భలే భూగోతం..!

భలే భూగోతం..! - Sakshi


ల్యాండ్ బ్యాంకు పేరిట భూముల గుర్తింపు-ఆపై లాక్కునేందుకు ఎత్తుగడ

భూ కామందుల చేతుల్లో ఉన్న భూమి ఊసెత్తని యంత్రాంగం

ఏడు విడతల్లో పంపిణీ చేసిన భూమే సింహభాగం

ఫారెస్ట్‌ల్యాండునూ ల్యాండ్‌బ్యాంకులో పొందుపరిచి గందర గోళం చేస్తున్న ప్రభుత్వం

మాకు దిక్కెవరంటున్న హరిజన, గిరిజనులు


విజయనగరం కంటోన్మెంట్: హరిజన, గిరిజనుల సంక్షేమానికి విడుదల చేస్తున్న వందల కోట్ల రూపాయలు ఏమైపోతున్నాయో తెలియదు కానీ ఇప్పుడు వారు అనుభవిస్తున్న భూములకూ రెక్కలొస్తున్నాయి. ల్యాండు బ్యాంకు పేరుతో డిపట్టాలను లాక్కునేందుకు  ప్రభుత్వమే పన్నాగం పన్ను తోంది.   ఇప్పటికే  భూ కామందుల ఆక్రమణలతో అల్లాడిపోతున్న నిరుపేదలపై ఏకంగా ప్రభుత్వమే  ల్యాండ్ బ్యాంకును తెరిచి పేదోళ్ల భూములను పారిశ్రామిక వేత్తలకు, అభివృద్ధి కార్యక్రమాల పేరిట పందేరం చేసేందుకు పక్కా ప్రణాళికను రచించింది.



 అధికారులపై ఒత్తిడి

 భవిష్యత్తు అవసరాల కోసం  ప్రభుత్వం డిపట్టా భూములపై కన్నేసింది. ల్యాండ్‌బ్యాంకు పేరిట ఒక చోట చేర్చి ఉంచింది. ఎప్పుడైనా ఆ భూములను లాక్కునేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  దీంతో   వేలాది మంది నిరుపేద డిపట్టాదారులు  తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 37,923.17 ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకు కింద పోగేశారు. ఈ భూమిని సాగు చేస్తున్న వారికి నోటిఫికేషన్, నోటీసులు ఇచ్చి భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వ నిర్ణయం.  ఇందు కోసం కలెక్టర్, రెవెన్యూ అధికారులతో పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి వారిపైనా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వ భూములతో పాటు పేదవారికిచ్చిన డిపట్టా భూములను కేటగిరీలుగా విభజించి వాటిని పార్శిళ్లుగా వర్గీకరించారు.  జిల్లాలో ఒకటి నుంచి 50 ఎకరాలు ఒక కేటగిరీగా, 51 నుంచి 100 ఎకరాలు ఒక కేటగిరిగా, వంద ఎకరాలనుంచి ఆపైన ఉన్న భూములను మూడో కేటగిరీగా విభజించారు. జిల్లాలోని 34 మండలాల్లో 79 చోట్ల  818 పార్శిళ్లుగా విభజించారు.



 

 మహానేత   ఆశయానికి తూట్లు: గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు.

 సాగు చేసుకుని ఉపాధి పొందుతున్న వారికి పట్టాలు అందజేశారు. గతంలో ఏడు విడతల భూపంపిణీల్లో కలిపి 56,622 మందికి 69,476 ఎకరాలు పంపిణీ చేశారు. ఇందులో 12057 మంది ఎస్సీలకు 13959 ఎకరాలు, 22701 మందికి 33,760.52 ఎకరాలను పంపిణీ చేశారు. మిగతా భూమి బీసీలు, ఓసీలకు పంపిణీ చేశారు. అయితే ఓసీ, బీసీలు మినహా ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల్లో  సింహభాగం  ప్రస్తుతం చేతులు మారి పలువురి వద్ద ఉంది.



 వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయని ప్రభుత్వం పేదల చేతుల్లోని భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఇలా డి పట్టాలను  పొందిన వారి భూములను కూడా లాక్కునేందుకు ల్యాండ్ బ్యాంకులో పొందుపరచడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు.   దీనిపై పలు ప్రజా సంఘాలు పోరాడేందుకు నడుం బిగిస్తున్నాయి. ఫారెస్ట్ భూములు కూడా..ల్యాండ్ బ్యాంకు పేరిట ప్రభుత్వం  అటవీ భూములను కూడా పొందుపరిచింది.   డిపట్టాలు ఇచ్చాక వారికి  భూమి ఎక్కడ ఉందో చూపించేందుకు  సబ్ డివిజన్ చేయలేదు.  జిల్లాలో 8 వేల ఎకరాలుంటుంది.ఎవరి భూమి ఏదో తెలియకముందే వాటిని తిరిగి స్వాధీనం  చేసుకునేందుకు ప్రణాళిక రచించడం దారుణమని పలువురు ఆవేదన చెందుతున్నారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top