మళ్లీ తన్నుకున్న తెలుగుతమ్ముళ్లు...


శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు వివాదాలు, ఘర్షణలకు వేదికగా మారాయి. ఇప్పటికే రాజాం, వంగర, పోలాకి, భామిని మండలాల్లో విభేదాలతో రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్లు తాజాగా పాలకొండ మండల కమిటీ ఎన్నిక... దాడులు, దూషణలు, పరస్పర ఫిర్యాదులతో రసాభాసగా మారింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ మండల కమిటీ ఎన్నిక కూడా గొడవలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.


శుక్రవారం రెండోసారి జరిగిన ఎంపిక కార్యక్రమం కూడా గొడవలతో వాయిదా పడింది. మండల కమిటీ ఎన్నిక కోసం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం కూడా వివాదంగా మారింది. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి కర్నేన అప్పలనాయుడులు వ్యక్తిగత దూషణలకు దిగడంతో వివాదం తలెత్తింది.



పరస్పర ఆరోపణలతో ఇద్దరు దాడులు చేసుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు. తమ నేతలకు మద్దతుగా ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా కేకలు వేసుకోవడంతో సమావేశ ఆవరణ రంగంగా మారింది. పోలీసులు ముందు జాగ్రత్తగా పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించినప్పటికీ ఎన్నిక మాత్రం జరగలేదు. ఎన్నికకు ముందు రోజు ఇరువర్గాలు మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి బలప్రదర్శనకు దిగడంతో ఆయన కినుక వహించారు. మరో వర్గం నేత కళావెంకటరావు ఎన్నికపై ఎటువంటి సూచనలు చేయకపోవడంతో ఇరువర్గాలు యథావిధిగా సమావేశంలో తన్నుకున్నారు.



తనపై దాడి చేశారని నియోజకవర్గ ఇన్‌చార్జి జయకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా డబ్బులకు అమ్ముడుపోయి కావాలనే కార్యకర్తలకు ఇన్‌చార్జి అన్యాయం చేస్తున్నారని అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీ పరిశీలకులకు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. వివాదాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి కమిటీలను ఎంపిక చేస్తామని చెప్పి పరిశీలికులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top