మినీ మహానాడు తీర్మానాలివీ


 చర్చకు రాని పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ అంశాలు

 పాలకొల్లు/ఏలూరు :పాలకొల్లులో శనివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై పలు తీర్మానాలను ఆమోదించారు. వాటిని చంద్రబాబుకు నివేదించి పార్టీ రాష్ట్ర మహానాడులో చర్చించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాల వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో జల రవాణాను పునరుద్ధరించాలని, నరసాపురం తీరలో ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మించాలని తీర్మానించారు.

 

  డెల్టాలో ఆక్వా పార్క్ నిర్మాణం, ఫిష్ ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్ యూనిట్ల స్థాపనం, తీరంలో మరబోట్ల తయారీ కర్మాగారాలు, రొయ్యల, చేపల హేచరీలు, ఫిష్ అండ్ ప్రాన్ ఫీడ్ పరిశ్రమలు, ఉప్పుతో సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ తయారీ పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని మినీ మహానాడు కోరింది. చింతలపూడి వద్ద బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం ద్వారా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, కొవ్వూరు, దేవరపల్లి ప్రాంతాల్లో సిరామిక్ పరిశ్రమలు,  ద్వారకాతిరుమలలో సిమెంట్ కర్మాగారాలు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు,

 

  కొబ్బరి పీచు పరిశ్రమలు, కొబ్బరి చిప్పలను కాల్చడం ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ తయారు చేసే పరిశ్రమలు, ఊక, కొబ్బరి పొట్టుతో విత్యుత్ ఉత్పత్తి, ప్యాకేజ్డ్ కోకోనట్ వాటర్, కోకోనట్ పౌడర్, కోకోనట్ మిల్క్ ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పే అవకాశాల్ని పరిశీలించాలని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్, జిల్లాలో నిట్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, కొల్లేరు సరస్సు అభివృద్ది, గోదావరికి ఇరువైపులా రిసార్ట్స్, ఫుడ్ పార్కుల నిర్మాణం మార్టేరు వరి పరిశోధనా కేంద్రం అభివృద్ధి, మెట్టలో యూకలిప్టస్ తోటల పెంపకం, పామాయిల్, బయో డీజిల్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ప్రధమ ప్రాధాన్యతతో డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేయించాలని కోరుతూ తీర్మానించారు.

 

 పోలవరం, పట్టిసీమపై చర్చించని నేతలు

 జిల్లాలో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న అంశాలు మినీ మహానాడులో కనీస ప్రస్తావనకైనా రాలేదు. ఈ అంశాలను ప్రజాప్రతినిధులు, నాయకులు పూర్తిగా విస్మరించడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలాఉండగా, మినీ మహానాడు ప్రారంభానికి ముందు టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెనాల్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రులు అయ్యన్నపాత్రుడు, సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీ గాంధీబొమ్మల సెంటర్, పెదగోపురం, పోలీస్ స్టేషన్, మునిసిపల్ కార్యాలయం, యడ్లబజార్ మీదుగా బ్రాడీపేట బైపాస్ రోడ్డులోని సభావేదిక వద్దకు చేరుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాటలు పాడి ఉత్సాహపరిచారు.

 

 టీడీపీ సేవలో తరించిన మునిసిపల్ యంత్రాంగం

 పాలకొల్లు రూరల్ పంచాయతీ సబ్బేవాని పేటలో శనివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, సిబ్బంది సేవలందించారు. ఇదే అంశంపై మునిసిపల్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు యడ్ల తాతాజీ శనివారం ఒక ప్రకటన చేస్తూ మునిసిపల్ అధికారులు, ఉద్యోగులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేశారని ధ్వజమెత్తారు. మునిసిపల్ కమిషనర్ జీపులో నేరుగా మినీ మహానాడు ప్రాంగణానికి వెళ్లి స్వామిభక్తిని చాటుకున్నారన్నారు. ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు అందించాల్సిన మంచినీటిని మినీ మహానాడుకు తరలించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమానికి మునిసిపల్ ఉద్యోగులు హాజరై ఎందుకు సేవలందించాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి  చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను తాతాజీ కోరారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top