టీడీపీ నాయకుల జేబుల్లోంచి జీతాలు ఇవ్వట్లేదు..

టీడీపీ నాయకుల జేబుల్లోంచి జీతాలు ఇవ్వట్లేదు..


నిడమర్రు (మంగళగిరి రూరల్)

 అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము అని, టీడీపీ నాయకుల జేబుల్లో నుంచి కాదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నిడమర్రులో పొలం పిలుస్తోంది కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయనకు రైతులతోపాటు ప్రజాప్రతినిధులు తమకు కార్యక్రమంపై సమాచారం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే వ్యవసాయశాఖాధికారి బి.శ్రీకృష్ణదేవరాయలు, వ్యవసాయ విస్తరణాధికారి భాగ్యరాజులను ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలం పిలుస్తోంది ఉద్దేశం ఏమిటో రైతులకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహణ ఎందుకు అంటూ ధ్వజమెత్తారు. గత నెల 16న మంగళగిరి టీడీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి ముఖ్యఅతిథిగా ఆహ్వానించి నీరుకొండలో కార్యక్రమం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంపై ఏడీఏ వివరణ ఇవ్వాలని ఫోన్‌లో ఆదేశించారు. వెంటనే ఏడీఏ తిరుమలాదేవి నిడమర్రు చేరుకున్నారు. కిందిస్థాయి సిబ్బంది తప్పిదంతో పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం ప్రొటోకాల్ ఉల్లంఘన కింద వస్తుందని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందిస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి పాల్గొన్నారు. వ్యవసాయాధికారుల వ్యవహారశైలికి నిరసనగా ఎమ్మెల్యే ఆర్కే, సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమకొండ్ల నాగరత్నం తదితరులు కార్యక్రమాన్ని బహిష్కరించారు.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top