లాడ్జిలో ఆడింది టీడీపీ నేతలే

లాడ్జిలో ఆడింది టీడీపీ నేతలే


 పార్వతీపురం : పట్టణ మెయిన్ రోడ్డులోని సాయిష్ పేలస్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కొంతకాలంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల ఆట కట్టించడమే కాకుండా  పట్టుబడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పట్టణ ఎస్సైలు వి.అశోక్‌కుమార్, బి.సురేంద్రనాయుడులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ 104వ నంబర్ గదిలో పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ బావమరిది, పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి సోదరుడు అయిన అక్కేన శ్రీనివాసరావు,  టీడీపీ 22వ వార్డు కౌన్సిలర్ కోరుకొండ ఉమాదేవి భర్త  కోరుకొండ శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు కోమటి వెంకటరావు, 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరిన కౌన్సిలర్ గుంట్రెడ్డి పార్వతి భర్త గుంట్రెడ్డి రవికుమార్, త్రిపురనేని రవికుమార్ తదితర జూదర్లను అదుపులోకి తీసుకుని, రూ.9,690లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సాయిష్ పేలస్ గేటు వద్ద  అనుమానాస్పదంగా కనిపించిన 26వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రెడ్డి రవికుమార్‌ను రూ.2లక్షల నగదుతో అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 107, 109వ నంబర్ల గదుల్లో అనుమానాస్పదంగా ఉన్న వి.గోవింద్, జోగిల రెడ్డి, మూడడ్ల శ్రీధర్‌లను అదుపులోకి తీసుకుని వారి దగ్గర రూ.55వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు తరలిస్తున్నామన్నారు.  

 

 సాయిష్ పేలస్‌ను కాపాడే పనిలో పోలీసులు...!

 కొంత కాలంగా సాయిష్ పేలస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు.. విజయనగ రం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జరిపిన మెరుపుదాడిలో రుజువైనప్పటికీ పోలీసులు ఆ సాయిష్ పేలస్‌ను కాపాడే పనిలో ఉన్నట్లు పలువురు అనుమానిస్తున్నారు.  ఆ పేలస్ టీడీపీ నాయకుడిది కావడం వల్లే పోలీసులు అలా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజల్లో విస్తృతంగా చర్చజరుగుతోంది. ఈ విషయమై పట్టణ ఎస్సై వి.అశోక్ కుమార్ వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడమే తరువాయి సాయిష్ పేలస్‌పై చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు.  

 

 లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు...!

 పార్వతీపురం పట్టణంలోని పలు లాడ్జిల్లో స్థానిక పోలీసులు సోమవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణ ఎస్సై వి.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక గూడ్స్ షెడ్ రోడ్డులోని శ్రీలేఖతోపాటు, హరివాస్ తదితర లాడ్జిల్లో తనిఖీలు చేశారు. ఆయా లాడ్జిల్లో ఉన్న అనుమానితులను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారి ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేసి, చిరునామాలు నమోదు చేశారు. కొంతమంది స్థానికంగా పని చేస్తున్నామని చెప్పడంతో వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో...ఆయా సంస్థల యజమానులతో ఫోన్‌లో మాట్లాడి వారి వివరాలను నమోదు చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా వారం రోజుల నుంచి లాడ్జిల్లో ఉన్నవారిని ఏ పని నిమిత్తం వచ్చారని ప్రశ్నించి  తక్షణమే లాడ్జిలు ఖాళీ చేయాల్సిందిగా సూచించారు. తనిఖీల్లో ఏఎస్సై ఉమామహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top