నమ్మించి...వంచించి..!

నమ్మించి...వంచించి..! - Sakshi


మాచర్ల మునిసిపాలిటీలో టీడీపీ కొత్త డ్రామా ..

పదవి నుంచి దిగిపోవాలని చైర్‌పర్సన్‌పై ఒత్తిడి

ససేమిరా అంటున్న చైర్‌పర్సన్ వర్గీయులు

గ్రూపులుగా విడిపోయిన అధికార కౌన్సిలర్లు


 

 

మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి

 

  వైస్ చైర్‌పర్సన్ నెల్లూరు మంగమ్మ

 

 

ఏరుదాటాక తెప్ప తగలేయడం అధికార పార్టీకి అలవాటే అంటున్నారు. నమ్మించి వంచించడంలోనూ అంతేనంటున్నారు. ఓట్ల కోసం దేనికైనా ఒడిగడతారని, అవసరమైతే మాటలు చెప్పి మభ్యపెడతారంటున్నారు. ఈ కోవలోనే మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోతూ, అధికారపార్టీ అంటేనే అసహ్యించుకునే రీతిలో చైర్‌పర్సన్ సామాజిక వర్గీయులు రగిలిపోతున్నారు. - సాక్షి, గుంటూరు

 

 

సాక్షి, గుంటూరు : తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చేందుకు వర్గాలను వాడుకొని ఆ తర్వాత కూరలో కరివేపాకులా ఏరిపారేయడం అధికార పార్టీ నేతలకు అలవాటు. జిల్లాలోని మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ వ్యవహారంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. మున్సిపాల్టీలో ఎక్కువ ఓటర్లు ఉన్న ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చైర్‌పర్సన్ పదవిని ఎరచూపారు. ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థితో భారీగా ఖర్చు పెట్టించారు. తీరా గెలుపొందిన తర్వాత అధికార పార్టీ అసలు రూపం చూపించారు. చైర్‌పర్సన్‌కు ఏ పనిలోనూ సహకరించకుండా అడుగడుగునా అవస్థలకు గురిజేశారు. ఒప్పందంలో భాగమంటూ ఇప్పుడు పదవి నుంచి దిగిపోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. కౌన్సిలర్లు గ్రూపులుగా విడిపోయినట్లు డ్రామాలాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు.





అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకి....

టీడీపీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గోపవరపు శ్రీదేవిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. పదవి చేపట్టినప్పటి నుంచి అధికార పార్టీ సామాజిక వర్గ నేతలు, కౌన్సిలర్లు ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్‌లో ఆమోదించాల్సి వచ్చినప్పుడల్లా గైర్హాజరవుతూ కోరం లేకుండా చేస్తూ అడుగడుగునా అడ్డుపడ్డారు. అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో దూషణలకు దిగడమే కాకుండా చైర్‌పర్సన్, ఆమె భర్తపై భౌతిక దాడులకు సైతం తెగబడ్డారు. సుమారు ఆరు కోట్ల నిధులు ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు చేసే అవకాశం లేకుండా చేశారు. పలు సార్లు కౌన్సిల్ సమావేశాల సాక్షిగా చైర్‌పర్సన్, ఆమెకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లను అవమానించారు.





పదవి నుంచి దిగేందుకు ససేమీరా అంటున్న చైర్‌పర్సన్ వర్గం...

ఒప్పందం ప్రకారం జూలై 2వ తేదీన నూతన చైర్‌పర్సన్‌గా ప్రస్తుత వైస్ చైర్మన్ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. తమకాలంలో ఒక్క పనికి కూడా సహకరించనందుకు తాము పదవి నుంచి దిగే సమస్యే లేదని చైర్‌పర్సన్ వర్గం భీష్మించి కూర్చుంది. వైస్ చైర్మన్ నెల్లూరు మంగమ్మను చైర్‌పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ, మంత్రి సైతం శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవసరమైతే చైర్‌పర్సన్‌ను  పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు.

 

పదవి కోసం డ్రామా....

ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా వారు పట్టీ పట్టనట్లు వ్యవహరించిన తీరుపై చైర్‌పర్సన్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఖండించని  నియోజకవర్గ ఇన్‌చార్జితోపాటు, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు వారి సామాజిక వర్గం నేతను చైర్మన్‌గా కూర్చొబెట్టేందుకు రాజకీయ డ్రామాకు తెరలేపారు. గ్రూపులుగా విడిపోయినట్లు నటిస్తూ చైర్‌పర్సన్ సామాజిక వర్గానికి దూరం కాకుండా వ్యవహారం నడుపుతున్నారు. చైర్‌పర్సన్ ఇబ్బందులకు గురిచేసినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారంటూ ఆర్యవైశ్య నాయకులు జిల్లా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top