ఆంధ్రా యూనివర్శిటీ దెయ్యాల కొంపా?

ఆంధ్రా యూనివర్శిటీ దెయ్యాల కొంపా?


విశాఖ : ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్శిటీపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఆంధ్రా వర్శిటీని ఓ దెయ్యాల కొంప, బందుల దొడ్డి అంటూ ఆయన ఓ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. అసలు ఇక్కడేముంది దెయ్యాల కొంప, బందుల దొడ్డి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ‘ఏయూలో మహానాడు పెడితే తప్పేంటి.. రూములు తీసుకుంటున్నారు. శుభ్రంగా తుడుస్తున్నారు...బాగు చేస్తున్నారు.. పెయింట్లు గీయింట్లు వేయిస్తున్నారు. ట్యాప్‌లు కూడా బాగు చేస్తున్నారు. ఇదంతా యూనివర్శిటీకి ఉపయోగమా...నష్టమా? ఏయూ వాళ్లు ఎటూ బాగు చేయడం లేదు. వీళ్లు బాగు చేసి అందులో ఉంటామంటే ఇవ్వాలి..దెయ్యాల కొంపను ఇవ్వడానికి అడ్డుపడటం ఎందుకు’ అని అన్నారు.


తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎంవీవీఎస్‌ మూర్తి తాను చేసిన తప్పును కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏయూలో టీడీపీ మహానాడును నిర్వహించడం ద్వారా వర్శిటీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖలో మహానాడు సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణాన్ని టిడిపి వేదికగా చేసుకున్న విషయం తెలిసిందే.



అయితే ఎంవీవీఎస్‌ మూర్తి వ్యాఖ్యలను ఏయూ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆయన తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మహానాడును అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఆంధ్రా యూనివర్శిటీ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ అసోసియేషన్‌ తప్పుపట్టింది. ఎంవీవీఎస్‌ మూర్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఏయూలోనే చదువుకుని ఉన్నత పదవులు అధిరోహించారని, అలాంటి వర్శిటీపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.



కాగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఎంవీవీఎస్‌ మూర్తి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆంధ్రా యూనివర్శిటీకి గొప్ప చరిత్ర ఉందని, ఏ ఉద్దేశ్యంతో మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సరికాదని గంటా అభిప్రాయపడ్డారు.


అలాగే ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ మహానాడు నిర్వహణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలైంది. ఏయూ రీసెర్చ్‌ స్కాలర్‌ ఇవాళ లంచ్‌ మెషన్‌ పిల్‌ వేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది. తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top