమ్మెల్సీ స్థానాలను అడ్డదారిలో దక్కించుకుంది.  కాగా వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ స్వల్ప తేడాతో విజయం సాధించింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి వైఎస్ వివేకానందరెడ్డిపై 33 ఓట్ల తేడాతో గెలుపొందారు. హోరా హోరీగా సాగిన కౌంటింగ్‌లో...తొలి రౌండ్లో వైఎస్ వివేకానందరెడ్డి ముందంజలో నిలిచిన.. ఆ తరువాత కొద్ది తేడాతో బీటెక్ రవి గెలుపొందారు.



కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపొందారు. వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్ధి గౌరు వెంకట్‌రెడ్డిపై 64 ఓట్ల తేడాతో శిల్పా చక్రపాణి విజయం సాధించారు. ప్రారంభంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి గౌరు వెంకట్‌రెడ్డి ముందంజలో ఉన్నా...ఆ తరువాత పుంజుకుని స్వల్ప ఓట్ల తేడాతో శిల్పా చక్రపాణి గెలుపొందారు. శిల్పా చక్రపాణికి 565 ఓట్లు పోలవగా, గౌరు వెంకటరెడ్డికి 501 ఓట్లు వచ్చాయి.



నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై 87 ఓట్ల తేడాతో వాకాటి నారాయణరెడ్డి గెలుపొందారు. మొత్తం 851 ఓట్లు పోలవగా... టీడీపీ అభ్యర్ధికి 462, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధికి 378 ఓట్లు వచ్చాయి.  ఇందులో రెండు ఓట్లు చెల్లనివి కాగా...మరో 10 ఓట్లు తేలలేదు.



ఇక వైఎస్‌ఆర్‌, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంటే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాలు సాధించింది. ఈ మూడు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగితే ఆ మూడు సీట్లు వైఎస్సార్‌సీపీనే సునాయాసంగా గెలుస్తోంది. కానీ బలం లేకున్నా....అధికార బలం, ధన బలంతో ఈ మూడు స్థానాల్లో పోటీ పెట్టిన టీడీపీ....వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభాలు పెట్టి, దారికి రాకుంటే బెదిరించి మరీ ఓట్లు వేయించుకుంది. ఏకంగా మంత్రులే దగ్గరుండీ క్యాంపు రాజకీయాలు చేయించారు.  ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైఎస్‌ఆర్‌ సీపీ... ఎన్నికల్లో తాము ఓటమిపాలు అయినా.... నైతిక విజయం మాత్రం తమదేనని తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top