ఏయూ దెయ్యాల కొంప

ఏయూ దెయ్యాల కొంప


ఎమ్మెల్సీ మూర్తి వ్యాఖ్య.. పెల్లుబికిన నిరసన

►  వైఎస్సార్‌ సీపీ ధర్నా, మూర్తి దిష్టిబొమ్మ దహనం

►  బహిరంగ క్షమాపణకు డిమాండ్‌

►  ఏయూపై వ్యాఖ్యలు దారుణం: మంత్రి గంటా




సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపగా అభివర్ణించడంపై వర్సిటీ భగ్గుమంది.  గురువారం  విద్యార్థి, అధ్యాపక, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర, రాజకీయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. సోషల్‌ మీడియాలోనూ మూర్తి వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. సొంతపార్టీ నేతలు కూడా మూర్తి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. విశాఖలో బుధవారం టీడీపీ మహానాడు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ ‘ఏయూ ఓ దెయ్యాల కొంప. అక్కడి గ్రౌండ్స్‌లో ఆడేవాళ్లే లేరు. దుమ్ము దులిపేవాళ్లే లేరు. మహానాడు పేరుతో బాగుచేస్తుంటే ఏమిటీ రాద్దాంతం..’ అంటూ వ్యాఖ్యానించారు. మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ‘ఏయూ దెయ్యాల కొంప’ శీర్షికన గురువారం సాక్షి టాబ్లాయిడ్‌లో ప్రచురితమయ్యాయి. దీనిపై ఏయూ ప్రవేశద్వారం వద్ద గురువారం వైఎస్సార్‌ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఏయూపై చేసిన వ్యాఖ్యలను మూర్తి వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. 24 గంటల్లో క్షణాపణ చెప్పకపోతే మూర్తి ఇంటిపై దాడిచేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.  



సొంత యూనివర్సిటీ కోసమే..

ఏయూ దెయ్యాల కొంప అయితే మహానాడు ఎందుకు పెడుతున్నారని పలు వర్గాల వారు నిలదీశారు. ఆయన ఏయూ పరువును దిగజార్చి తన గీతం యూనివర్సిటీ ఖ్యాతిని పెంచుకోవాలనే కుత్సితభావంతో ఉన్నారని విమర్శించారు. ఏయూ ఇచ్చిన డాక్టరేట్‌ను మూర్తి వెనక్కి ఇవ్వాలని ఏయూ టీచింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాలాది రవి, నాన్‌ టీచింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆయన శుక్రవారంలోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని,  ఇందుకు టీచింగ్, నాన్‌టీచింగ్, ఏయూ కో ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీలు జేఏసీగా ఏర్పడ్డాయని చెప్పారు.



విశాఖ వాసులు అసహ్యించుకుంటున్నారు

బతుకుదెరువు కోసం విశాఖ వచ్చిన మూర్తి ఏయూను దెయ్యాల కొంపగా అభివర్ణించడాన్ని విశాఖవాసులు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు అమర్‌నాథ్‌ చెప్పారు. మూర్తి వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు దెయ్యాల్లా పడి ఏయూలో మహానాడు జరుపుతూ వర్సిటీ పవిత్రతను పాడుచేస్తున్నారని దుయ్యబట్టారు. మూర్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మూర్తి క్షమాపణ చెప్పకపోతే మహానాడును అడ్డుకుంటామన్నారు. ఆయన్ని వెంటనే తెలుగుదేశం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మూర్తి డౌన్‌డౌన్‌ అంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం మూర్తి దిష్టిబొమ్మను దహనం చేశారు.



వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, విశాఖ దక్షిణ, భీమిలి సమన్వయకర్తలు కోలా గురువులు, అక్కరమాని నిర్మల, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, బీసీడీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఫరూఖీ, జిల్లా అధికార ప్రతినిధి మూర్తియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  కాగా, ప్రతిష్టాత్మకమైన ఏయూను దెయ్యాల కొంపతో పోల్చడం దారుణమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, మూర్తి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.



మూర్తి వ్యాఖ్యలను ఖండించిన పాలకమండలి సభ్యులు

విశాఖసిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని ఏయూ పాలకమండలి సభ్యులు ఆచార్య ఎం.ప్రసాదరావు, డాక్టర్‌ పి.సోమనాథరావు, డాక్టర్‌ ఎస్‌.విజయ ఒక ప్రకటనలో ఖండించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top