నేడు టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం

నేడు టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం - Sakshi


తుళ్లూరు, హైదరాబాద్‌లలో పాల్గొననున్న  చంద్రబాబు



హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరు జిల్లా తుళ్లూరుతోపాటు హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవన్‌లో పార్టీ జెండాను ఎగురవేస్తారు. అనంతరం జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను సన్మానిస్తారు. అక్కడినుంచి నెక్లెస్‌రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు, అక్కడ కూడా జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు సన్మానం చేస్తారు.



ఏప్రిల్ 11 నుంచి సంస్థాగత ఎన్నికలు



టీడీపీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికలను వచ్చే నెల 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ నిర్ణయించిందని కన్వీనర్ కిమిడి కళా వెంకట్రావు శనివారం ఓప్రకటనలో తెలిపారు. ఆరు, ఏడు తేదీల్లో మండల, పట్టణ, డివిజన్, అనుబంధ కమిటీల ఎన్నికల అధికారులకు ఎన్‌టీఆర్ భవన్‌లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. 11 నుంచి 21 వరకూ  ఆయా కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మే ఆరు నుంచి ఎనిమిది వరకూ జిల్లా పార్టీ, అనుబంధ కమిటీల ఎన్నికలు జరుపుతారు. మే 11 నుంచి 24 వరకూ అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు జరుగుతాయి. మే 27 నుంచి 29 వరకూ మహానాడు నిర్వహిస్తారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top