దోచుకున్నోడికి.. దోచుకున్నంత!

దోచుకున్నోడికి.. దోచుకున్నంత! - Sakshi


► కుంటల అభివృద్ధి పేరుతో పేదల భూములపై పెద్దల కన్ను

► ఆ నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు మట్టే మాణిక్యం

► దౌర్జన్యంగా లక్షలు వెనకేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు

► చేసేది లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న బాధితులు

► పర్చూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు అక్రమాలు






నీరే మనిషికి జీవనాధారం. మన పూర్వీకులు పొలాల్లో కుంటలు, చెరువులు తవ్వి, చెట్లు నాటారు. నాటి ఫలాలనే నేటికీ మనం అనుభవిసూ్తనే ఉన్నాం. కాలక్రమంలో కుంటలు పూడ్చటం.. చెరువులు ఆక్రమించటం, చెట్లను నరకడం సర్వసాధారణమైంది. సమస్యను ఆలస్యంగా గుర్తించిన పాలకులు నీరు– చెట్టు పథకానికి శ్రీకారం చుట్టారు. పర్చూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలకు నీరు–చెట్టు పథకం వరంలా మారింది. తిన్నోడికి తిన్నంత.. అన్నట్లు.. దోచుకున్నోడికి.. దోచుకున్నంత.. అన్నట్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.   – ఇంకొల్లు  

 

ఎన్నో ఏళ్లుగా దళితులు, చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న భూములపై కుంటల పేరుతో అధికార పార్టీ నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు. వీరికి అధికారులు వంతపలుకుతున్నారు. నీరు–చెట్టు పేరుతో ఒకే పనికి రెండు మూడు బిల్లులు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఒకే కుంటలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, మరో వైపు అనుమతి లేకుండానే నీరు–చెట్టు పనులు పొక్లెయిన్‌ సాయంతో చేపట్టి రూ.లక్షలు జేబులు నింపుకున్నారు. నీరు–చెట్టు పథకం పేరుతో పేదల సాగులో ఉన్న భూములను తవ్వి అధికార పక్షం మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది.



ఎదురుతిరిగిన వారు మాత్రం కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకొని పనులు ఆపుకుంటున్నారు. బలం లేని వారు చూస్తూ మిన్నకుండి పోతున్నారు. పర్చూరు నియోజకవర్గంలో నల్ల రేగడి భూములు ఉండటంతో సార వంతమైంతమైన మట్టి దొరుకుతుంది. పల్లపు పొలాల్లో మెరకలు వేసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. నీరు– చెట్టు పథకం అసలు ఉద్దేశం భూగర్భ జలాలు పెరగాలి. ఈ ప్రాంతంలో ఆ అవకాశం లేదు. కారణం ఇక్కడ భూముల్లో  రేగడి మట్టి తర్వాత సుద్ద మట్టి ఉంటుంది. ఆ సుద్ద మట్టి నీటిని ఇంకనివ్వదు. ఎనిమిది మీటర్ల కింద భూగర్భ జలం ఉన్న చోట మాత్రమే నీరు–చెట్టు పనులు చేయాలి. ఈ ప్రాంతంలో 5 మీటర్లలోపే భూగర్భ జలం ఉంటుంది.



భూసేకరణ చట్టానికి తూట్లు

2013 భూ సేకరణ చట్టం ప్రకారం పనులు చేయాలనుకున్న భూమి యజమానులకు ముందుగా  నోటీసులిచ్చి వారితో చర్చించాలి. ఆ రోజు ఉన్న రిజిస్ట్రేషన్‌ విలువపై నాలుగు రెట్లు అదనంగా నష్టపపరిహారం చెల్లించి బాధితులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాత పనులు చేపట్టాలి. పెద్దలు సాగు చేసుకుంటున్న చేపల చెరువులు, తోటల జోలికి వెళ్లకుండా నిరు పేదలు, ఎస్సీ, ఎస్టీలు సాగు చేసుకుంటున్న  భూములపైనే అధికార పార్టీ నాయకులు ధన దాహంతో వ్యవహరించి సాగు భూములను అక్రమంగా తవ్వేస్తున్నారు. నీరు– చెట్టు పేరుతో చేసే పనుల్లో వచ్చిన మట్టిని అవసరమైన వారికి ఉచితంగా ట్రాక్టర్లలో పోస్తే వారు తీసుకెళ్లి అవసరానికి ఉపయోగించుకోవాలి. ట్రక్కుల లెక్కన మట్టిని అమ్ముకుంటూ ఆ పని చేసినందుకు వచ్చే ప్రభుత్వ సొమ్ము (ప్రజల సొమ్ము)ను పెత్తందార్లు పంచుకుంటున్నారు. నిబంధనలు కొలతలు కూడా వారిష్ట ప్రకారమే ఇచ్చేందుకు అధికారులు సహకరిస్తున్నారు.       



అన్నిచోట్లా అంతే..

పర్చూరు మండలం నాగులపాలెం గిరిశానికుంట 19.20 ఎకరాల్లో ఉంది. 40 మంది దళితులు, బీసీలు సాగు చేసుకుంటున్నారు. 1975లో కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రభుత్వం ఆ భూమి ఇచ్చింది. అంతకు ముందు నుంచి ఆ భూమిని కొందరు సాగు చేసుకుంటున్నారు. గతేడాది పోలీసులతో సాగుదార్లను అరెస్టు చేయించి ఒకేరోజు నాలుగు పొక్లెయిన్లు పెట్టి సాగుదార్లను బెదిరించి చుట్టూ కట్ట వేశారు. చేసేది లేక బాధితులు కోర్టుకెళ్లి స్టే ఆర్డరు తెచ్చారు. పని ఆపేశారు. సాగుదార్లు పంట వేసుకునేందుకు అడ్డుపడుతున్నారు. దేవరపల్లి సూరాయి కుంట 14.64 సెంట్లు పేదల సాగులో ఉంది.



13 ఏళ్ల క్రితం నీరు–మీరు పేరుతో చెరువు తవ్వేందుకు ప్రయత్నిస్తే పేదలు అడ్డుకొని కోర్టు ద్వారా హక్కు పొందారు. దళితులు సాగు చేసిన భూమిలో చెరువు తవ్వాల్సిన అవసరం లేదని, ఆ గ్రామానికి మంచి నీటి చెరువులున్నాయని, సాగునీటి ఎత్తిపోతల పథకాలూ ఉన్నందున చెరువు అవసరం లేదని అప్పుడే కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తార్వత రెండేళ్ల క్రితం చెరువు తొవ్వే ప్రయత్నం చేస్తే అడ్డుకొని కోర్టు ద్వారా స్టే పొందారు.  గొల్లపూడి రిజిస్ట్రేషన్‌ ఉన్న భూమిని బుకాయించి తవ్వేందుకు ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు. పర్చూరు మండలం నూతలపాడులో 10 ఎకరాలు తవ్వేశారు. అందులో రేగడి తర్వాత మంచి గ్రావెల్‌ వచ్చింది. మెరకలు, రోడ్లకు 10 కిలో మీటర్ల వరకు ఈ గ్రావెల్‌ తరలించారు. సాగర్‌ ఆయకట్టుకు కూడా ఈ గ్రావెల్‌నే వాడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top