తన్నుకుంటున్న తమ్ముళ్లు

తన్నుకుంటున్న తమ్ముళ్లు - Sakshi


* అధికార పార్టీలో బయటపడుతున్న లుకలుకలు

* ఎక్కడికక్కడ వర్గాలుగా విడిపోతున్న టీడీపీ నేతలు

* పలుచోట్ల పరస్పర ఆరోపణలతో వీధికెక్కుతున్న వైనం

* కొన్నిచోట్ల అంతర్గతంగా రగులుతూనే ఉన్న గొడవలు

* కొన్ని జిల్లాల్లో రాష్ట్ర మంత్రుల మధ్యే పంచాయతీలు


 

సాక్షి నెట్‌వర్క్: అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటాయో లేదో తెలుగుదేశం పార్టీలో గూడుకట్టుకున్న గ్రూపు తగాదాలు బట్టబయలవుతున్నాయి. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య ఆర్డీవో బదిలీ వ్యవహారంలో సచివాలయం సాక్షిగా సాగిన చిచ్చు.. శుక్రవారం కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేసినేని నాని మధ్య ఆధిపత్య పోరు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. రాజధాని సలహా కమిటీలో కొనసాగడానికి విముఖత చూపిన ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి తన మనసులోని అసంతృప్తిని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాహాటంగానే వ్యక్తం చేశారు.ఆయన పరోక్షంగా ముఖ్యమంత్రి వ్యవహార శైలినే తప్పుబట్టారు.

 

 మిగిలిన వారిని డమ్మీలుగా చేస్తున్నారు...

 అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు కొందరికే ప్రాధాన్యతనిస్తూ మిగిలిన వారిని డమ్మీగా చేయడాన్ని చాలా మంది మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.సీఎం కొందరికే ప్రాధాన్యతనిస్తున్నందున జిల్లాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది.

 

 సిక్కోలులో అలకలు, విభేదాలు...

 శ్రీకాకుళం జిల్లా పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. సీనియర్  ఎమ్మెల్యే శ్యామసుం దర శివాజీ స్వపక్షంలో విపక్షంలా అధికారులు, టీడీపీ నేతలపైనే ప్రశ్నల వర్షం కురిపిస్తూ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. తనను గౌరవించడం లేదని తాజాగా శుక్రవారం జడ్‌పీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ రవికుమార్, మంత్రి అచ్చెన్నాయుడిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కళా వెంకట్రావు కూడా మౌనంగా ఉంటున్నారు. మంత్రి అచ్చెన్న, ఎంపీ రామ్మోహన్‌నాయుడు (బాబాయ్, అబ్బాయ్) మధ్య కూడా పొసగడం లేదన్నది పార్టీలో ప్రచారం.

 

 విజయనగరంలో మంత్రితో పొసగదు...

 విజయనగరం జిల్లాలో మంత్రి కిమిడి మృణాళినితో పార్టీ ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ అధ్యక్షునికి ఏమాత్రం పొసగడంలేదు. మంత్రి తీరును శాసనసభ్యులు కొండపల్లి అప్పలనాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, జడ్‌పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ విభేదిస్తున్నారు.

 

 విశాఖలో మంత్రుల మధ్యే చిచ్చు...

 విశాఖ ఆర్డీవో బదిలీ వ్యవహారంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య రచ్చ అధికారులను ఇరుకున పడేసింది. చివరకు ఈ విషయంపై సీఎం వద్ద పంచాయతీ సాగింది. జిల్లాలోని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నిలువునా చీలిపోయారు.దీంతో జీవీఎం సీ పరిధి వరకు గంటా, రూరల్ జిల్లా అయ్యన్న చూసుకోవాలని బాబు చెప్పారు.

 

 కృష్ణాలో భగ్గుమన్న విభేదాలు...

 విజయవాడ ఎంపీ  కేశినేని శ్రీనివాస్ (నాని) శుక్రవారం ఇద్దరు మంత్రుల సమక్షంలో చేసిన బహిరంగ విమర్శలు జిల్లా పార్టీలో కలకలం రేపాయి. శనివారం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై విమర్శలు గుప్పించడంతో గ్రూపు తగాదాలు ముదిరి పాకాన పడ్డట్లయింది. కాగిత వెంకట్రావు, వంశీ, మండలి బుద్ధప్రసాద్ కూడా మంత్రి ఉమకు చాలా దూరంగా ఉన్నారు.

 

  స్పీకర్ - మంత్రి చెరో దారి...

 గుంటూరు జిల్లాలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాద్ మధ్య విబేధాలు ఎన్నికల సమయం నుంచి కొనసాగుతున్నాయి. మంత్రి పదవి రాకపోయినప్పటికీ కోడెల జిల్లా రాజకీయాలపై పట్టు కొనసాగిస్తున్నారు. సీఐల బదిలీల్లో కోడెల వర్గం మాట చెల్లుబాటైంది. దీంతో నామినేటెడ్ పోస్టులు ఆశించే నేతలు మంత్రి కంటే స్పీకర్‌ను కలుస్తున్నారు. పుల్లారావు మాటలను అధికారులు పట్టించుకోకపోవడంతో నాయకులు మరో మంత్రి రావెల కిషోర్‌ను కలుస్తున్నారు. గుంటూ రు ఎంపీ గల్లా జయదేవ్‌తో సీనియర్ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్ర, ధూళిపాళ్ల నరేంద్రలకు ఎన్నికలప్పటి విభేదాలు కొనసాగుతున్నాయి.

