వలస నేత.. ఎదురీత!

వలస నేత..  ఎదురీత! - Sakshi


నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో కుదరని సమోధ్య

మంత్రులకు ఫిర్యాదు

రాజీ అంటే పార్టీ నుంచిబయటకే అంటూ హెచ్చరిక

►  సీఎం వద్ద పంచాయితీ చేస్తామని బుజ్జగింపు

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు


 

 

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: అభివృద్ధి కోసమంటూ ఇటీవలే పార్టీ మారిన ఎమ్మెల్యే అతను. అయితే ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్‌కు అతనికి పొసగలేదు. పలు మార్లు వారు బహిరంగంగానే విమర్శలు దిగారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఇమడలేక వలసనేత ఎదురీదాల్సి వస్తోంది. ఆదివారం కర్నూలులో నిర్వహించిన సమావేశంలో తన ఆవేదనను మంత్రుల ఎదుట వెళ్లగక్కారు. ‘‘ఆయనతో రాజీ అంటే నేను ఒప్పుకునేదే లేదు. అవసరమైతే పార్టీ నుంచి బయటకైనా వెళతాను కానీ కలిసి పనిచేసే ప్రశ్నేలేదు.



ఆయన, ఆయన కుమారుడిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు వ్యవహారంలో నా ప్రమేయం లేదు. వేరే వాళ్లు పెట్టారు’’ అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అచ్చెన్నాయుడుల సమక్షంలో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే ఖరాఖండిగా తేల్చిచెప్పారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే ఏ మాత్రం సమన్వయం లేకుండా ఇంకా ప్రతిపక్షంగానే వ్యవహరిస్తున్నారని మరో నేత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాయితీ చేస్తామని ఇరువురి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరువురి నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. పార్టీలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పాటు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అచ్చెన్నాయుడులు ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.



గతం నుంచి పార్టీలో ఉన్న నేతలు, తాజాగా పార్టీలో చేరిన నేతల మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు అధికారులు చెప్పిన పనులు చేసే విధంగా చేసేందుకు ఉద్దేశించిన సమావేశంలో సయోధ్య ఏ మాత్రమూ కుదరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారులపై మాత్రం పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై సదరు అధికారులను పిలిపించి చెప్పిన పనులు చేయాల్సిందేనని ఇన్‌చార్జీ మంత్రి గట్టిగా మందలించినట్టు తెలిసింది.

 

 మాకు తెలియకుండానే బదిలీలా...!

 ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల బదిలీలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. విద్యుత్‌శాఖలో తమకు తెలియకుండానే ఇంజినీర్లను బదిలీ చేశారని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ (ఎస్‌పీడీసీఎల్) ఎస్‌ఈని పిలిచి నిలదీశారు. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొద్ది మందిని మార్చాలని గంగుల ప్రభాకర్ రెడ్డి కోరినట్టు తెలిసింది. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో తనకు తెలియకుండా కొంతమందిని మర్చారని పార్టీ ఇన్‌చార్జీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.



ఇక నంద్యాల నియోజకవర్గంలో అధికారులు మాట వినడం లేదని..ఆయన మాటలు వినాల్సిన అవసరం లేదని జిల్లా బాధ్యుడే చెబుతున్నారని ఇన్‌చార్జీ మంత్రి దృష్టికి ఇంకో నేత ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంతకు ముందు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఇదే తరహాలో ఒకరికొకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఎస్పీ రవికృష్ణతో పాటు అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ నేతలు బీసీ జనార్దన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, మీనాక్షి నాయుడు, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, కేఈ ప్రతాప్, వీరభద్రగౌడు తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ దూరంగా ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top