ఇన్‌స్పైర్‌లో టీడీపీ సొంత డబ్బా!

ఇన్‌స్పైర్‌లో టీడీపీ సొంత డబ్బా! - Sakshi


తిరుచానూరు : సొంత డబ్బా కొట్టుకునేందుకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ వేదికయింది. వంద రోజుల పాలన గురించి మంత్రి ప్రభుత్వాన్ని, సీఎం ను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా మార్చివేశారు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి సొంత డబ్బాకే అధిక ప్రాధాన్యమిచ్చారు.



మంత్రి వర్గం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఎటువంటి పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకునే నేర్పు సీఎం చంద్రబాబుకే సొంతమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చుడుతున్నారని, అవినీతి రహిత రాష్ట్రంగా, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ఆయన నిర్విరామంగా పనిచేస్తున్నారని, అలాగే అధికారులతో పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు.

 

భోజనాలు లేక అవస్థలు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ ప్రారంభిం చారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే అధికారుల చేతకానితనం వల్ల ఎగ్జిబిషన్‌కు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు భోజనాలు అందక అవస్థలు పడ్డారు. దీనికి తోడు మంత్రి ఆలస్యంగా రావడం, సమావేశం పూర్తవ్వడానికి మధ్యాహ్నం ఒంటిగంట పైగా కావడంతో ఇబ్బం దులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం 3 గం టలైనా భోజనాలు చాలా మందికి అందలేదు. దీంతో పలువురు హోటల్స్‌లో తినాల్సి వచ్చిం ది.  దీనికి తోడు ఒకే ప్రాంతంలో అన్నం వడ్డిం చడం, అక్కడే తినాల్సి రావడంతో తొలిరోజే అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ఆటవిడుపు కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ కళాకారుడు, నటుడు శాంబోలా హరినాథ్ మిమి క్రీ, కీలుగుర్రం ప్రదర్శనలు అలరించాయి.

 

వేదికంతా పసుపు చొక్కాలే

ప్రభుత్వ కార్యక్రమమైన ఇన్‌స్పైర్‌కు పసుపు రంగు అంటుకుంది. వేదికపై మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చోవాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు టీడీపీ నాయకులను ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టడంతో విద్యాశాఖ అధికారులు విమర్శల పాలయ్యారు.

 

ఇరుకైన గదుల్లో నమూనాలు

రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ఇరుకైన గదుల్లో ఏర్పాటుచేశారు. దీంతో విద్యార్థులు తమ నమూనాలను ఇరుకైన గదుల్లోనే ఏర్పాటుచేసుకున్నారు. పట్టుమని పది మంది సందర్శకులు నమూనాలను తిలకించలేని పరిస్థితి ఎదురయ్యింది. దీనికి తోడు వర్షం కురవడంతో పాఠశాల ఆవరణం బురదమయంగా మారింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top