ఏడాదిలో ఎంతో చేశాం..


- ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శిస్తాయి

- వాటిని పట్టించుకోనవసరం లేదు..

- మినీ మహానాడులో టీడీపీ నేతలు

సాక్షి, విశాఖపట్నం :
‘స్వలాభం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో అప్పగించారు. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.  అయినాసరే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. పింఛన్లు ఐదురెట్లు పెంచాం.. రైతులకు రుణమాఫీ చేశాం.. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తున్నాం.. ఇలా గత ఏడాదిలో ఎన్నో చేశాం.. అయితే వాటిని ప్రజల్లోకి మాత్రం తీసుకెళ్లలేకపోతున్నాం’ అని టీడీపీ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కార్యకర్తల్లో ఒక విధమైన అసంతృప్తి.. నాయకుల్లో అభద్రతాభావం ఎందుకో అర్థం కావడం లేదు. చేసింది చెప్పుకుంటే చాలు..ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలం అని వారు వ్యాఖ్యానించారు.



టీడీపీ జిల్లా మినీ మహానాడు స్థానిక ఆంకోసా ఆడిటోరియంలో ఆదివారం అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీకీ ఎన్నికల మేనిఫెస్టో ఒక పవిత్ర గ్రంథం లాంటిదని..అందులో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు  ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  హామీలు అమలు చేయడం కాస్త ఆలశ్యం కావచ్చేమో కానీ..అమలు చేయడం మాత్రం పక్కా అని వ్యాఖ్యానించారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ క్రమశిక్షణ, సిద్ధాంతం గల  పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.   టీడీపీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి సముచిత గౌరవం ఇస్తామని చెప్పారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి మాట్లాడుతూ విశాఖను కాలుష్య భూతం వెన్నాడుతోందని, పోర్టు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.



పోర్టులో జరుగుతున్న డ్రెడ్జింగ్ కార్యకలాపాల వల్ల గతంలో ఎన్నడూచూడని బీచ్ తీవ్ర కోతకు గురవుతోందన్నారు. ఇక్కడ జరుగుతున్న కోర్, ఐరన్ హ్యాండలింగ్‌ను ఆపేలా చర్యలు చేపట్టాలని లేకపోతే ప్రజలు మనల్ని అసహ్యించుకుంటారని చెప్పారు. ఏడాది పాలనలో ప్రజల ఆశలకు రీచ్‌కాలేక పోయా మన్న భావన  అందరిలోనూ ఉందన్నరు. రూరల్ అధ్యక్షుడు పప్పల చలపతిరావు మాట్లాడుతూ జిల్లాపై తనకు ఎంతో అవగాహన ఉంది.. పార్టీని మరింత పటిష్ట పర్చేందుకు కృషి చేస్తానన్నారు. జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవాని మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని  చెప్పారు.



ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ వాసుల కలైన కొత్తరైల్వే జోన్ ప్రకటన ఈ వారంలోనే రానుందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో ఏపీకి ఉజ్వలభవిష్యత్ ఏర్పడిందన్నారు. మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్. మూర్తి మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న పంచగ్రామాల సమస్య, గాజువాక భూ సమస్య పరిష్కారానికి చొరవచూపాలని సూచించారు.  రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు,  ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గణబాబు, అనిత, పీలా గోవింద్, బండారు సత్యనారాయణమూర్తి, డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ, మాజీ మంత్రులు మణికుమారి, అప్పల నరసింహ రాజు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఎస్‌ఎ రెహ్మాన్  తదితరులు ప్రసంగించారు. పార్టీ నాయకులు పట్టాభిరామ్, అవిడి అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు.



ఎన్టీఆర్‌కు రాజకీయాలే తెలియవు

ఎన్టీఆర్‌కు రాజకీయాలు తెలియవు..ఆయనెప్పుడూ పేపర్లు చదవలేదు. మేము చెప్పిందే వినేవాడు. పేపర్ చూసారా అన్నా అని అడిగితే ఎందుకు బ్రదర్ అని ప్రశ్నించేవాడు. ఎలాంటిరాజకీయాలు తెలియకుండా రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించాడు. ఎన్టీఆర్ దయ వల్ల నేను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మూడు సార్లు ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఆయన పక్కనే కూర్చొని పనిచేసాను. నాకు పదవులు కొత్త కాదు. పదువులున్నంత వరకే మన చుట్టూ జనం ఉంటారు. ఒకసారి పదవి పోతే ఏ ఒక్కడు కన్పించడు..ఇది అనుభవంతో చెబుతున్న మాటలు. గత ముపైప మూడేళ్ల్ల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుకులు చూసాను.ఎన్నో కూర్చీలు ఎక్కాను.. కుర్చీల కింద కూడా కూర్చున్నాను. పదవులున్నా లేక పోయినా పార్టీ కోసమే పనిచేసాను. అలాగే పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు కూడా పదవుల ఆశించడంలో తప్పేమి లేదు. అలాగని అందరికీ సంతృప్తి పర్చడం సాధ్యం కాదు. పదువుల పందారంలో 1983 నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే ముందు పీట వేయాలి. మధ్యలో వచ్చిన వారికి ఆ తర్వాత స్థానం కల్పించాలి.



రేపు నేను వేరే పార్టీలోకి వెళ్లొచ్చు

ఈరోజు నేను ఈ పార్టీలో ఉండోచ్చు..రేపు వేరే పార్టీలోకి వెళ్లొచ్చు..ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం. అయినా సరే నా వెంట రాకుండా పార్టీ కోసమే పనిచేసేలా కార్యకర్తలుండాలి. అలాంటి కార్యకర్తలకే కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలి. మరో పక్క కనీసం ఒక్క సీటు కాని కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించి పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారు. ఆర్ధిక ఇబ్బందులన్నా చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేశాడు.రూ.200ల పించన్‌ను 1000లు, 1500లు పెంచారు. చంద్రబాబు రూ.75లు ఇ చ్చిన పింఛన్ మొత్తాన్ని 200లు పెంచానని సా గదీస్తూ చెప్పేవారు. ఇప్పుడు ఆ రూ.200ల నుంచి ఏకంగా ఐదురెట్లు పెంచాం. మనమెంత సాగ దీసుకుని చెప్పాలో మీరే ఆలోచించండి. రైతురుణమాఫీ చేసాం. డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నాం. నీరు చెట్టు అమలు చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు కాదా అని ప్రశ్నించారు. వీటిపై రాజకీయ అవగాహన లేకుండా ఇష్టమొచ్చి నట్టు విమర్శలుచేయడం సరికాదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top