భూసేకరణ పేరుతో టీడీపీ అక్రమాలు


విశాఖపట్నం : పీసీపీఐఆర్, వీసీఐఆర్‌ పేరుతో అధికార పార్టీ భూ అక్రమాలకు పాల్పడుతోందని  మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు డీవీ సూర్యనారాయణరాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన  నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడారు.



టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులకు భూసేకరణ వరంగా మారిందన్నారు. ప్రభుత్వ భూములను తమ అనుచరుల పేరున మార్చి రూ.కోట్లలో పరిహా రం కాజేసేందుకు పావులు కదుపుతున్నారని విమర్శించారు.  నక్కపల్లి మండలంలో అమలాపురం, రాజయ్యపేట, నెల్లిపూడి, డీఎల్‌పురం, వేంపాడు గ్రామాల్లో  భూ దందా జరుగుతోందన్నారు. అధికారుల సహాయంతో ఇష్టానుసారం రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వభూములు కొల్లగొట్టి కోట్లాదిరూపాయల పరిహారం స్వాహ చేయడానికే ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఏర్పాటుచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను దివంగత సీఎం వైఎస్‌ హయాంలో పేదలకు పంపిణీ చేస్తే వాటిని టీడీపీ మాత్రం తమ కార్యకర్తలకు, పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేయాలని చూస్తోందన్నారు.



ప్రభుత్వ ఆస్తులు కాపాడి, పరిహారం పక్కదారిపట్టకుండా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. రాజయ్యపేటలో కోట్లాదిరూపాయల విలువైన దేవుడి భూముల పరిహారాన్ని కొంతమంది పెద్దలు తన్నుకు పోదామని ప్రయత్నిస్తున్నారని ఈవిషయంలో న్యాయం జరిగే వరకు రాజయ్యపేట గ్రామస్తులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు. రాజయ్యపేట వ్యవహారంలో ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల్లో జరుగుతున్న అవకతవకలను బయటకు తీసి బాధ్యులపై చర్యలు తీసుకుని, పరిహారాన్ని గ్రామానికి  అందజేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ సమన్వయకర్తలు వీసం రామకష్ణ, చిక్కాల రామారావు పాల్గొన్నారు.





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top