 

 ‘గోదావరి’లో అంతర్గత భుగభుగలు...

 పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. తాడేపల్లిగూడెం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొట్టు సత్యనారాయణను పార్టీలో చేర్చుకుంటే తామంతా బయటకు వెళ్లిపోతామని నాయకులు ఈ నెల 12న ఉంగుటూరు మండలం కైకరంలో జరిగిన రైతు సాధికారిక సదస్సులో చంద్రబాబు ముందే హెచ్చరించారు. దీంతో ఆయన చేరిక వాయిదా పడింది. తూర్పుగోదావరి జిల్లానుంచి  హోంశాఖ మంత్రిగా చినరాజప్ప ఉన్నప్పటికీ తమకు ఎలాంటి పనులు కావడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. అంతా సీఎం చూసుకుంటున్నారని మంత్రి చేతులెత్తయడంతో పార్టీ నేతలకు పెద్దదిక్కు లేకుండా పోయారు.

 

 అనంతలో తారాస్థాయికి: అనంతపురంలో మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. సునీత వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబుకు కేశవ్ ఈ నెల 25న ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది.  కేశవ్‌కు మంత్రి పదవి ఇచ్చి సునీతను తప్పిస్తారంటూ జిల్లాలో సాగుతున్న ప్రచారంతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

 

 కర్నూలులో కేఈ - టీజీల కయ్యం...

 కర్నూలులో ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తికి, మాజీ మంత్రి టి.జివెంకటేశ్‌కు ఏమాత్రం పొసగడంలేదు. జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య కూడా విబేధాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. వైఎస్‌ఆర్ జిల్లాలో పార్టీ నేతలు రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్.వి.సతీష్‌రెడ్డిల మధ్య ఏమాత్రం పొసగడం లేదు.

 

ఉమపై బాబుకు మూకుమ్మడి ఫిర్యాదు!

సాక్షి, విజయవాడ బ్యూరో: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై కృష్ణా జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఎంతో కాలంగా గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని శుక్రవారం బహిర్గతం చేయడంతో ఆయనకు పార్టీలోని ఉమ వ్యతిరేకుల నుంచి మద్దతు లభిస్తోంది. ఉమ తీరు మార్చుకోక పోతే పార్టీ బతకడం కష్టమేనని సీఎం చంద్రబాబుకు మూకుమ్మడిగా ఫిర్యాదు చేయాలన్న ఆలోచనకు వచ్చా రు.

 

 డ్వాక్రా సంఘాల ముసుగులో ఉమ ఇసుక మాఫియాను నిర్వహిస్తున్నారనీ, ఇటీవల జరిగిన బదిలీల్లో భారీ ఎత్తున లబ్ధి పొందారనే వివరాలను చంద్రబాబుకు అందించాలని వారు తీర్మానించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఉమపై  తన విమర్శలు, ఆరోపణలు నూరు శాతం నిజమేనని శనివారం బాబుతో భేటీ సందర్భంగా కూడా కేశినేని చెప్పినట్లు సమాచారం. జిల్లా బాధ్యత మొత్తం ఉమ చేతిలో పెడితే పార్టీకి, ప్రభుత్వానికి త్వరలోనే చెడ్డపేరు ఖాయమని వివరించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

 

 సీఎం మందలించారు: కేశినేని

హైదరాబాద్: పార్టీ అంతర్గత సమస్యలపై బహిరంగంగా మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారని, తన తప్పును సరిదిద్దుకుంటానని ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీపైన, ప్రభుత్వంపైన తాను చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధినేతకు వివరణ ఇచ్చేందుకు ఆయన శనివారం హైదరాబాద్ వచ్చారు. నాని సచివాలయానికి చేరుకొని చంద్రబాబుని కలిసేందుకు మూడు గంటల పాటు నిరీక్షించారు.

 

 సచివాలయంలో సంక్షేమ పథకాలపై మంత్రులతో సమీక్షలో ఉన్న చంద్రబాబు తన కోసం వేచి ఉన్న నానిని తన కాన్వాయ్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. తనను మందలించారని చెప్పారు. ఏడు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదని, అధికారుల పనితీరు మారాలనే అలా మాట్లాడానని వివరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో లోపాలను సరిచేస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారన్నారు. ఇదిలావుటే.. మంత్రి ఉమకు, ఎంపీ నానికి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని బాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది.

 

 నెల్లూరులో నారాయణపై అసంతృప్తి

 ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి నారాయణ తీరుపై నెల్లూరు జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చంద్రబాబు దగ్గర ఉన్న పలుకుబడితో నారాయణ తమను ఖాతరు చేయడంలేదని జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గుర్రుగా ఉన్నారు.  నారాయణకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జిల్లా పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా మంత్రి నారాయణపై అసంతృప్తితో ఉన్నారు.  జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం తదితరులు కూడా  అసంతృప్తితో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top