రగులుతున్న చిచ్చు

రగులుతున్న చిచ్చు - Sakshi


జిల్లా టీడీపీలో రేగిన గంటా మంట

చిర్రెత్తి పోతున్న బంగ్లా నేతలు

♦  అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న కేడర్‌  

అధ్యక్ష ఎన్నిక తాత్సారంపై మండిపాటు

బంగ్లా రాజకీయాలకు  చెక్‌పెట్టాలన్నదే  అధిష్టానం యోచన

దీటుగానే పావులు కదుపుతున్న అశోక్‌




జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక రాష్ట్ర కమిటీకి కొరకరాని కొయ్యగా మారింది. ముందుకెళ్తే గొయ్యి... వెనక్కెళితే నుయ్యిలా... అధిష్టానానికే తయారైంది. ఇప్పటివరకూ అశోక్‌ కనుసన్నల్లోనే ఎంపిక చేసే ఆనవాయితీని ఈసారి కాదని కొత్త పద్ధతిలో చేపడుతుండటంపై బంగ్లా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఆయన వర్గీయులు పార్టీ పరిశీలకునిగా వచ్చిన గంటా తీరుపై మరింత రగిలిపోతున్నారు. తమ నాయకుడ్ని కాదని వ్యవహరించి... ఆయన హవాకు చెక్‌ పెట్టాలని చూస్తే... పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పకనే చెబుతున్నారు. దీనిపై అధిష్టానం సైతం ఆచితూచి వ్యవహరిస్తుండటంవల్లే మహానాడు జరిగిపోతున్నా... దీనిపై ఎటూ తేల్చకుండా నాన్చుతోంది.



సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో 12జిల్లాల తెలుగుదేశంపార్టీ అధ్యక్ష పదవులకు  ఎన్నిక జరిగిపోయింది. ఒక్క విజయనగరమే మిగిలింది. సాధారణంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల ఎంపిక మహానాడుకు ముందే పూర్తవ్వాలి. కానీ ఈసారి ఆ సంప్రదాయం కొనసాగలేదు. ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ఇన్‌చార్జి మంత్రిగా వచ్చిన గంటా శ్రీనివాసరావు మంట పెట్టారని ఇక్కడి పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. సీనియర్‌ నేత అశోక్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఎప్పుడూ లేని పరిస్థితిని తీసుకొచ్చారని వాదిస్తూనే... అధిష్టానం ప్రోత్సాహం లేకుండా మంత్రి గంటా అంత ధైర్యం చేయగలరా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంస్థాగత ఎన్నికల పరిశీలకునిగా అధిష్టానం ఎవర్ని నియమించినా అశోక్‌ బంగ్లాకొచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోవడమే తప్ప ఫలానా వ్యక్తిని నియమించాలి... ఫలానా వ్యక్తిని నియమించొద్దని చెప్పిన సందర్భాల్లేవు. అశోక్‌ ఎవరి పేరు చెబితే ఆ పేరును ఖరారు చేసేయడమే ఇక్కడి సంస్కృతి. పార్టీలోని యోధానుయోధులు వచ్చినా... 35 సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీ. ఈ సారి సీన్‌ రివర్స్‌ అయ్యింది. అశోక్‌ నియంతృత్వ పోకడకు చెక్‌ పడింది. ఆ మధ్య అమరావతిలో జరిగిన పార్టీ సమీక్షలోనూ చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా వేరే నియోజకవర్గాల్లో వేలు పెట్టనివ్వకుండా అడ్డుకట్ట వేశారు. వాళ్లు చూసుకుంటారనే ధోరణిలో స్థానిక నేతలకే ప్రాధాన్యం ఇచ్చారు.



మొదలైన వ్యతిరేక అడుగులు

నేరుగా అశోక్‌ను దిగజార్చితే పార్టీ పరంగా ఇబ్బందులొస్తాయని అధిష్టానం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఆయన మాటకు, ఆయన అనుయాయులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందని భావిస్తోంది. మొన్న శత్రుచర్ల విజయరామరాజుకు, నిన్న సుజయకృష్ణ రంగారావుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడేమో అశోక్‌ అనుంగు శిష్యుడిగా ఉన్న ద్వారపురెడ్డి జగదీష్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే చాలని భావిస్తోంది. అం దుకనే ఎవరేమన్నా, అశోక్‌ ఎంత చెప్పినా ద్వారపురెడ్డి జగదీష్‌ను తొలగించాలన్నదే అధిష్టానం భావన. ఆ వ్యూహంతోనే అధ్యక్ష పదవి ఎంపిక ఖరారు చేయకుండా అధిష్టానం తాత్సారం చేస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ అశోకే వెనక్కి తగ్గుతారని... అధి ష్టానం దారికొస్తారని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలని కూడా చూస్తోంది. దీనికంతటికీ గంటా శ్రీనివాసరావును సూత్రధారిగా వాడుకుంటోంది. భవిష్యత్‌ రాజకీయాలు, 2019ఎన్నికలు, సామాజిక వర్గ సమీకరణల దృష్ట్యా గంటాను రంగంలోకి దించి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.



దీటుగానే అశోక్‌ వ్యూహాలు

అధిష్టానం వ్యూహాలకు దీటుగానే అశోక్‌ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తన మాటే చెల్లుబాటు కావాలన్నట్టుగా జగదీష్‌ పేరును చెప్పి సినిమా చూస్తున్నారు. అధి ష్టానం ఏం చేస్తుందో చూద్దామనే ధోరణిలో ఉన్నారు. మినీ మహానాడుకు హాజరు కాకపోవడం వెనక ఇదే కారణమని తెలుస్తోంది. తనకున్న విలువేంటో ఈ దెబ్బతో తేలిపోతుందని భావిస్తున్నట్టు తెలిసింది. తనను కాదని చేసే పరిస్థితి ఇక్కడ లేదన్న ధీమాతో ఉన్నట్టు సమాచారం. అందుకు భిన్నంగా జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని, ముందుంది మొసళ్ల పండ గ అని అశోక్‌తో పాటు ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top