టీడీపీ నేతల లిక్కర్ దందా !

టీడీపీ నేతల లిక్కర్ దందా ! - Sakshi


- పేట యువనేత అరాచకం

- యల్లమంద సొసైటీ మాజీఉపాధ్యక్షుని పరిస్థితి విషమం

- సూసైడ్ నోట్‌పై ఆరా తీస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు

- నేడు గుంటూరులో గురజాల మద్యం వ్యాపారుల సమావేశం

సాక్షి ప్రతినిధి, గుంటూరు :
మద్యం షాపుల కేటాయింపులో యువ నాయకుడు తమకు అన్యాయం చేశాడంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యల్లమంద సొసైటీ వైస్ చైర్మన్ పరిస్థితి విషయంగా ఉంది. నరసరావుపేట పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. బీపీ లెవల్స్ క్రమంగా తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న గ్రామస్తులు ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. వెంటిలెటర్ల మీద చికిత్స అందిస్తున్నామని వైద్యులు బాధితుల బంధువులకు చెప్పినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా సాక్షిలో వచ్చిన కథనం నియోజకవర్గంలో కలకలం రేపింది.



యల్లమంద వైన్‌షాపును టెండర్ దక్కించుకున్న వ్యాపారిని సాక్షిలో వచ్చిన కథనంపై ఖండన ఇవ్వాలని యువ నాయకుని సలహాదారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. సామాన్యులు ఆత్మహత్యాయత్నం చేస్తే నానా హడావుడి చేసే పోలీసులు ఈ వ్వవహారంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సొసైటీ ఉపాధ్యక్షుడి ఆత్మహత్యాయత్నంపై జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ దృష్టి సారించినట్టు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు రాసిన సూసైడ్ నోట్‌పై స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తున్నారు.

 

గుంటూరులో నేడు సమావేశం

గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాలకు చెందిన మద్యం వ్యాపారులతో ఆ నియోజకవర్గ ముఖ్యనేత సోమవారం గుంటూరులో సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీవర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో మద్యం దుకాణాలు లభించిన వీరంతా ఆ నియోజకవర్గ నాయకుని ఆదేశాల మేరకు సమావేశానికి వెళుతున్నారు. నియోజకవర్గ పరిధిలో  వ్యాపారం చేసుకునే ప్రతీ వ్యాపారి తమకు 50 శాతం వరకు వాటా ఇవ్వాల్సిందేనని హుకుం చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని గురజాలలో ఒకటి ప్రభుత్వ మద్యం దుకాణం కాగా ఐదు ప్రైవేటు దుకాణాలు ఉన్నాయి. దాచేపల్లిలో ఐదు ప్రైవేటు దుకాణాల్లో నడికుడి మద్యం దుకాణంపై ముఖ్యనేత కన్ను పూర్తిగా పడింది.



రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా గతంలో రూ.5 కోట్లకు దీనిని వేలంలో కైవసం చేసుకున్నారు. పైగా ఇక్కడ మద్యం అమ్మకాలు ఎక్కువుగా  ఉండటంతో ఈ షాపును పూర్తిగా తమకే కావాలంటూ ఆ నేత డిమాండ్ చేస్తున్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. మాచవరంలోని మూడు దుకాణాలు, పిడుగురాళ్ళ పట్టణంలోని ఒకటి ప్రభుత్వ దుకాణం కాగా తొమ్మిది దుకాణాల్లో కూడా వాటాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 22 ప్రైవేటు మద్యం దుకాణాలు, రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవికాక మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో ఉన్న మూడు మద్యం దుకాణాల్లో వాటాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. వీరంతా ముఖ్యనేత ఆదేశాల మేరకు గుంటూరు సమావేశానికి వెళుతున్నట్టు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top