పీడీసీసీబీ పీఠంపై ‘దేశం’ కన్ను


ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (పీడీసీసీబీ) పీఠంపై తెలుగుదేశం పార్టీ కన్ను పడింది. ఎలాగైనా బ్యాంకు చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. వాస్తవానికి బ్యాంకు పాలకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లేకపోయినా అడ్డదారుల్లోనైనా కైవసం చేసుకుని బ్యాంకుపై పచ్చ జెండా ఎగురవేసేందుకు దేశం నాయకులు తహతహలాడుతున్నారు.



ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఇతర పార్టీల జెడ్పీటీసీ సభ్యులను లోబరుచుకున్న విధంగానే బ్యాంకు డెరైక్టర్లను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోంది. బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబుపై అవిశ్వాసం పెట్టి దించేసి ఆ పదవిని లాక్కునేందుకు తెరచాటున ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు బ్యాంకు డెరైక్టర్లు, బ్యాంకు చైర్మన్ పదవి తమకేనంటూ బ్యాంకు డెరైక్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  



 పీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు గతేడాది మేలో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈదర మోహన్‌బాబు బ్యాంకు చైర్మన్‌గా, వైస్‌చైర్మన్ కండే శ్రీనివాసులు ఎన్నికయ్యారు.  ఈదర మోహన్‌బాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికి వారి గెలుపు కోసం కృషి చేశారు.



అధికారికంగా టీడీపీలో చేరనప్పటికీ ఆ పార్టీ సానుభూతిపరునిగానే వ్యవహరిస్తున్నారు. సొసైటీలకు నిధుల కేటాయింపు విషయంలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అధ్యక్షులు అడిగిన మేరకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు.



 అవిశ్వాసానికి పావులు కదుపుతున్న నేతలు: ఈదర మోహన్‌బాబుపై అవిశ్వాసం ప్రకటించి ఆయనను పీడీసీసీబీ చైర్మన్ పదవి నుంచి దించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం సొసైటీ ఎన్నికలు జరిగినప్పుడే టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఒక డెరైక్టర్, అద్దంకి ప్రాంతానికి చెందిన మరో డెరైక్టరు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు అవసరమైన మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నులై ఉన్నారు. గతంలో చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఒక డెరైక్టర్ సుదీర్ఘకాలంగా సొసైటీ అధ్యక్షునిగా పనిచేస్తుండడంతో తనకున్న పరిచయాలను కూడా వినియోగించుకుని డెరైక్టర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.



బ్యాంకు పాలకవర్గంలో మొత్తం 21 మంది డెరైక్టర్లుంటారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు బ్యాంకు డెరైక్టర్లలో 50 శాతం మందికి పైగా మద్దతు అవసరం. అంటే కనీసం 11 మంది డెరైక్టర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు పెట్టాలి. బ్యాంకు చైర్మన్‌పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ (ఆర్‌సీఎస్)కు వీరు వినతిపత్రం ఇవ్వాల్సి ఉంటుంది.



 కనీసం నలుగురు డెరైక్టర్లు ఆర్ సీఎస్ సమక్షంలో సంతకం చేసి అవిశ్వాస ప్రతిని ఆయనకు అందజేయాల్సి ఉంటుంది. అవిశ్వాసం నెగ్గేందుకు మొత్తం డెరైక్టర్లలో మూడింట రెండు వంతుల మంది మద్దతు తెలపాలి. అంటే కనీసం 14 మంది డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినప్పుడే అవిశ్వాసం నెగ్గుతుంది.



బ్యాంకు పాలకవర్గంలో ప్రస్తుతమున్న సంఖ్యాబలం ప్రకారం  చైర్మన్ ఈదర మోహన్‌బాబుకు 14 మంది డెరైక్టర్ల మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు వీరిలో కనీసం నలుగురు డెరైక్టర్లు ఆ ప్రతిపాదనపై సంతకం చేయాలి.



 ఏడుగురు డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు డెరైక్టర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అద్దంకి ప్రాంతానికి చెందిన బ్యాంకు డెరైక్టర్ తనకు మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి ఆశీస్సులున్నాయని చెప్పుకుంటూ డెరైక్టర్ల మద్దతును కూడగట్టే పనిలో ఉన్నారు.



 బ్యాంకు పాలకవర్గంలో చైర్మన్ తరువాత ముఖ్యస్థానంలో ఉన్న ఒక నేత కూడా సొసైటీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ బ్యాంకు చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన డెరైక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ డెరైక్టర్లను కూడగట్టేపనిలో ఉన్నారు. కొందరు డెరైక్టర్లతో ఇటీవల ఆయన సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.

 ఉద్యోగుల సహకారం



 బ్యాంకు చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేతలకు కొందరు బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులు కూడా తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. కొందరు విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు కూడా డెరైక్టర్ల మద్దతును కూడగట్టే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తటస్థంగా ఉండగా మిగిలిన వారు మాత్రం బ్యాంకు చైర్మన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు. దీంతో బ్యాంకు పరిపాలనలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విషయాన్ని ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు.



 అవిశ్వాస ప్రయత్నాలు నిజమే..

 తనపై అవిశ్వాసం ప్రతిపాదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు ధ్రువీకరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top