తూతూమంత్రం... రైతు రుణమాఫీ

తూతూమంత్రం ...రైతు రుణమాఫీ - Sakshi


సాక్షి, ఒంగోలు: అన్నదాత గందరగోళంలో పడ్డాడు. పూర్తి పంటరుణాలు మాఫీ చేస్తానన్న అధికార టీడీపీ.. నేడు కుటుంబానికి రూ.లక్షన్నర చొప్పున రుణం మాత్రమే మాఫీ చేస్తామని షరతులు విధించడంపై అయోమయం చెందుతున్నాడు. అదికూడా పంటరుణం, బంగారంపై తీసుకున్న రుణాలన్నీ కలిపి రూ.లక్షన్నర మాత్రమేనని రాష్ట్ర కేబినెట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో సోమవారం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల సారాంశం ప్రకారం.. రైతు రుణమాఫీ, డ్వాక్రాసంఘాల రుణాల మాఫీ అమలు తూతూమంత్రమేనని తేలిపోయింది.

 

రైతురుణాల్ని కుటుంబాలతో పోల్చి లెక్కలేద్దామనే ప్రభుత్వ ఆలోచనలో ఆంతర్యం లబ్ధిదారులకు బోధపడటం లేదు. బ్యాంకులో తీసుకున్న రుణలబ్ధిదారుల కుటుంబాలను ఏవిధంగా గుర్తించనున్నారు..? రెవెన్యూ అధికారుల ధ్రువీకరణలతో ఒకవేళ గుర్తించినా.. ఉమ్మడి కుటుంబాల నుంచి పొలాల భాగాలను విభజించుకుని వేరుపడిన అన్నదమ్ముల రుణాలపై పరిస్థితేంటనేది స్పష్టత లేదు.

 

మరోవైపు డ్వాక్రా సంఘాలకూ ఒక్కో సంఘానికి రూ.లక్షచొప్పున రుణమాఫీ అమలంటూ కేబినెట్ తీర్మానించింది. పదిమంది సభ్యులున్న సంఘానికి రూ.లక్ష మాఫీ అయితే, ఒక్కో సభ్యురాలు బ్యాంకుకు చెల్లించాల్సిన రుణంలో రూ.10 వేలు మాత్రమే మాఫీ కానుంది. దీనిపైనా మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రతిపాదనల అమలుకూ ఆర్‌బీఐ నుంచి అనుమతి రావాల్సి ఉంది.

 

జిల్లావ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో  దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తం వాయిదాల మీదనున్న బకాయిలు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.3 వేల కోట్లు ఉండగా, కిందటేడాది ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్ల విలువైన రైతు రుణాలు మాఫీకావాల్సి ఉంది.

 

జిల్లాలో 29 పీడీసీసీబీ శాఖల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే మరో రూ.488.67 కోట్ల మేరకు లబ్ధిచేకూరుతుంది. పీడీసీసీబీ రుణాల మాఫీ జరిగితే.. మొత్తం 1,00,625 మంది రైతులు లబ్ధిపొందాల్సి ఉంది. అయితే, తాజాగా కేబినెట్ ప్రకటన ప్రకారం వీటిల్లో మాఫీ అయ్యేది స్పల్పమాత్ర రుణాలేనని బ్యాంకర్లు చెబుతున్నారు.

 

రీషెడ్యూల్ అమలు తాత్సారం...

రుణాల రీషెడ్యూల్ అమలుకు రిజర్వుబ్యాంకు నాలుగురోజుల కిందట్నే అనుమతించినా.. ఆ మేరకు  బ్యాంకర్లకు అధికారిక ఆదేశాలు రాలేదు. అయితే, ఈవిధానాన్ని కూడా జిల్లా మొత్తం వర్తించకుండా.. కేవలం కొన్ని మండలాలకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే.. ఆర్‌బీఐ నిబంధనల మేరకు కిందటేడాది ఎక్కడైతే తుపాను, కరవు సంభవించినట్లు ప్రభుత్వం గుర్తించినదో.. అక్కడి రైతులకే రుణాల రీషెడ్యూల్ చేస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆ మేరకు జిల్లాలో 45 తుపాను ప్రభావిత మండలాలు, నాలుగు కరువు పీడిత మండలాలంటూ ఈఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది.

 

గడువు మీరిన బకాయిలన్నీ రైతులపేరు మీదనే ఉండి.. రుణం తీసుకున్న నాటి నుంచి ఇవ్పటి వరకు వడ్డీ 11.75 శాతంను అసలు మొత్తంతో కలిపి లెక్కించి బకాయిగా రికార్డులో నమోదు చేయనున్నారు. కొత్తగా ప్రస్తుతం రుణాలిచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే, జిల్లాలోని 5 లక్షల మంది రైతుల్లో 49 మండలాల రైతులకే రీషెడ్యూల్ వర్తిస్తే.. మిగతా వారి రుణాల పరిస్థితేంటనేది ప్రశ్నగా మారింది.

 

పైగా, బ్యాంకరు రైతు వద్దనున్న అన్ని ఆధార ధ్రువీకరణలు, పొలం పుస్తకాలు చూసిన తర్వాతనే రుణాలిస్తారని... ఆధార్‌కార్డు వంటి షరతులు పెట్టి ప్రభుత్వం  రైతులను అనుమానించే ప్రయత్నం చేస్తోందని రైతుసంఘాలు ఇప్పటికే ఆందోళన చేపట్టాయి. తాజాగా, రైతుకుటుంబాలను గుర్తించే ప్రక్రియ.. వారి రుణాల రద్దు వ్యవహారంపై స్పష్టత లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే.. ఈసారి ఖరీఫ్‌కు రైతు రుణాలు లేనట్టేనని.. రీషెడ్యూల్ అమలుపై కూడా అనుమానాలున్నట్లు రైతుసంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top