తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ - Sakshi


- పార్టీ రాష్ట్ర పరిశీలకుల ఎదుటే తన్నులాట

- గాల్లోకి ఎగిరిన కుర్చీలు

- బాహాబాహీకి దిగిన ఇరువర్గాల నాయకులు

- పోలీసుల రంగప్రవేశం


మదనపల్లె: మదనపల్లెలో బుధవారం సాయంత్రం తెలుగుదేశం నాయకులు ఘర్షణపడ్డారు. ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పార్టీ రాష్ట్ర పరిశీలకులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే నాగేశ్వరరెడ్డి, గంగాధర్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే జీ.శంకర్, మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నేతృత్వంలో పీలేరు సభ్యత్వ నమోదుపై  చర్చించేందుకు ఆర్ అండ్ బీ బంగ్లాలో నియోజకవర్గ నాయకులను పిలిపించా రు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహమ్మద్ ఇక్బాల్, పార్టీ నాయకుడు మల్లారపు రవిప్రకాష్‌తో చర్చలు ప్రారంభించారు.



వేపులబైలుకు చెందిన రమణారెడ్డి వెళ్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పార్టీని నాశనం చేస్తున్నాడని ఫిర్యాదు చేస్తుండగా మహమ్మద్ ఇక్బాల్ సోదరుడు ఫయాజ్ అతన్ని కాలర్ పట్టుకుని లాగేశాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ఇక్బాల్ వైఖరిపై దుమ్మెత్తిపోశారు. గొడవ తీవ్రం కావడంతో పరిశీలకులు గది గడియ పెట్టుకుని చర్చలు జరిపారు. సమావేశం పూర్తికాగానే బయటకు వచ్చిన ఇక్బాల్, ఆయన అనుచరులపై రవిప్రకాష్ వర్గానికి చెందిన పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాలు దాడులకు దిగారు. బంగ్లా బయట ఉన్న కుర్చీలతో కొట్టుకున్నారు. ఆర్ అండ్ బీ ప్రాంగణమంతా పరుగులు తీస్తూ ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డారు.

 

నాయకులు చెప్పినా పట్టించుకోని వైనం..

పార్టీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ ఇరువర్గాలను సముదాయించారు. పార్టీ పరువు తీయవద్దని బతిమాలుతూ గొడవను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

 

పోలీసులు రంగప్రవేశం

పోలీసులకు సమాచారం తెలియడంతో వన్ టౌన్ ఎస్‌ఐ మల్లికార్జున సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆర్ అండ్ బీ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. జిల్లా కన్వీనర్‌తో చర్చించి పరిస్థితి అదుపు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top