‘ఉయ్’ఆర్వోలు


ఒంగోలు టౌన్ : పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.. జిల్లా యంత్రాంగంపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమకు అనుకూలమైన వారిని అందలాలు ఎక్కించడం, ప్రతిపక్షపార్టీ సానుభూతి పరులుగా ముద్ర పడిన వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం పనిగా పెట్టుకుంది. రెవెన్యూ శాఖలో కీలక గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)పై అధికార పార్టీ నేతల కన్నుపడింది.



రెండు రోజుల పాటు జరిగిన బదిలీల్లో వీఆర్వోలను ఉయ్(మా) ఆర్వోలుగా మార్చేసుకోవడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో పాటు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు చెప్పిన వారికే కోరుకున్నచోట్ల పోస్టింగ్‌లు ఇప్పించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో 750 మంది గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా 20 శాతానికి మించి బదిలీలు జరగకూడదు.



అదికూడా ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు నిండిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది. పెపైచ్చు గతంలో గ్రామ రెవెన్యూ అధికారులను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేశారు. తాజాగా రెండు విడతలుగా గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేశారు. ఒకసారి 74 మందిని, మరోసారి 74 మందిని బదిలీ చేశారు.



 ష్... గప్‌చిప్!

 ప్రస్తుత బదిలీలు అత్యంత గోప్యంగా జరిగాయి. గతంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాల ప్రతినిధులను పిలిపించి వారి సమక్షంలో బదిలీ ప్రక్రియ పూర్తి చేసేవారు. చివరకు ఆ జాబితాలను గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాలకు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. కొంతమంది సంఘాల నాయకులు చివరకు పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి బదిలీల జాబితా అధికారికంగా వచ్చిందా, అందులో ఎవరి పేర్లు ఉన్నాయని విచారించడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా యంత్రాంగం కూడా అధికాార పార్టీ శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు చెప్పిన వారికే ప్రాధాన్యం ఇచ్చారు.



 ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతర్

 జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారుల్లో ఎక్కువ మంది బూత్ లెవల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఎన్నికల సంఘం విధుల్లో పాలుపంచుకుంటున్న వారిని బదిలీ చేయరాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు జిల్లాల స్థాయిలో అమలు కావడం లేదనేందుకు ప్రస్తుతం జరిగిన గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలే ఉదాహరణగా చెప్పవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top