పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ ధర్నా


 దేవరపల్లి : దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌ను సుమారు వంద మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి ముట్టడించారు. ఎస్సైకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ ఎస్వీ నరసింహరావు, మం డల టీడీపీ అధ్యక్షుడు సుంకర దుర్గారావు, ఉపసర్పంచ్ తంగెళ్ల మునేశ్వరరావు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కార్యకర్తలను సముదాయించారు. ఎస్సై ఆర్.శ్రీను, సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు కొవ్వూరు సీఐ ఎం.సుబ్బారావు అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎమ్మెల్యే, ఎంపీపీ, టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. యర్నగూడెంలో పేకాడుతున్నారనే నెపంతో ఐదుగురు వ్యక్తులను ఎస్సై అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పాటు వారిని చిత్రహింసలకు గురిచేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. పేకాటలో లేని వ్యక్తులను బలవంతంగా తీసుకువచ్చారన్నారు. అధికార పార్టీ నాయకుల మాటను కూడా ఖాతరు చేయడం లేదని విరుచుకుపడ్డారు. తప్పుడు కేసులు బనాయించి మనోవేదనకు గురిచేస్తున్నారని  చిట్లు సుబ్బారావు, తంగెళ్ల మునేశ్వరరావు, కార్యకర్తలు ఎస్సైపై ఆరోపణలు చేస్తూ సీఐకి ఫిర్యాదు చేశారు.

 

 ఇబ్బందులకు గురిచేస్తున్నారు

 ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పలుమార్లు పోలీసులను హెచ్చరించినా సరిచేసుకోలేదని, చిన్న విషయాలకు ప్రజలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు.

 

 రోడ్డుకెక్కడం సరికాదు

 అధికార పక్షం కార్యకర్తలు రోడ్డుపెకైక్కి ఆందోళనలు చేయడం మంచిదికాదని సీఐ సుబ్బారావు అన్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రాస్తారోకోలు, ధర్నాలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసి ఎస్సైపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటానని సీఐ సుబ్బారావు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. దీంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top